చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | YS Jagan Slams Chandrababu Over Cancellation of Housing Plots for Poor | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Sep 18 2025 2:33 PM | Updated on Sep 18 2025 3:49 PM

YS Jagan Slams Decision to Revoke Housing Plots for the Underprivileged

సాక్షి,తాడేపల్లి: పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.  

‘చంద్రబాబు గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

చంద్రబాబుగారూ మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా  మిగిలిపోయారు. కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్‌ చేయించాం. ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్‌ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటే. ఇంటిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10ల‌క్ష‌లు - రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబుగారూ…, మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు.

మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్‌ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్‌లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా  ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా?  

మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40వేలు మేలు జరగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15వేలు సహాయం చేశాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8లక్షలు కాక, మొత్తంగా రూ.2.7లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కొరకు మరో రూ.1లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబుగారూ?

చంద్రబాబుగారూ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా…, కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ  16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారు?

మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? : వైఎస్ జగన్

మా హయాంలో “పేదలకు ఇళ్లు’’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు  చేయని పన్నాగంలేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా,  అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు, ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్లు మీరు బాధ్యతగా శాంక్షన్‌ చేయించి, కట్టించాల్సింది పోయి, అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, వాటిని, రిజిస్టర్‌ అయిన ఆ పట్టాలను, మీకు హక్కులేకపోయినా వెనక్కి తీసుకుని, మీ స్కాముల కొరకు, ప్రైవేటు ఇండస్ట్రియల్‌ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా, చంద్రబాబుగారూ..!

ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చినవాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్‌కు వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement