భక్తుల భద్రతపై బట్టబయలైన ప్రభుత్వ వైఫల్యం
ఆలయాల్లో భద్రతపై అడుగడుగునా నిర్లక్ష్యం
‘ప్రైవేటు’పై నెపం నెట్టడానికి శతవిధాలా ప్రయత్నం
ఇందుకు పూర్తి భిన్నంగా జగన్ ప్రభుత్వ పాలన
దేవదాయశాఖ పరిధిలో లేని గుళ్లకూ భద్రతా చర్యలు
అప్పట్లో దేవదాయ శాఖ ద్వారా ఆయా గుళ్లను నిర్వహించే వారికి నోటీసులు
తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు.. జగన్ ప్రభుత్వ చర్యలకు కూటమి సర్కార్ తూట్లు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే కూటమి ప్రభుత్వం ‘అది ప్రైవేట్ గుడి’ అంటూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. అలాంటి ప్రైవేట్ ఆలయాల్లో సైతం గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భక్తుల భద్రతకు పట్టిష్ట చర్యలు చేపట్టిందని దేవదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కేవలం పది నెలల వ్యవధిలో తిరుపతి.. సింహాచలం.. వరుస దుర్ఘటనల అనంతరం తాజాగా కాశీబుగ్గ విషాదం. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, భద్రతా చర్యల విషయంలో తన వైఫల్యాన్ని పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుండడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి తొక్కిసలాట
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరున్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో క్యూలైన్‌లో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ముక్కోటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో సర్కారు లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది.
సింహాచలం దుర్ఘటనపై ‘సమగ్ర నివేదిక’ ఊసేలేదు
సింహాచలం శ్రీవరహ లక్ష్మీనరసింహ ఆలయంలో చందనోత్సవం సందర్భంగా 2025 ఏప్రిల్ 30న మెట్ల మార్గంలో క్యూలైన్‌లో వెళుతున్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనకు సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. తిరుపతి ఘటన తర్వాత కేవలం నాలుగు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత తీసుకోలేదు.
దుర్ఘటన జరిగిన రోజున ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించి, 72 గంటల్లో ప్రాథమిక నివేదిక, 30 రోజుల్లో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 72 గంటల్లో కమిటీ అందజేసిన ప్రాథమిక నివేదిక మేరకు ప్రభుత్వం ‘తూ తూ మంత్రం చర్యలతో’ సరిపెట్టిందని విమర్శలు అప్పుడే వెల్లువెత్తాయి. ఇక ఇప్పటికి ఆరు నెలలు గడిచినప్పటికీ, దుర్ఘటనపై 30 రోజుల్లో సమర్పించాల్సిన సమగ్ర నివేదిక అంశం ఊసే లేకుండా పోయిందని దేవదాయ శాఖలో చర్చ జరుగుతోంది.
ముందు ఎక్కడాలేని హడావుడి.. ఆపై గప్‌చుప్!
సింహాచలం చందనోత్సవం కార్యక్రమాల పర్యవేక్షణ విషయంలో ప్రభుత్వం ముందస్తుగా చేసిన హడావుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కమిటీ రెండు నెలల పాటు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి.. గతంలో ఎప్పుడూలేని తీరుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తామే ప్రతి పనిని క్షుణంగా పరిశీలించామని ప్రకటించింది.
దుర్ఘటనకు 15 రోజుల ముందు ఏప్రిల్ 16వ తేదీన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఇన్‌చార్జి డోలా బాల వీరాంజనేయలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చందనోత్సవ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు.
ఏప్రిల్ 30న దుర్ఘటన జరిగిన తర్వాత మంత్రుల కమిటీ సభ్యులెవరూ బాధ్యత తీసుకోకపోవడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పెద్దలు సైతం తమ మంత్రివర్గ సహచరులను ఈ ఘటనలో బాధ్యులు చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కమిటీ 72 గంటల్లో నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా చిరు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం.. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయాయన్న విమర్శలు వచ్చాయి.
ప్రైవేటు దేవాలయాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేవదాయ శాఖ అధికారులతో 2021 సెప్టెంబరు 27వ తేదీన నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవదాయ శాఖ వద్ద నమోదు కాకుండా కొంత మంది (ప్రైవేట్) ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయాల్లో భద్రతకు పలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తుతం అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటే ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే గుళ్లలో భద్రతకు సంబంధించి ఆయా యాజమాన్యాలకు అప్పటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఆలయాల్లో కూడా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల మాదిరే సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయా ప్రైవేట్ ట్రస్టీలకు దేవదాయశాఖ నోటీసులు జారీ చేయాలని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు సంబంధించి అప్పటి సీఎం అధ్యక్షతన జరిగిన దేవదాయ శాఖ సమీక్ష వివరాలను 2021 అక్టోబరు 8 మినిట్ రూపంలో అప్పటి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ రాష్ట్ర స్థాయిలో హోం శాఖతో పాటు రెవెన్యూ, ఇతర శాఖాధిపతులకు సైతం మెమో ద్వారా తెలియజేశారు.
అప్పటి సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలతోపాటు పలు ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే దాదాపు 9,500 ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు హోం, రెవెన్యూ శాఖలు చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వం పట్టిష్ట భద్రత చర్యలను కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.


