
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్‌బాబును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్‌పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిన అశోక్‌పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్‌ని వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అణిచివేయాలని చూశారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ చేయడం అభినందనీయం. ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అశోక్‌బాబుకు అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
కాగా, సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్‌కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్‌లో స్పృహ తప్పి పడిపోయారు.
వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్‌బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.
అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్‌బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు.