‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’ | Ysrcp Legal Cell Manohar Reddy Comments On Sit Officials | Sakshi
Sakshi News home page

‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’

Aug 2 2025 7:49 PM | Updated on Aug 2 2025 8:17 PM

Ysrcp Legal Cell Manohar Reddy Comments On Sit Officials

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్‌ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్‌లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..

హైదరాబాద్‌లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 జూన్‌లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్‌కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.

సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.

సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:
హైదరాబాద్‌లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్‌కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.  వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్‌నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్‌కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్‌రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా  17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్‌లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.

అదే దర్యాప్తు అధికారి వరుణ్‌ కుమార్‌ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్‌ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్‌పైనా ఉన్న నెంబర్‌ను రికార్డు చేస్తారు.

వాటిని కోర్ట్‌కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?
విజయేందర్‌ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్‌లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్‌ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రతి కరెన్సీ నోట్‌ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్‌ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement