ఆదుకుంటాం..అధైర్య పడొద్దు ! | - | Sakshi
Sakshi News home page

ఆదుకుంటాం..అధైర్య పడొద్దు !

Aug 1 2025 11:40 AM | Updated on Aug 1 2025 11:40 AM

ఆదుకుంటాం..అధైర్య పడొద్దు !

ఆదుకుంటాం..అధైర్య పడొద్దు !

పెదకాకాని: షెడ్యూల్డ్‌ తెగల వారిని ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి భరోసా ఇచ్చారు. మండలంలోని నంబూరు యానాది కాలనీలో గురువారం ఆమె పర్యటించారు. కాలనీవాసులు వర్షాకాలంలో గుడిసెలపై కప్పుకునేందుకు వీఆర్‌ఓ సంస్థ, జేఎంజే సంస్థల ఆధ్వర్యంలో గురువారం సిల్ఫాలిన్‌ పట్టలు పంపిణీ చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరయ్యారు. ముందుగా కాలనీలో తిరిగి, నివాసితుల జీవన స్థితిగతులను పరిశీలించారు. యానాదులు సమస్యలు ఏకరువు పెట్టారు. పొలాల్లో ఎలుకకు ఉన్న విలువ కూడా తమకు లేదని కాలనీ వాసి దుర్గ ఆవేదన వ్యక్తం చేసింది. వర్షం వస్తే నీరు గుడిసెల్లోకి వస్తోందని, ఆడపిల్లలు స్నానాలు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందని తెలిపింది. పిల్లలు అంగన్‌వాడీ స్కూల్‌కు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు ప్రయాణించాలంటూ యానాదులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని పలువురు వేడుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్నారు. అర్హులైన వారందరికీ నెల రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి యానాదికాలనీ వాసులకు భరోసా ఇచ్చారు.

సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు

కాలనీలో సమయానికి తాగునీరు సరఫరా, మురుగు, వర్షపు నీరు కాలువ ద్వారా బయటకు పంపడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్‌ ప్రశ్నించారు. కాలనీలో ఇంటి స్థలం మంజూరు అనేది ప్రధాన సమస్యగా ఉందని గుర్తించారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌, ఆధార్‌, ఆరోగ్యసేవ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్‌లు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఓటు ట్రాన్స్‌ఫర్‌ పక్రియలను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. దీనికి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బందితో టీంలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పాటు గృహ నిర్మాణ శాఖ నుంచి ఇంటి నిర్మాణానికి రు. 3.25 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ తహసీల్దార్‌, ఎంపీడీఓల పర్యవేక్షణలో 15 రోజుల్లో ప్రభుత్వ పథకాల గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వర్షానికి గుడిసెలు కారకుండా సిల్ఫాలిన్‌ పట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణకాంత్‌, ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావు, గృహ నిర్మాణశాఖ పీడీ ప్రసాద్‌, ఆర్‌ఐ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, విలేజ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి వేళాంగిణి రాజు, జేఎంజే ప్రతినిధి సిస్టర్‌ మేరీ కుమారి, వీఆర్వోలు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి

నంబూరులో యానాది కాలనీ

సందర్శన

కలెక్టర్‌ వద్ద గోడు

వెళ్లబోసుకున్న యానాదులు

15 రోజుల్లో ప్రతి ఒక్కరికీ

ప్రభుత్వ పథకాల గుర్తింపు కార్డులు

నెల రోజుల్లో ఇంటి స్థలం

మంజూరుకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement