
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కామ్‌కు చెందిందిగా చెబుతూ సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్(తెలంగాణ)లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్ కేసిరెడ్డిదేనని సిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే..
సీజ్ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్ ముగియడం.. బెయిల్ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్‌లో నేను వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్‌కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.
‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్ చేయాలని కోరుతున్నాను.
ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.