
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుల యావ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎందుకోసం?.. ఎవరికోసం చేస్తోందో తెలియదు కానీ.. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరిపోయింది. సంపద సృష్టికర్తనని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ‘‘అప్పు చేసి పప్పు కూడు’’ తింటున్నట్టుగా ఉంది. ఒకపక్క ఆదాయం ఆశించినంతగా పెరగకపోవడం, ఇంకోపక్క అప్పులు మోత మోగిపోతుండటంతో రాష్ట్రం భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది.
తాజా ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే రాష్ట్రం రికార్డు స్థాయిలో రూ.37 వేల కోట్ల అప్పులు చేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. సగటున నెలకు రూ.12.300 కోట్లు అన్నమాట. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా, గనుల తాకట్టుల ద్వారా కూడా వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు ఇటీవలి కాలంలో వచ్చిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఖజానానే తాకట్టు పెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇదేదో తమ గొప్పదనం అన్నట్టుగా చంకలు గుద్దుకోవడం ఒక హైలైట్ కాగా.. వైఎస్సార్‌సీపీ వాళ్లు కుట్ర చేసినా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నామహో అని చాటింపు వేసుకోవడం ఇంకో హైలైట్!. గనులు తాకట్టు పెట్టడం, రుణం ఇచ్చే వారు ఆర్బీఐ ఖాతా నుంచే నేరుగా డబ్బు వసూలు చేసుకునే నిబంధనకు అంగీకరించడం ఎంత వరకు కరెక్ట్?. గౌరవపూర్వకమన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. టీడీపీ నేతలు వీటి గురించి మాట్లాడరు. వైఎస్సార్‌సీపీ వారిపై బురదజల్లేందుకు మాత్రం తయారుగా ఉంటారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలోనే సుమారు రూ.1.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు దీనికి అదనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఉండగా ఏ చిన్న అప్పు చేసినా ఆర్థిక విధ్వంసం జరిగిపోతోందని, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని నానా యాగీ చేసిన టీడీపీ, దాని మురికి మీడియా.. ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తున్న అప్పుల గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నోరు మెదపడం లేదు. వీరంతా.. జగన్ సీఎంగా ఉండగా అప్పులు చేయడమే తప్పని అన్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారన్న వింత వాదనకు దిగారు. నిజానికి కేంద్రంలో, రాష్ట్రంలోనూ పాలన చేస్తున్నది ఈ కూటమి పార్టీలే!. ఏ మేరకు, ఎందుకోసం అప్పులు చేసిందో ప్రస్తుత ప్రభుత్వం చెప్పలేదు కానీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కొత్త విషయం తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో పది లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అయితే, దానికి ఆధారాలు మాత్రం చూపరు. బడ్జెట్ స్పీచ్‌లోనేమో ఏపీ అప్పు అంతా కలిపి సుమారు ఆరు లక్షల కోట్లు అని చదువుతారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తదితర కూటమి నేతలు ప్రచారం చేశారు. పైగా అదంతా జగన్ వచ్చిన తర్వాత జరిగిన అప్పు అన్న చందంగా పచ్చి అబద్దాలు జనంలోకి తీసుకువెళ్లారు. విభజన టైమ్‌కు ఉన్న అప్పు, 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రం మాట్లాడరు. అలాగే జగన్ టైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కరోనా సంక్షోభం కారణంగా అప్పులు చేయడానికి కేంద్రమే అనుమతి ఇచ్చిన విషయాన్ని దాచేస్తారు. ఎప్పుడు ఏ అబద్దం చెబుతారో, ఎలాంటి వదంతులు సృష్టిస్తారో తెలియని ఇలాంటి పార్టీలతో రాజకీయాలు చేయాలంటే అంతకన్నా ఎక్కువ అసత్యాలు ప్రచారం చేయగలగాలి. అంత యుక్తి కానీ, శక్తి కానీ వైఎస్సార్‌సీపీకి లేదన్నది వాస్తవం. జగన్ జనాన్ని నమ్ముకోవడం తప్ప, ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నే అలవాటు ఉన్న వ్యక్తి కాదు.
కాగ్ లేటెస్ట్‌గా ఇచ్చిన నివేదికలో వెల్లడైన అంశాలు ఏపీలో కూటమి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియ చేస్తుంది. ఏడాది కాలానికిగాను దాదాపు రూ.80వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్‌లో తెలిపారు. దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ 12 నెలల్లో తీసుకోవాల్సిన అప్పులో సుమారు సగం (రూ.37 వేల కోట్లు) మూడు నెల్లలోనే తెచ్చేసుకున్నారు. ఈ లెక్కన ఏడాది పూర్తి అయ్యేసరికి మరో మళ్లీ 1.25 లక్షల కోట్లు అప్పు చేయాల్సి రావచ్చు. ఇతర మార్గాల ద్వారా ఇంకెన్ని వేల కోట్ల అప్పు చేస్తారో చెప్పలేం. ఈ అప్పులన్నీ ఏమవుతున్నాయో, వేటి కోసం ఖర్చు పెడుతున్నారో పాలకులు చెప్పడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఒకటి, అర తప్ప అమలు చేయడం లేదు.
ఇటీవల తల్లికి వందనం స్కీమ్ ఇచ్చినా, చాలా లొసుగులు బయటకు వచ్చాయి. ఎన్నికలలో చెప్పినట్లుగా ప్రతీ విద్యార్దికి రూ.15 వేల చొప్పున ఇవ్వలేదు. రూ.13వేలే ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులోనూ బలహీన వర్గాల వారికి ఇంకా కోత పెట్టారు. కేంద్రం ఇచ్చే స్కాలర్‌షిప్‌లను జత చేసి అన్యాయం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌లో రూ. 4300 కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్యశ్రీ సంగతి తెలియదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. వలంటీర్లకు అసలుకే మోసం తెచ్చారు. వీటన్నిటిని ఎగవేసినా, రాష్ట్ర ఆర్థిక స్థితి సజావుగా ఉందా అంటే అదీ కనిపించడం లేదు. రాష్ట్ర ఆదాయంలో వృద్ది అన్నీ కలిపి 6.14 శాతంగా ఉంటే, అప్పులు మాత్రం 15.61 శాతంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆయన ఏది చెప్పినా ఆధార సహితంగా చెబుతుంటారు. కాగ్ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను ఆయన విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, అప్పులపైనే ఆధార పడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. జీఎస్టీ అమ్మకం పన్ను ఆదాయాలు తగ్గుదలను ఉదాహరణగా చూపారు. అటు సంక్షేమం సరిగా అమలు చేయక,, ఇటు అభివృద్ధి లేక ప్రభుత్వం ఏపీ ప్రజలను సంక్షోభంలోకి తీసుకుపోతోందని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ తెలిపిన ఈ అంశాలకు చంద్రబాబు లేదా కేశవ్ సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది ప్రశ్న. కాకపోతే వారు తమ మీడియా బలంతో రొడ్డ కొట్టుడు ప్రకటనలు చేసి జగన్ పై విమర్శలు సాగిస్తారు. అలాకాకుండా కాగ్ నివేదికను దగ్గర పెట్టుకుని, జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు లేదా కేశవ్ వివరణ ఇస్తే ఏమైనా అర్దం ఉంటుంది. ఆ పని మాత్రం చేయరు. సంక్షేమం, అభివృద్దిలో కాకుండా అప్పులలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా చేసినందుకు కూటమి సర్కార్ సిగ్గుపడాలో, గర్వపడాలో వారే ఆలోచించుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత.