
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్కడ పర్యటిస్తున్నా.. కూటమి సర్కార్ (Kutami Government) అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల చిత్తూరు బంగారుపాళ్యంలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా..
నెల్లూరులోనూ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌తో గురువారం(జులై 31) వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇందుకు వైఎస్సార్‌సీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అదే సమయంలో ఈ పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
నెల్లూరు వ్యాప్తంగా జగన్ పర్యటన సందర్భంగా పోలీస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది కూటమి సర్కార్. ఈ నెల మొదట్లోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. హెలిప్యాడ్ అనుమతులను నిరాకరించింది. ఇప్పుడేమో.. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు.
కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పోలీసు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎక్కడ చూసినా చెక్‌పోస్టులు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనకు జనసమీకరణ చేసినా.. స్వచ్ఛందంగా జనం గుంపుగా వచ్చినా చర్యలు తప్పవంటూ అనౌన్స్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిసతే కఠిన చర్యలు, కేసులు తప్పవంటూ బెదిరిస్తున్నారు.
జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. పోలీసుల తీరుపై ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు.. కర్ఫ్యూను తలపించే ఆంక్షలతో అటు ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
