
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సమోసా, జిలేబీ వంటి స్ట్రీట్ ఫుడ్స్ హాట్ టాపిక్‌గా మారాయి. వీటిపై కూడా ప్రమాద హెచ్చరికలు జారీచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదని, కేవలం స్ట్రీట్ ఫుడ్ విషయంలో అపరిశుభ్రత విధానాలపై హెచ్చరించడమే తమ ఆలోచనని ప్రభుత్వం స్పష్టం చేసి ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాల సీజన్ కావడంతో వేడి వేడి స్ట్రీట్ ఫుడ్‌కు ఆకర్షితులవ్వడం సహజమే. ఈ క్రమంలో ఇలాంటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగరానికి చెందిన ప్రముఖ కన్సల్టెంట్, ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ సనమంద్ర సూచిస్తున్నారు..
జిలేబీలు, సమోసాలు, బజ్జీలు, పునుగులు వగైరా స్ట్రీట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. మరీ ముఖ్యంగా చిరుతిళ్లలో మైదా శాతం అధికంగా ఉంటుందని, పైగా ఇవన్నీ పలుమార్లు వాడిన నూనెతో చేసిన వంటకాలు కావడంతో మరింత ప్రమాదకరం. తరచూ ఈ తరహా ఆహారం తినడం వల్ల జీవక్రియతో పాటు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.
అనారోగ్య కారకం..
ఈ తరహా చిరుతిండి ఎక్కువగా తినేవాళ్లలో ఒవెసిటీ, తర్వాత రక్తపోటు, ఫ్యాటీ లివర్, చెడు కొలె్రస్టాల్, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. క్రమంగా ఈ అలవాట్లతో పాటు పెద్ద పెద్ద వ్యాధులుగా రూపాంతరం చెంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తప్పదు.
ప్యాంక్రియాస్‌పై ప్రభావం..
మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. వీటిలో చర్మం కింద ఉండే సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అంత ప్రమాదకరం కాదు. కానీ లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీలు వంటి అంతర్గత అవయవాల చుట్టూ ఉండే విసెరల్ ఫ్యాట్ పెంచుతాయి. దీంతో ఆరోగ్యానికి ప్రమాదం అధికం.
ఇది శరీరంలోని వాపును పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. తద్వారా ప్యాంక్రియాస్ అధిక శాతంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది క్రమంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులకు దారితీస్తుంది.
చిన్నపిల్లల్లో సమస్యలు..
చిన్నారులు స్కూలు వయసులో తీపి, ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యల వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అలాగే 5–10 ఏళ్ల పిల్లల్లో కనిపించే సమస్యలు – మెడ దగ్గర నలుపు మచ్చలు (అకాంథోసిస్ నైగ్రికన్స్), అమ్మాయిల్లో హార్మోన్ డిజార్డర్, అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ తగ్గడం (హైపోగోనాడిజం), ప్రీడయాబెటిస్, హైబీపీ, ఫ్యాటి లివర్ వంటి సమస్యలు తప్పవు. రోడ్డు మీది ఫుడ్‌తో పాటు చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, జంక్ ఫుడ్ ఏదీ మంచిది కాదు. దీనికి బదులుగా ఇంటి దగ్గర వండినవి మాత్రమే పిల్లలకు ఇవ్వడం ఉత్తమం.