వ్యవసాయ పంట సిరులు ఇంటికొచ్చే శుభ తరుణంలో మకర సంక్రాంతిని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ పండగను ప్రతిఒక్కరూ ఉత్సాహంగా తమ వారితో జరుపుకొంటారు. ఈ క్రమంలో రకరకాల పిండి వంటలు వారి ఆహ్లాదాన్ని రెట్టింపు చేస్తాయి. ఇందులో ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్రత్యేక వంటకం సంక్రాంతి పురస్కరించుకొని చేయడంతో అక్కడి ప్రజల్లో నోరూరుతున్నాయి.
అవేంటో ఓ లుక్కేద్దాం.
పెసర పప్పు అన్నం స్పెషల్
తాండూరు: సంక్రాంతి పండగ సంబరాలు గ్రామాల్లో ఎటు చూసిన కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేసి కుటుంబంతో కలిసి భోజనం చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, కూతుళ్లు, అల్లుళ్లతో సందడి వాతావరణం నెలకొంది. తాండూరు ప్రాంతంలో సంక్రాంతి పండగ వచి్చందంటే భోగి రోజు నువ్వులతో రొట్టెలు, పెసర పప్పు అన్నం తయారు చేయడం, తర్వాత పిండితో చేసి పోలెలు, గారెలు, అప్పాలు, గర్జెలు, మొరుకులు వంటి పలు రకాల వంటకాలను తయారు చేసుకొని ఆరగిస్తారు. ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేసి రబీ సీజన్‌లో పండే జొన్న, కుసుమ, చెరుకు, నేరడు పండ్లు, గొబ్బెల మధ్య ఉంచి పూజలు చేశారు.
నువ్వుల రొట్టె.. ఆరగిస్తారంటా!
నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల్, దౌల్తాబాద్ మండలాల్లో మకరసంక్రాంతి సందర్భంగా నువ్వుల రొట్టెలు, పిండి వంటలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. బుధవారం భోగి పురస్కరించుకొని గ్రామాలు, పట్టణాల్లో నువ్వుల రొట్టెలు చేసి, వివిధ రకాల కూరగాయలతో వంట చేసి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనాలు చేశారు. సంప్రదాయ సందర్భాల్లో జొన్న పిండిలో నువ్వులను కలిపి రొట్టెలు చేస్తారు. వీటిని తినడంతో రక్తహీనత తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. పండుగ పూట పలు రకాల రొట్టెలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. నువ్వులు, నువ్వుల పొడి, నల్ల నువ్వులు, సొరకాయ నువ్వులు.. ఇలా వెరైటీగా రొట్టెలను తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగిస్తారు.
– కొడంగల్


