సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే పేరు.. మదిలో మెదిలే చిహ్నం.. ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే పర్యాటక ప్రాంతం.. హైదరాబాద్ ఐకాన్‌గా ప్రసిద్ధి.. అదే చార్మినార్. దీని పరిసరాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా, ప్రత్యేకంగా కనిపించేలా వెలుగుజిలుగులతో స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. చారి్మనార్ నాలుగువైపులా ఉన్న వీధిదీపాల స్థానే ఆకర్షణీయంగా కనిపించే విద్యుత్ స్తంభాలు, ప్రకాశవంతమైన స్పెషల్ ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
చార్మినార్ చుట్టూ, పరిసరాల్లోని పత్తర్‌ఘట్టి, చార్‌కమాన్ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు పాతబస్తీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) అధికారులు ఆర్‌ఎఫ్‌పీ టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువుంది. పాతబస్తీలో వివిధ పనులు చేసేందుకు వెనుకాడుతున్న కాంట్రాక్టు ఏజెన్సీలు ఈ పనులు చేసేందుకు ఏమేర ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే. చారి్మనార్ పరిసరాల్లోనే ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు తెలిసేలా క్యూఆర్ కోడ్‌లతో కూడిన డిజిటల్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేందుకు కూడా టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు మొదలుకాలేదు.


