
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ సామాజిక మాధ్యమాల్లో నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 1970లనాటి సినిమా పాటను జోడించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తివారీ.
మంగళవారం తివారీ ఎక్స్‌లో.. ఆపరేషన్ సిందూర్ చర్చలో ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీలకు కాంగ్రెస్ అవకాశమివ్వలేదంటూ వచ్చిన వార్తా కథనాన్ని జోడిస్తూ.. మనోజ్ కుమార్ నటించిన పూరబ్ ఔర్ పశ్చిమ సినిమాలోని ‘భారత్ కా రెహ్నా వాలా హూ, భారత్ కీ బాత్ సునాతా హూ’ అనే పాటను ఉటంకించారు. భారత వాసులారా.. భారత్ గురించి మీకు చెబుతా.. అని దీనర్థం. ఆపరేషన్ సిందూర్ అనంతరం విదేశాలకు పంపించిన దౌత్య బృందాల్లో భాగస్వాములుగా ఉన్న థరూర్, తివారీలకు పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడే అవకాశముందంటూ వార్తలు రావడం తెల్సిందే.
అయితే, వీరిద్దరికీ కాంగ్రెస్ మాట్లాడే అవకాశమివ్వలేదు. దీనిపై ఎంపీ తివారీ త్రివర్ణ పతాకం కనిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. 1970లనాటి సినిమా పాటను జోడించారు. అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియా ఈ వ్యాఖ్యలపై అర్థమేంటని అడగ్గా.. ‘ఆంగ్లంలో ఓ సామెతుంది..‘నా మౌనాన్ని అర్థం చేసుకోలేకుంటే.. నా మాటలను సైతం ఎన్నటికీ అర్థం చేసుకోలేవు’ అంటూ స్పందించారు. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రశ్నించగా.. జర్నలిస్టులు కదా పరిశోధించండి’ అంటూ దాటవేశారు. తన వ్యాఖ్యలకు అర్థాన్ని మాత్రం వివరించలేదు.
అయితే, తివారీ తనకు లోక్‌సభలో మాట్లాడే అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా, కాంగ్రెస్ వర్గాలు శశిథరూర్‌కు మాట్లాడే అవకాశమిచ్చానా ఆయన మాత్రం మరో అంశంపై మాట్లాడుతానని తెలిపినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, కేంద్రం చర్యలపై ఈ ఇద్దరు ఎంపీలు ప్రభుత్వాన్ని సమర్థించడంపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు వార్తలు రావడం తెల్సిందే.
#WATCH | On his tweet, Congress MP Manish Tewari says, "There is a saying in English- 'If you don't understand my silences, you will never understand my words'. " pic.twitter.com/r1MsSt4wgZ
— ANI (@ANI) July 29, 2025