ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ | PM Modi speaks on Operation Sindoor in Lok Sabha | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ

Jul 29 2025 6:28 PM | Updated on Jul 29 2025 8:17 PM

PM Modi speaks on Operation Sindoor in Lok Sabha

సాక్షి,న్యూఢిల్లీ:  రాహుల్‌ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్‌ ఇచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపుతో భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు.  

ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్‌ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి ప్రతీకగా విజయ్‌ ఉత్సవ్‌. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.

పాక్‌ బిత్తర పోయింది
 ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్‌లోని ఉగ్రవాదుల హెడ్‌ క్వార్టర్స్‌ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్‌ సిందూర్‌. భారత్‌ ప్రతీకార చర్యలను చూసి పాక్‌ బిత్తర పోయింది. ఆపరేషన్‌ సిందూర్‌ ముందు పాక్‌ తేలిపోయింది.ఆపరేషన్‌ సిందూర్‌ ముందుకు బ్లాక్‌ మెయిల్స్‌ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు.  

కాంగ్రెస్‌కు హెడ్‌లైనే గతి
56 ఇంచ్‌ల చెస్ట్‌ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్‌ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్‌ను కాదు.. దేశాన్ని సపోర్ట్‌ చేసింది. కాంగ్రెస్ హెడ్‌లైన్స్‌లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు.   ‌

మాస్టర్‌ మైండ్‌కు నిద్ర కరువైంది
ఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్‌ ఎయిర్‌ బేస్‌లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన ఎయిర్‌ఫోర్స్‌ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్‌ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మాస్టర్‌ మైండ్‌కు నిద్ర కరువైంది.  

పాక్‌  ప్రాధేయపడింది
ఉగ్రవాదులతో పాకిస్తాన్‌ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్‌ లక్క్ష్యం. మన మిస్సైల్స్‌ పాక్‌ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్‌ సిందూర్‌తో స్పందిస్తామని పాక్‌ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్‌ సిందూర్‌తో సైనికులు పాక్‌ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్‌ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది.

 

ఆపరేషన్‌ సిందూర్‌: ట్రంప్‌ ప్రమేయం లేదు
ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్‌ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నాకు ఫోన్‌ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్‌ చాలాసార్లు నాకు ఫోన్‌ చేశారు. పాక్‌ భారత్‌పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్‌ నాకు చెప్పాడు. పాక్‌ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్‌ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉంది. పాక్‌ అజెండాను ఇంపోర్ట్‌ చేసుకునే పనిలో కాంగ్రెస్‌ ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్‌ అడుగుతోంది. పాక్‌ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.  

మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు
అధమ్‌ పూర్‌ బేస్‌పై దాడి అంటూ పాక్‌ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. పాక్‌ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్‌ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్‌ మిసైల్‌ కూడా భారత్‌ను టచ్‌ చేయలేదు. 

ముమూర్తం కావాలా ఏంటి?
ఆపరేషన్‌ మహాదేవ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్‌లో భాగంగా భారత్‌ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్‌ మహాదేవ్‌ చేపట్టారని అఖిలేష్‌ యాదవ్‌ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?

కాంగ్రెస్‌ను పీవోకేను కోల్పోయాం
కాంగ్రెస్‌ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్‌ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్‌ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్‌ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్‌ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగు‌ల భూభాగాన్ని భారత్‌ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్‌గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు.  పాక్‌కు నీళ్లు అప్పగించి భారత్‌లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్‌లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్‌కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్‌ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్‌ బ్యాంక్‌కు అప్పగించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement