కర్ణాటక: నిశ్చితార్థానికి బయలుదేరిన వరుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో వరుడు గాయపడ్డాడు. అనంతరం పెళ్లి కూడా రద్దు అయింది. ఈ ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. కొళ్లేగాల తాలూకా కుణగళ్లికి చెందిన ఎల్.రవీశ్ (34) అనే వరుడు గాయపడ్డాడు. ఇతనికి కొళ్లేగాల తాలూకా హొసఅణగళ్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
కొళ్లేగాల పట్టణంలోని వేంకటేశ్వర మహల్‌లో శుక్రవారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కోసం తన గ్రామం నుంచి కారులో కుటుంబ సభ్యులతో కలసి రవీశ్ బయలుదేరాడు. కొళ్లేగాల ఎంజీఎస్‌వీ కాలేజీ రోడ్డు వద్ద దుండగులు వరుని కారును వెంబడించి కత్తితో దాడి చేశారు. రవీశ్ ఎడమ తొడకు గాయమై రక్తస్రావమైంది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం రవీశ్ మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం ఒక యువకుడు ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకోవాలని బెదిరించాడన్నారు.
తాను అదేమీ పట్టించుకోలేదన్నారు. ఇలా దాడిచేస్తారని అనుకోలేదన్నారు. భవిష్యత్తులో కూడా తనకు ప్రమాదం ఉండొచ్చని, అందుకే ఈ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. అతను యువతి మాజీ ప్రేమికుడని తనకు తెలిసిందన్నారు. ఈ విషయంపై యువతిని అడగ్గా గతంలో ప్రేమించిన మాట వాస్తవమేనని, ఇప్పుడు విడిపోయామని, తాను ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పిందని వివరించారు. కొళ్లేగాల పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి ఆగిపోవడంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు.


