సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రారంభమైంది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రెండు అఫిడవిట్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లు వేశారు.
ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వేసిన అఫిడవిట్‌పై దానంను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. బీజేపీ మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్‌ను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ విచారించనున్నారు. మరోవైపు.. పాడి కౌశిక్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే, తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని దానం నాగేందర్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దానం విచారణపై ఉత్కంఠ నెలకొంది.
కాసేపటి క్రితమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘మేం ఇచ్చిన నోటీసులపై విచారణ కోసం స్పీకర్ రమన్నారు. దానం నాగేందర్‌ను స్పీకర్ సస్పెండ్ చేస్తాడని నమ్ముతున్నాం. దానం బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారు. దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ఆధారం ఏముంటుంది?. దానం పోటీ చేసిన అంశాలు, ఆయనకి వచ్చిన ఓట్లు తదితర డాక్యుమెంట్లు స్పీకర్‌కు ఇస్తాను అని చెప్పుకొచ్చారు.


