సిందూర్‌ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు | PM Modi addresses the Lok Sabha during special discussion on Operation Sindoor | Sakshi
Sakshi News home page

సిందూర్‌ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు

Jul 30 2025 4:27 AM | Updated on Jul 30 2025 7:22 AM

PM Modi addresses the Lok Sabha during special discussion on Operation Sindoor

‘ఆపరేషన్‌ సిందూర్‌’ చర్చలో మోదీ స్పష్టీకరణ 

కాంగ్రెస్‌పై నిప్పులు

న్యూఢిల్లీ: నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్షాల డిమాండ్ల మధ్య లోక్‌సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా  ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

 భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్యకారణమని ఇప్పటికే పాతికసార్లు ఢంకా భజాయించిన ట్రంప్‌ మాటల్లో రవ్వంతైనా నిజంలేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని కాళ్లకింద నలిపేసేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సిందూర్‌ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేతా తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. 102 నిమిషాల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

విజయోత్సవంలో ప్రసంగిస్తున్నా..
‘‘ఉగ్రవాదానికి కుంభస్థలం వంటి పాక్‌లోని ఉగ్రస్థావరాలను మనం నేలమట్టంచేసినందుకు ఈరోజు పార్లమెంట్‌లో విజయోత్సవం జరుపుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత వాణిని ప్రపంచానికి వినిపించేందుకు, భారత్‌ అంటే ఎంటో అందరికీ మరోసారి చాటిచెప్పేందుకే మాట్లాడుతున్నా. సిందూర్‌ వేళ నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ రుణపడిపోయా. ఉగ్రవాదానికి తల్లివేరు వంటి పాక్‌కు ఆపరేషన్‌ సిందూర్‌తో అసాధారణరీతిలో గుణపాఠం చెప్పాం. 

ఆ భీకర దాడుల నుంచి పాక్‌ ఇంకా కోలుకోలేదు. దాడులు మళ్లీ జరగొచ్చని వాళ్లు ఇప్పటికీ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేష్‌ సిందూర్‌ అమలుకోసం మేం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం దుశ్చర్యకు దీటుగా బదులిస్తూ పాక్‌ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించాం. కేవలం 22 నిమిషాల్లో భిన్న ప్రాంతాల్లోని కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టంచేశాం. అణు బెదిరింపులు మన దగ్గర పనిచేయవని పాక్‌ను గట్టిగానే హెచ్చరించాం. మన దాడుల ధాటికి పాక్‌ వైమానిక స్థావరాలు సర్వనా శనమై ఇప్పటికీ అలాగే ఐసీయూలో ఉన్నాయి’’.

ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది
‘‘ఆపరేషన్‌ సిందూర్‌లో బ్రహ్మోస్‌ వంటి స్వదేశీ క్షిపణులుసహా సొంత డ్రోన్ల వినియోగంతో భారత్‌ సాధించిన స్వావలంభన, ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది. అమాయకులను ఉగ్రదా డులతో బలితీసుకుంటే ఎలాంటి స్పందనా ఉండదని ఇన్నాళ్లూ ఉగ్రదాడుల సూత్రధారులు భావించారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్‌ దండయాత్ర చేయగలదని ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులక బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి సింధు దాకా భారత్‌ భిన్నకోణాల్లో ప్రతీకార చర్యలు చేపట్టింది. 

భవిష్య త్తులో తోకజాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బోధపడింది. ఉగ్రపోషకులు, పాక్‌ పాలకులు ఒక్కరే అనే భావనతోనే భారత్‌ ముందుకెళ్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆపరేషన్‌ సిందూర్‌ మొదలెడితే ప్రపంచంలో మూడు దేశాలు తప్ప ఏ దేశమూ భారత్‌కు అడ్డుచెప్పలేదు. పాక్‌కు ఆ మూడుదేశాలే మద్దతు పలికాయి. ఇలా ప్రపంచదేశాలన్నీ భార త్‌కు అండగా నిలిస్తే కాంగ్రెస్‌ మాత్రం మన సైనికుల వీరత్వానికి సలామ్‌ చేయలేదు. పాకిస్థా న్‌ను కాంగ్రెస్‌ వెనకేసుకురావడం దౌర్భా గ్యం. గతంలో సర్జికల్‌ దాడులు చేసినప్పుడూ కాంగ్రెస్‌ ఇదే పాట పాడింది’’.

నిమిషాల్లో నాశనం చేశాం
‘‘పాక్‌ నడిబొడ్డున, ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థా వరాలపై మన బలగాలు మేలో మెరుపుదాడులు చేశాయి. నిమిషాల్లోనే మీ స్థావరాలను సమాధులుగా మార్చగలమని పాక్‌కు నిరూపించాం. తొలుత ఉగ్రస్థావరాలను మన బలగాలు ధ్వసంచేశాయి. ఉగ్రవాదులకు సాయంగా పాక్‌ బలగాలు ప్రతిదాడులకు సిద్ధపడడంతోనే వాళ్ల వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కోలుకోలేని దెబ్బతీశాం. దీంతో పాక్‌ కాళ్లబేరానికి వచ్చింది. పాక్‌ డైరెక్టర్స్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌(డీజీఎంఓ) నుంచి ఫోన్‌ వచ్చింది. ఇంతకుమించి దాడులు చేస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రాధేయపడ్డారు. అందుకే సిందూర్‌కు ముగింపు పలికాం. ఆపరేషన్‌ను ఆపడానికి ఇదే ఏకైక కారణం. అంతేగానీ ప్రపంచంలో మరే దేశాధినేత కారణంగానో సిందూర్‌ ఆగలేదు. ఆపాలని ఎవరూ మాకు చెప్పలేదు. 

మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పదేపదే నాకు ఫోన్‌ చేశారు. అప్పటికే త్రివిధ దళాధిపతులతో  భేటీలో బిజీగా ఉన్నాను. భేటీ తర్వాత నేనే ఫోన్‌కాల్‌ చేసి మాట్లాడా. పాక్‌ దాడి చేయబోతోందని ఉప్పందించారు. ఎలాంటి దాడినైనా అడ్డుకోగలమని ఆయనకు స్పష్టంచేశా. దాడికి ప్రతిదాడి దారుణంగా ఉంటుందని చెప్పా. బుల్లెట్లకు బాంబులతో సమాధానం చెప్తామన్నా. ఎన్నో విషయల్లో భారత్‌ స్వావలంభన సాధిస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం చాలా అంశాలను ఎత్తిచూపేందుకు పాక్‌ పేరును మధ్యలోకి లాక్కొస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పరోక్షంగా పాక్‌ అజెండాను ప్రకటించే అధికారిక ప్రతినిధులుగా తయార య్యా రు. గతంలో మేం సర్జికల్‌ దాడులుచేస్తే కాంగ్రెస్‌ వాళ్లు ఆధారాలు కావాలన్నారు. ఆనాడు పైలట్‌ అభి నందన్‌ పాక్‌ బలగాలకు దొరికిపోతే ఎలా విడిపించుకొస్తారో చూస్తామని మాట్లాడారు. తీరా మేం తీసుకొచ్చాక ఇదే కాంగ్రెస్‌ నేతలు నోరుమూశారు. ఉగ్రవాదులకు జరిగిన భారీ నష్టాన్ని చూసి అక్కడ పాక్‌ మాత్రమే కాదు ఇక్కడ భారత్‌లోనూ కొందరు ఏడుస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.

విశ్వశాంతికి ఇది అవసరం
‘‘విశ్వశాంతి సాధనలో ఆయుధ సంపత్తితో తులతూగడం కూడా ముఖ్యమే. అందుకే రక్షణరంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాం. ఇప్పడు వందకు పైగా అంకురసంస్థలు రక్షణరంగంలో కృషిచేస్తున్నాయి. కొన్ని సంస్తలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి జాతీయ భద్రతా ముందుచూపు కాంగ్రెస్‌కు గతంలోలేదు. ఇకమీదట కూడా రాదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఇప్పటికీ భారత్‌ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందన్న ప్రశ్నకంటే ముందు అసలు అదెలా మన చేయిజారిందనే ప్రశ్న వేసుకోవాలి. విశాల కశ్మీరం చేజారడానికి కారకులెవరు? నెహ్రూ హయాం నుంచి మొదలుపెడితే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన ఘోర పరిపాలనా తప్పిదాల కారణంగానే భారత్‌ ఇప్పటికీ ఉగ్రదాడులు, ఇతర గాయాలతో బాధపడుతోంది’’ అని అన్నారు.

వేయి క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశాం
‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. సిందూర్‌కు ప్రతిగా పాక్‌ 1,000కిపైగా క్షిపణులను ప్రయోగిస్తే మన గగనతల రక్షణవ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే పేల్చేశాయి. అదంపూర్‌ వైమానికస్థావరం నాశనమైందని పాక్‌ కారుకూతలు కూస్తే తెల్లారే అక్కడికెళ్లి అది నిక్షేపంగా ఉందని ప్రపంచానికి చాటిచెప్పా. భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్‌ నమ్మకపోవడం దారుణం. 

మన రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రులు చెప్పిన మాటలకూ కాంగ్రెస్‌ విలువ ఇవ్వట్లేదు. పాక్‌ రిమోట్‌ కంట్రోల్‌తో కాంగ్రెస్‌ పనిచేస్తుందేమో. కొందరు కాంగ్రెస్‌ యువనేత (రాహుల్‌)లు ఆపరేషన్‌ సిందూర్‌ను తమాషాగా కొట్టిపారేశారు. మన సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్‌ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. లోక్‌సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్‌ మహదేవ్‌లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వారాలు, తేదీలు చూడాలా?’’ అని మోదీ ఆగ్రహంవ్యక్తం చేశారు.

సిందూ నదీజలాల ఒప్పందం నెహ్రూ పాపమే
‘‘మన నదీజలాలపై ప్రపంచబ్యాంక్‌ అజమాÆ ‡ుుషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుంది. భారతనేలపై పారే సిందూ నదీజలాల్లో 80 శాతం వాటా పాక్‌కు ఆయనే ధారాదత్తంచేశారు. ఇంతటి జనాభా ఉన్నప్పటికీ మనకు 20 శాతం మాత్రమే హక్కులు దఖలుపడ్డాయి. మన భారతీయ రైతుల నీటికష్టాలు నెహ్రూకు పట్టలేదు. నీళ్లివ్వడంతోపాటు నెహ్రూ పాక్‌కు నిధులు కూడా ఇచ్చారు. సిందూ నదీజలాలపై డ్యామ్‌లు కట్టుకునేందుకు నెహ్రూ ప్రభుత్వం పాక్‌కు ఆర్థికసాయం చేసింది. సిందూ నదీజలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలూ సరిచేయలేదు. మేం వచ్చాకే ఆ తప్పులను సవరించాం. ఉగ్రదాడులతో భారతీయుల రక్తం పారేలా చేస్తున్నారు. అందుకే సిందూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలిగాం. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని స్పష్టంచేశాం. ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసిపోలేదు. పాక్‌ మళ్లీ కుయుక్తులతో పేట్రేగిపోతే సిందూర్‌ మళ్లీ మొదలవుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement