ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్‌ ఫైర్‌ నిర్ణయం ఎవరిది? | Pahalgam Debate: Priyanka Gandhi, Mallikarjun Kharge Slams Centre | Sakshi
Sakshi News home page

ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్‌ ఫైర్‌ నిర్ణయం ఎవరిది?

Jul 29 2025 3:43 PM | Updated on Jul 29 2025 4:15 PM

Pahalgam Debate: Priyanka Gandhi, Mallikarjun Kharge Slams Centre

పహల్గాం ఘటన.. పూర్తిగా భద్రతా వైఫల్యమేనని, పైగా అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో మండిపడింది. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చలో భాగంగా.. ఇటు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, అటు రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ  పాల్గొని ప్రసంగించారు. పర్యాటక ప్రాంతంలో భద్రత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి గంటసేపు మాట్లాడారు. అధికార కూటమి ఎంపీలు కూడా మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌, ఉగ్రవాదంపై పోరు, జాతీయ భద్రత, చరిత్ర.. ఇలా అంశాలన్నింటిపై మాట్లాడారు. కానీ, ఒక్క విషయాన్ని వదిలేశారు. అసలు ఆ దాడి ఎందుకు?.. ఎలా జరిగింది? అనేది.. ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గాంలో కుటుంబ సభ్యుల కళ్లెదుటే 26 మంది చంపారు. అసలు ఆ ఉగ్రదాడి ఎందుకు.. ఎలా జరిగిందో మాత్రం కేంద్రం చెప్పడం లేదు. 

కశ్మీర్‌లో ఉగ్రవాదం ముగిసిన అంకమని, అక్కడ పర్యటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ.. జరిగింది మరొకటి. శుభం ద్వివేదీకి వివాహమై ఆరు నెలలే అయ్యింది. ఏప్రిల్‌ 22వ తేదీన అందరు పర్యాటకుల్లాగే ఆ జంట విహారంలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో అడవుల్లో నుంచి వచ్చిన ఉగ్రవాదులు వాళ్లపై తెగబడ్డారు. భార్య కళ్ల ముందే శుభంను చంపేశారు. గంట వ్యవధిలో మరో 25 మందిని చంపేశారు. 

శుభం భార్య ఐశన్య ఓ మాట చెప్పింది.. నా కళ్ల ముందే నా ప్రపంచం చీకటి అయ్యింది. ఘటన సమయంలో అక్కడ ఒక్క భద్రతా సిబ్బంది లేరు. ఈ దేశం, ఈ ప్రభుత్వం మమ్మల్ని.. మా భద్రతను గాలికి వదిలేసింది అని. ఆమె అడిగిందే నేనూ అడుగుతున్నా.. 

  • ప్రతీరోజు 1,000 నుంచి 1,500 మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు కూడా కాపలాగా ఎందుకు లేడు?. 

  • వాళ్లు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్తే.. ఈ ప్రభుత్వం దేవుడ్ని మీద భారం వేసి వాళ్లను అలా వదిలేసిందా?. 

  • ఉగ్రదాడికి రక్షణమంత్రి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యత వహించారా? రాజీనామా చేశారా?. 

  • అసలు పౌరుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?. ప్రధానిదా?, హోం మంత్రిదా?, రక్షణ మంత్రిదా? ఎవరిది??

  • సెక్యూరిటీ మాట అటుంచి కనీసం ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు?. 

  • ఇది నిఘా సంస్థ వైఫల్యం కాదా?.. అంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 

ఆర్మీనో, కేంద్రమో ఈ నిర్ణయం తీసుకోలేదు. అసలు సీజ్‌ ఫైర్‌ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎలా చేస్తారు?. పాక్‌ భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందం అసలు ఎలా జరిగింది?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. 

ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసింది. తమ తండ్రి తమ కళ్ల ముందే చనిపోవడం చిన్న పిల్లలు చూశారు. అసలు పర్యాటక ప్రాంతంలోకి టెస్టులు ఎలా వచ్చారు?. పహల్గాం ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే. దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది?. ఇంటెలిజెన్స్‌ వైఫల్యానికి బాధ్యులెవరు?. 

.. పహల్గాం ఘటనలో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారు.  పాకిస్తాన్‌కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్‌ దేశాన్ని నిర్మించిన పార్టీ. ఆ పార్టీకి చాలా చరిత్ర ఉంది.  మేం ఎప్పుడూ పాక్‌కు సపోర్ట్‌ చేయలేదు. ఆహ్వానించకుండా పాక్‌కు వెళ్లడం సిగ్గుచేటు. మాపై నిందలు వేస్తూ.. పాక్‌ నేతలను కౌగిలించుకుంటారు. మీరు తప్పు చేసి మాపై అసత్య ప్రచారాలు చేస్తారా?. ఇదేనా మీ దేశ భక్తి. 

కాంగ్రెస్‌ను నిందిస్తూ ఎంత కాలం బతుకాలనుకుంటున్నారు?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా? పహల్గాం ఘటన తర్వాత జరిగిన ఆల్‌ పార్టీ మీటింగ్‌లో ప్రధాని ఎందుకు లేరు?. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారు?. ప్రధానికి దేశ భద్రత కంటే ఎన్నికల ర్యాలీలే ఎక్కువయ్యాయా?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా?’’ అని ఖర్గే ధ్వజమెత్తారు.

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌-భారత్‌ కాల్పుల విరమణను భారత విదేశాంగ శాఖ మంత్రో, ప్రధానినో, లేకుంటే రక్షణ మంత్రినో ప్రకటించలేదు. ఎక్కడో వాషింగ్టన్‌ నుంచి ట్రంప్‌ ప్రకటించారు. కాల్పుల విమరణ తన విజయమేనని ట్రంప్‌ ఇప్పటిదాకా 29సార్లు ప్రకటించుకున్నారు. ఈ నా ప్రసంగం ముగిసేలోపు ఆయన మరోసారి ప్రకటించుకుంటే 30వ సారి అవుతుంది. అయినా ఆ నిజాన్ని కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఖర్గే ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement