
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష రద్దు అయ్యిందన్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆమె మరణశిక్ష రద్దు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. తన సహచర భాగస్వామిని హత్య చేసిన అభియోగాల మీద ఆమెకు ఈ శిక్ష పడిన సంగతి తెలిసిందే.
కేరళకు చెందిన ప్రముఖ మత గురువు, సున్నీ నేత కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాయలం నుంచి ఆమెకు మరణశిక్ష తప్పిందనే ప్రకటన వెలువడింది. యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఖైదీకి ఉన్న నిమిషకు.. హౌతీ మిలిటరీ ప్రభుత్వం నుంచి ఊరట లభించిందని తెలిపింది.
అయితే ఆ ప్రకటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేదంటూ కేంద్రం కాసేపటి కిందట స్పష్టత ఇచ్చింది. నిమిష ప్రియ కేసులో వ్యక్తిగతంగా చేసే ప్రకటనలతో సంబంధం లేదని.. అక్కడి అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ప్రముఖ వెబ్‌సైట్ హిందూ ఓ కథనం ఇచ్చింది.
#Government denies claim of #NimishaPriya's #deathpenalty being revoked: Sources https://t.co/sNMZ3AhC9S #WeRIndia pic.twitter.com/PszX95Kbz1
— Werindia (@werindia) July 29, 2025
సనాలో అత్యున్నత సమావేశం తర్వాత.. సోమవారం అర్ధరాత్రి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం మరణశిక్ష రద్దు అంటూ ప్రకటన చేసింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు.అబుబాకర్ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ కేంద్రం ఇప్పుడు ఆ ప్రకటనను తోసిపుచ్చడం గమనార్హం.
మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరమే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్‌లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించి.. మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.