
కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన.
ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ, జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన.
మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్‌తో చెప్పారు. ఆర్థికల్ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన.
