
మా కూతురు అమెరికాలో వుంటుంది. అక్కడ గ్రీన్ కార్దు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటోంది. సమస్య ఏమిటంటే, తన బర్త్ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ 22–10–1999 అని ఉంది. కానీ పాస్‌పోర్టు – విద్య సర్టిఫికెట్లు అన్నిట్లో 22–10–1998 అని ఉంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే బర్త్ సర్టిఫికెట్‌లో ఉన్న పుట్టిన తేదీ – పాస్‌పోర్ట్‌లో ఉన్న తేదీ ఒకటే అయి ఉండాలి, లేకపోతే కుదరదు అంటున్నారు. మా అమ్మాయి ఇవి మార్పించమని అడుగుతోంది. పాస్‌పోర్టులో పుట్టిన తేదీ మార్చుకోవటం కుదురుతుందా?
– పూర్ణిమ, చిత్తూరు
మీరు అడిగిన ప్రశ్న చిన్నదిగా అనిపించినప్పటికీ పరిష్కారం అంత సులభమైనదేమీ కాదు. ఐతే కొంచెం కష్టం అయినప్పటికీ పరిష్కారం ఉంది. పాస్‌పోర్టులో పుట్టిన తేదీ మార్చుకోవడం సాధారణ పరిస్థితులలో వీలుపడదు. పుట్టిన తేదీని మార్చడానికి గల కారణాలు చాలా బలమైనవిగా, నిర్దిష్టంగా ఉండాలి. అలా మార్చుకోవడానికి గల కారణాలను వివరిస్తూ తగిన రుసుము చెల్లించి పాస్‌పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మేజర్ అయిన తర్వాత పాస్‌పోర్ట్ తీసుకుని ఉన్నట్లయితే, పాస్‌పోర్ట్ పొందిన ఐదు సంవత్సరాల లోపు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మైనర్ గా ఉన్నప్పుడు తీసుకున్న పాస్‌పోర్ట్ అయితే, తిరిగి రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా మార్చుకోవచ్చు.
ఈ రెండు సందర్భాలలోని గడువు దాటి΄ోతే, ఇక పాస్‌పోర్ట్‌లోని పుట్టిన తేదీ మార్చడం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప కుదరదు. కానీ కేవలం పాస్‌పోర్ట్ మార్చుకున్నంత మాత్రాన మీ అమ్మాయి సమస్య తీరదు. ఎందుకంటే, పాస్‌పోర్ట్ లోని వివరాలను అమెరికా వెళ్లేటప్పుడు వీసా కోసం, పై చదువుల కోసం, లేదా ఉద్యోగం కోసం కూడా ఇచ్చి ఉంటారు కాబట్టి, ఆ రికార్డులు అన్నీ కూడా మార్చవలసి వస్తుంది. అలా కాకుండా కేవలం పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ మాత్రమే చూస్తార్లే అని తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త!
మీ అమ్మాయి రికార్డులలో వ్యత్యాసం ఉంటే ప్రస్తుతం ఉన్న వీసా సమస్య ఇంకా జటిలం అవ్వచ్చు. గ్రీన్ కార్డు కోసం చేసుకునే ఐ–495 దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారుల ద్వారా వారి పూర్వవీసాలు, డాక్యుమెంట్లు, ధ్రువీకరణలు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిట్లో ఒకే సమాచారం లేకపోతే లేదా ముందస్తు సంజాయిషీ ఇచ్చి ఉండకపోతే కొత్త సమస్య మొదలై, ఉన్న వీసా కూడా పోవచ్చు.
అంతేగాక, అన్ని సర్టిఫికెట్‌లలో 1998 ఉంది అని చెప్పారు కాబట్టి, అవన్నీ కూడా మార్చాల్సి వస్తుంది కదా... అందుకే, పాస్‌పోర్ట్‌లో మార్పు చేసుకున్న తర్వాత CI (అమెరికా పౌరసత్వ – ఇమ్మిగ్రేషన్ సేవ) – USDHS (అమెరికా అంతర్గత భద్రతా విభాగం) వంటి సంస్థలకు స్వతహాగా, స్వచ్ఛందంగా అన్ని అంశాలను తెలియజేయటం మంచిది. అవసరమయితే మీ జిల్లాలో సివిల్ కోర్టును ఆశ్రయించి కూడా డిక్లరేషన్ కోరే అవకాశం లేకపోలేదు. అలా డిక్లరేషన్ పొందిన తర్వాత రికార్డులలో సవరణలు చేసే వీలుంటుంది. ముందుగా అమెరికాలోని ఒక మంచి ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను కలిసి ఏ రికార్డు మారిస్తే మంచిది, లేక బర్త్ సర్టిఫికెట్ లేకుండా మరేదైనా ఉసాయం ఉందేమో తెలుసుకోండి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)