
నచ్చిన రంగంలో రాణించాలని ఎంతో ప్రయాసపడతారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని డ్రీమ్ సాధించుకుందామనే తరుణంలో ఊహకందని మలుపు తీసుకుంటుంది జీవితం. అనుకోని ఆ యూటర్న్‌ని జీర్ణించుకోలేక సతమతమవుతారు చాలామంది. కానీ కొందరు జీవితంలో ఇలాంటివి భాగమే అని సానుకూల దృక్పథంతో ఆ అవాంతరం లేదా ఆపదను జయించి అనుకున్న కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి గాథే ఈ యువకుడి కథ. అతడి స్టోరీ ఆద్యంతం ఆసక్తికరంగానూ..స్పూర్తిదాయకంగానూ ఉంటుంది.
అతడే పరాస్ బజాజ్. 12వ తరగతికే చదవుకి స్వస్తి పలికాడు. చదవు కంటే ఫిటెనెస్ పట్ల పరాస్‌కి మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే చదువుని మధ్యలోనే ఆపేసి ఢిల్లీలోని ఫిట్‌నెస్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఫిట్‌నెస్ అంటే.. శారీరక పరివర్తన మాత్రమే కాదు, క్రమశిక్షణతో బాధ్యతగా మెలిగేలా చేసే ఒక ప్రక్రియ అని పరాస్ గుర్తిస్తాడు. తాను సరైన రంగాన్ని ఎంచుకున్నానని భావించి కొద్దికాలంలోనే దానిపై మంచి పట్టు సాధించి..ఇతరుల ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో సాయం అదించే స్థాయికి చేరుకున్నాడు.
అలా అతడు ఆ ఫిట్‌నెస్ రంగంలో అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతో ప్రభుత్వ స్టార్టప్ కింద రుణం తీసుకుని మరీ ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో సొంతంగా జిమ్‌ను ప్రారంభించాడు. అంతా హాయిగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో జీవితం ఊహించని విధంగా సవాలు విసిరింది. ఇలా సొంతంగా జిమ్ ప్రారంభించాడో లేదో జస్ట్ రెండు నెలలకే కేన్సర్ బారినపడ్డాడు.
ఆ తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సల కారణంగా..అప్పటి దాక మంచి ఫిట్‌గా ఉండే అతడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జుట్టు ఊడిపోయింది, మజిల్స్ తగ్గిపోయాయి, ఆఖరికి ఒంట్లో శక్తి కూడా సన్నగిల్లినట్టుగా రోజువారి పనులు చేయలేనంత బలహీనమైన దయనీయ స్థితికి వచ్చేశాడు. ఏదిఏమైతేనేం కఠినమైన శస్త్రచికిత్సలతో ఏప్రిల్ 30,2024న కేన్సర్‌ని జయించాడు. అది అతడిలో ఏ మూలనో దాగి ఉన్న ఆశకు కొత్త ఊపిరిని పోసింది.
కేవలం శస్త్ర చికిత్స చేయించుకున్న ఒకటిన్నర నెలకే జిమ్‌కి తిరిగి వచ్చి..తనను తాను మరింత స్ట్రాంగ్ మెన్‌గా మార్చుకోవాలనుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే బాడీ బిల్డింగ్‌పై ఫోకస్ పెట్టి వివిధ విభాగాలలో బరువులను ఎత్తడంపై కసరత్తులు చేశాడు. అలా 220 కిలోల బరువుని ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ కేన్సర్ తన శరీరంపై గాయంలా కాకుండా..మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే గుర్తుగా మలచాలన్నా.. ఆలోచన ఈ విజయానికి దారితీసింది.
అంతేగాదు తనలా ఇలా చిన్నవయసులోనే కేన్సర్‌తో బారినపడుతున్న వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలబడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సగర్వంగా తెలిపాడు. అదీగాక తాను వెనుదిరిగి చూసుకున్నప్పడల్లా..తన ఒంటిపై మిగిలిని కేన్సర్ గుర్తులు తనను మరింత బలవంతుడిగా మార్చిందే తప్ప..తన కలను దూరం చేయలేకపోయిందని అంటాడు పరాస్. ఈ కష్ట సమయం తనకు ఓ గుణ పాఠాన్నినేర్పందని చెబుతున్నాడు. ప్రతిదీ మార్చగలమనే సంకల్పం బలంగా ఉంటే దేన్నైనా సులభంగా ఉన్నతికి మార్గంగా మార్చుకోవచ్చని అంటాడు పరాస్. నెటిజన్లు సైతం అతడి సంకల్పానికి ఫిదా అయ్యి, అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ..పోస్టులు పెట్టారు.
(చదవండి: World Hepatitis Day: ఐబ్రోస్ థ్రెడింగ్‌తో ఇంత ప్రమాదమా..! ఏకంగా కాలేయంపై..)