
బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఐబ్రోస్‌ని అందంగా తీర్చిదిద్దుకోవడం అనేది చాలామంది మహిళలు చేయించుకునే సాధారణ సౌందర్య చికిత్స. దీన్ని రెండు నెలలకొకసారి చేయించుకుంటుంటారు. తక్కువ ఖర్చులో ముఖాన్ని అందంగా మార్చుకునే కొద్దిపాటి సౌందర్య ప్రక్రియ ఇది. దీంతో ఆరోగ్య సమస్యలు ఏం ఉంటాయని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇంది ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌ల బారిన పడేలా చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అసలు ఐబ్రోస్ థ్రెడింగ్‌తో ఎలా అనారోగ్యానికి గురవ్వుతారు అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి సంక్రమణం, కాస్మెటిక్ విధానాల వల్ల కూడా ఇది సోకుతుందా వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.!.
ఇటీవల ఓ 28 ఏళ్ల మహిళ ఇలాంటి సమస్యను ఎదుర్కొవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెన కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకున్న తర్వాత కాలేయ ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన హెపటైటిస్ బీ బారిన పడిందని వైద్య పరీక్షల్లో తేలింది. శతాబ్దాల నాటి బ్యూటీషియన్ విధానం ఇది. పైగా ప్రతి రెండు నెలలకోసారి చేయించుకుంటుంటారు.
చాలా సరసమైన ధరలో ముఖాకృతి అందంగా మార్చుకుని ఈ సౌందర్య చికిత్స సదరు మహిళకు ప్రాణంతకంగా మారిందని వెల్లడించారు వైద్యులు. ఆ యువతికి థ్రెడింగ్ ద్వారా హెపటైటిస్ బి వ్యాపించిందని చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తదనంతరం..అలసట, వికారం, పసుపు కళ్లు వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ థ్రెడ్డింగ్ కారణంగా ఆమె శరీరంలోకి హెపటైటిస్ బి లేదా సి వైరస్‌లు రక్తప్రవాహంలోకి ప్రవేశించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
అసలు హెపటైటిస్‌కు ఎలా దారితీస్తుంది...
కొన్ని పార్లర్లలో కనుబొమ్మల ఆకృతి కోసం చేసే థ్రెడింగ్ దారం సాధారణంగా అందరికి ఉపయోగించే దాన్నే వినియోగిస్తుంటారు. అక్కడ వాళ్లు కాస్త పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని అన్నారు. ఒకరికి ఉపయోగించని దారం మరొకరికి వినియోగించడంతో ఆ థ్రెడ్డ్ కనుబొమ్మలను కట్ చేస్తున్నప్పుడే ఈ హెపటైటిస్ బి, సీ వైరస్‌లు సులభంగా సక్రమింస్తాయట. ఒక్కోసారి దీని వల్లే హెచ్‌ఐవీ బారీన కూడా పడే ప్రమాదం ఉందట.
డబ్ల్యూహెచ్‌ఓ సైతం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం టాటూ వేయించుకోవడం, రేజర్‌లను షేర్ చేసుకోవడం, థ్రెడింగ్ చేయించుకోవడం వంటి కాస్మెటిక్ విధానాల వల్ల హెపటైటిస్ బి బారినపడ్డ పలు కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. ఈ హెపటైటిస్ బి వైరస్ చిన్న కలుషితమైన వాటి ఉపరితలాలపై రోజుల తరబడి జీవించి ఉంటుందట. ఇది కేవలం రక్తం వల్ల సంక్రమించదని, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఒక్క దారం చాలు సులభంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంత వ్యవధి పడుతుందంటే..
వ్యాధి నిరోధక శక్తి బాగున్నంత వరకు ఈ వైరస్‌తో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యానికి గురవ్వడం లేదా వీక్ అవుతామో అప్పుడు ఈ వైరస్ విజృంభణ మొదలవ్వుతుందట. తీవ్రమైన హెపటైటిస్ బి ఆరునెలల వరకు ఉంటుందట.
ఈ టైంలో వైరస్ శరీరమంతా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఒక్కోసారి క్రియాశీల హెపటైటిస్ బారిన పడితే..సుదీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. ఇందులోనే సాధారణ హెపటైటిస్ బారిన పడితే..ప్రమాదం తక్కువగా ఉంటుంది. వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడగలరని చెబుతున్నారు నిపుణులు.
లక్షణాలు..
ఒక్కోసారి ఈ హెపటైటిస్ బి అనేది ఎలాంటి సంకేతాలు చూపకుండానే దాడి చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా చాలామటుకు అందరిలోనూ ఒకేలా ఈ కింది సంకేతాలు కనిపిస్తాయి..
కడుపు నొప్పి
అలసట
జ్వరం
కీళ్ల నొప్పులు
ఆకలి లేకపోవడం
వికారం, వాంతులు
ముదురు రంగు మూత్రం
లేత లేదా మట్టి రంగు మలం
చేతులు, కాళ్లు వాచినట్లు లేదా ఉబ్బినట్లుగా నీరి చేరి ఉండటం
చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం తదితర లక్షణాలు
అందువల్ల సాధ్యమైనంత వరకు కాస్మెటిక్‌కి సంబంధించిన వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. పార్లర్‌లో సరైన పరి శుభ్రత ఉందో లేదో నిర్థారించుకున్నాక..ఎలాంటి సౌందర్య చికిత్సా విధానానికైనా ముందుకెళ్లడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!)