breaking news
beauty parlours
-
ఎవరికి వారే హెయిర్ స్టైలిస్టులు
‘అసలే కరోనా.. పిల్లలకు కటింగ్ పెరిగింది..సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది.. అందుకే నేనే వారికి ఇంట్లో నేనే కటింగ్ చేశా ’ అని బోడుప్పల్‌కు చెందిన ప్రశాంత్ చెప్పాడు. ఇలా నగరంలో చాలా మంది పిల్లలకు కటింగ్ చేయడంతోపాటు సొంతంగా తామే చేసుకుంటున్నారు. సెలూన్ ఎట్ హోమ్..అవును ఇప్పుడు ఇదే సరికొత్త ట్రెండ్. ఎవరి ఇళ్లల్లో వారే హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు. అవసరమైతే భార్య, పిల్లల సైతం సహాయం కోరుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు హెయిర్ కట్ చేస్తున్నారు. సెలూన్లకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మగువల బ్యూటీపార్లర్లు సైతం ఇళ్లల్లోనే వెలిశాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మోసుకొచ్చిన సరికొత్త జీవన శైలి ఇది. సెలూన్లు, పార్లర్లకు వెళ్లేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. కోవిడ్ కారణంగా అన్ని రంగాల్లో సరికొత్త పోకడలు ముందుకు వచ్చేశాయి. చివరకు హెయిర్ కటింగ్ కోసం కూడా బయటకు వెళ్లకుండా వైరస్ కట్టడి చేసింది. ఇందుకోసం యూట్యూబ్ పాఠాలు సైతం దొహదం చేస్తున్నాయి. నచ్చిన పద్ధతిలో, చక్కటి ఆకృతిలో హెయిర్ కటింగ్ చేసుకొనేందుకు యూట్యూబ్ శిక్షణనిస్తోంది. ఇదే సమయంలో ఇంటి వద్దకు వచ్చి సర్వీసులు అందజేసే ఆన్లైన్ సంస్థలకు సైతం డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఈ ఆన్లైన్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సాధారణ సెలూన్లు, బ్యూటీపార్లర్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కార్పొరేట్ సెలూన్ల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారింది. సెలూన్ మనుగడ ప్రశ్నార్థకం ‘‘ఆరు నెలలైంది. గిరాకీ లేదు. మూడు నెలలుగా అద్దెలు చెల్లించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి’’ నాగోల్ దగ్గర్లోని బండ్లగూడకు చెందిన ఉదయ్ అనే ఒక బార్బర్ ఆవేదన ఇది. చిన్న సెలూన్ అతనిది. కరోనాకు ముందు జీవితం సాఫీగా సాగింది. రోజుకు రూ.వెయ్యి పైనే లభించింది. కానీఇప్పుడు వారం రోజులు పని చేసినా రూ.200 కూడా రావడం లేదు. ఒక్క ఉదయ్ మాత్రమే కాదు. నగరంలో వేలకొద్దీ సెలూన్ల పరిస్థితి ఇదే.. క్షౌ రవృత్తిదారుల సంఘాల అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 30 వేల హెయిర్ కటింగ్ సెలూన్లు, మరో 10 వేలకు పైగా బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీలలో కలిపి కనీసం 7 వేల నుంచి 8 వేల సెలూన్లు, పార్లర్లు గిరాకీ లేక మూతపడినట్లు అంచనా. ఇంకా కొన్ని మూసివేత దిశగా ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి వేలాది కుటుంబాలకు ఆర్థికంగా చితికిపోయాయి. దూసుకెళ్తున్న ట్రిమ్మర్ సికింద్రాబాద్‌లోని ఒక కాస్మొటిక్ షోరూమ్‌లో ప్రతి నెలా సుమారు 5 వేల ట్రిమ్మర్లను విక్రయిస్తారు. సాధారణంగా సెలూన్ నిర్వాహకులే వీటిని కొనుగోలు చేస్తారు. కానీ గత జూలై నెలలో ఆ ఒక్క షోరూమ్‌లోనే ఏకంగా 20 వేల ట్రిమ్మర్లను విక్రయించారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఆ నెలలో సుమారు 2.5 లక్షల ట్రిమ్మర్ల విక్రయం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క హెయిర్ కటింగ్ కోసం, షేవింగ్ కోసం వినియోగించే ట్రిమ్మర్లే కాదు. రేజర్లు, సీజర్లు, లోషన్లు, ఫోమ్‌లు, డిస్పోజల్ షీట్స్, కోంబ్స్ వంటి వాటి విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి. వినియోగదారులే స్వయంగా వచ్చి కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. ఇలా కొనుగోలు చేస్తున్న వాళ్లలో స్వయంగా హెయిర్ కటింగ్‌లు చేసుకొనేవాళ్లతో పాటు బార్బర్ల వద్ద సొంత వస్తువులను వినియోగించే వాళ్లు కూడా ఉన్నారు. చిన్న చిన్న హెయిర్ కటింగ్ సెలూన్లు మొదలుకొని కార్పొరేట్ సెలూన్లు, బ్యూటీపార్లకు వివిధ రకాల వస్తువులను విక్రయించే వ్యాపార సంస్థలు ఇప్పుడు నేరుగా వినియోగదారులకే విక్రయించడం ఈ సరికొత్త ట్రెండ్‌లో భాగమే. దీంతో బేగంబజార్, కోఠీ, చార్మినార్, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ వంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న కాస్మొటిక్ షోరూమ్‌లలో ఈ వస్తువుల అమ్మకాలు భారీగా పెరిగాయి. రూ.కోట్లల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. కుదేలైన పార్లర్లు... తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన ఒక బ్యూటీపార్లర్ కోవిడ్‌కు ముందు స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా సేవలందజేసింది. వినియోగదారులు ముందస్తు అపాయింట్మెంట్లతో వచ్చేవారు. కానీ ఇప్పుడు వినియోగదారుల సంఖ్య మూడొంతుల మేరకు పడిపోయింది. ‘కోవిడ్ ప్రొటోకాల్ మేరకు సర్వీసులు అందజేస్తున్నప్పటికీ వినియోగదారులు ముందుకు రావడం లేదు..’అని నిర్వాహకులు శ్రీనివాస్ విస్మయం వ్యక్తం చేశారు. బడంగ్‌పేట్‌కు చెందిన పేజ్ 18 సెలూన్ అండ్ అకాడమీ ఒక శిక్షణా సంస్థ. మహిళలకు, పురుషులకు విడి విడిగా సర్వీసులు అందజేస్తుంది. హెయిర్ డిజైనర్లకు శిక్షణనిస్తోంది.‘ఏడాది క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అకాడమీ భవితవ్యం ప్రశార్థకంగా మిగిలింది.’’అని ఆవేదన వ్యక్తం చేశారు నిర్వాహకులు సతీష్‌కుమార్. కార్పొరేట్ సెలూన్లపైనా ప్రభావం ఈ క్రమంలోనే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన కార్పొరేట్ బ్యూటీపార్లర్లు, సెలూన్లలోనూ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వివిధ సంస్థలకు చెందిన వందలాది ఫ్రాంచైసీస్ మూతపడ్డాయి. నగరంలో బాగా ప్రాచుర్యం పొందిన నేచురల్స్, గ్రీన్‌ల్యాండ్స్, అలెగ్జాండర్, జావేద్ వంటి అనేక బడా సంస్థల్లో సైతం 60 శాతానికి పైగా ఆదాయం పడిపోయింది. సగానికి పైగా సిబ్బందిని కుదించారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ సెలూన్లో కరోనాకు ముందు ప్రతి నెలా రూ.25 లక్షలకు పైగా ఆదాయం లభించగా ఇప్పుడు రూ.8 లక్షలు కూడా రావడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సంస్థలతో మరింత దెబ్బ.. ఇటీవల వినియోగంలోకి వచ్చిన ఆన్లైన్ సంస్థలు సెలూన్ల మనుగడను మరింత ప్రశ్నార్థకం చేశాయి. ఇళ్ల వద్దకే వెళ్లి సేవలందజేసే వెసులుబాటు కల్పించడంతో చాలామంది ఆన్లైన్ సంస్థలను ఆశ్రయియిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సెలూన్లు, బ్యూటీపార్లకు గిరాకీ లేకుండా పోతోంది. సాధారణ సెలూన్లకే కాకుండా బడా కార్పొరేట్ సెలూన్లకు కూడా ఆన్లైన్ సంస్థలు సవాల్ విరుతున్నాయి. వ్యక్తిగత రక్షణకే కరోనా నుంచి వ్యక్తిగత రక్షణ పొందేందుకే సెలూన్లకు వెళ్లడం లేదు. యూట్యూబ్‌లో చూసి స్వయంగా హెయిర్ కట్ చేసుకుంటున్నారు. పరిస్థితులు మారే వరకు తప్పదు మరి. – సంతోష్, హైటెక్‌సిటీ పిల్లలకు నేనే హెయిర్ స్టైలిస్ట్ పిల్లలకు సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది. అందుకే ఇంటి దగ్గర నేనే కట్ చేస్తున్నాను. కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నా సెలూన్ కంటే ఇల్లే సేఫ్ కదా. – ప్రశాంత్‌రెడ్డి, బిజినెస్మెన్, బోడుప్పల్ భవిష్యత్తు ప్రశార్థకమే గతంలో ప్రతి రోజూ కనీసం 30 మంది మహిళలు వివిధ రకాల సర్వీసుల కోసం వచ్చేవారు. ఇప్పుడు రోజులో ఐదుగురు కూడా రావడం లేదు. – సుకన్య, బడంగ్పేట్,బ్యూటీపార్లర్ నిర్వాహకులు ఒక పాలసీని రూపొందించాలి సెలూన్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఆర్థిక సహాయం చేయాలి. ప్రతి కుటుంబానికి రూ.50 వేల సహాయం అందజేయాలి. –బాలకృష్ణ నాయీ, క్షౌరవృత్తిదార్ల సంఘం అధ్యక్షుడు -
అక్కడ బ్యూటీ పార్లర్, సెలూన్లకు అనుమతి
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి బ్యూటీ పార్లర్లను, సెలూన్లను తిరిగి తెరవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం గ్రామాల్లోని సెలూన్లను తెరవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వం తాజాగా తమిళనాడుకు చెందిన సెలున్లు, బ్యూటీ పార్లర్లకు కూడా తెరిచేందుకు అనుమతించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉండే రాష్ట్రాలలో తమిళనాడు రెండవ స్థానంలో ఉన్నందున చెన్నై, కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని వీటికి మాత్రం ప్రభుత్వం అనుమంతించలేదు. (బోయిన్పల్లి ఠాణాలో కరోనా కలకలం..) ఈ దుకాణాలు పాటించాల్సిన నియమాలు: దుకాణాల్లో ఎయిర్ కండిషనింగ్‌ను వాడకూడదు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దుకాణాలు తెరిచి ఉంచాలి. సిబ్బంది, కస్టమర్లు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. సామాజిక దూరం పాటించడంతో పాటు కనీసం 5 సార్లు క్రిమిసంహారక మందును షాపులో స్ర్పే చేయాలి. ఇక కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బందిని కానీ కస్టమర్లను కానీ లోనికి అనుమతించకూడదు. కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బంది లేదా కస్టమర్‌ను లోపలికి అనుమతించకూడదు. సెలూన్లలో పనిచేసే సిబ్బంది ఎవరైనా కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తే వారికి పనిచేయడానికి అనుమతి లేదు. -
అమ్మో మగవారు.. అన్నిటా తగువారు!
పశ్చిమగోదావరి, ఏలూరు(సెంట్రల్): అన్ని రంగాల్లో తామూ సగమంటూ అతివలు దూసుకొస్తుంటే మేమేం తీసిపోలేదంటూ మగవారూ ముందుకొస్తున్నారు. మగువలకు దీటుగా సొబగులు అద్దుకుంటున్నారు. ముఖాకృతికి అనుగుణంగా కేశాలు, గెడ్డాల రూపు రేఖలను ఆధునిక హంగులతో మార్చేసుకుంటున్నారు. హుందాగా కనిపించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. వయోభేదం లేకుండా ఆధునిక ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇందుకోసం నెలవారీ బడ్జెట్లో కొంత మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. పురుషుల అందం వెనుక సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో అప్లోడ్ చేసుకునేందుకు అందంగా రెడీ అవుతున్నారు. ఈ తరహా విధానం ఇటీవల కాలంలో నూతన ట్రెండ్ ఫోలవర్స్‌కు దారి తీస్తొంది. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ఎక్కువగా వినియోగించే వారు అందంగా కనిపించే వారిని ఫాలో అవుతున్నారు. చదువు పూర్తయ్యాక ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్లాలనుకునే యువత అందంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు. మారుతున్న అలంకరణలు గతంలో చేతికి దేవుడి కంకణాలు, దారాలు కట్టుకునే వారు. ఇప్పుడు అప్డేటెడ్ లెదర్, బ్రాసెలెట్, స్టీల్ బ్రాస్లెట్లను ధరిస్తున్నారు. చెవులకు పోగులు మాదిరి ఉండే డైమండ్స్, పూసలు పెట్టుకుంటూ నాగరికతను ఫాలో అవుతున్నారు. మెడలో వివిధ పూసలు, లాకెట్లు ధరిస్తున్నారు. వీటితో పాటు బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన షూ, చెప్పుల కొనుగోలు అధికమొత్తం వెచ్చిస్తున్నారు. చివరికి హుందాతనాన్ని పెంచే ఖరీదైనా లెదర్ పర్సులు వినియోగం సైతం పెరిగింది. కాస్ట్ ఎక్కువైనా కళ్లకు నప్పే కళ్ల జోళ్లు , గాగూల్స్, ఖరీదైన టోపీలు ధరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నగరంలో ఆధునిక సెలూన్లు అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన పలు కార్పొరేట్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు నగరంలో వెలిశాయి. ఇటీవల కాలంలో కార్పొరేట్ సెలూన్లు నగరంలో ఐదుకు పైగా వెలిశాయి. దాంతో వీటిపై యువత ఆకర్షితులవుతున్నారు. జుట్టు కత్తిరింపులు, మేనిక్యూర్, పిడిక్యూర్, రింగుల జట్టును మార్చుకోవటం, జట్టుకు పలు రకాల రంగులు అద్దుకోవటం వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్‌ను అనుసరించేది కొంత మందికైతే తమ నచ్చిన హీరొల స్టైల్‌ను అనుసరించేందుకు మరికొందరూ పోటీపోడుతున్నారు. గతంలో కంప్లీట్ షేవ్‌తో కనిపించే వారు ఇప్పుడు గెడ్డాన్ని ఎక్కువగా పెంచుకోవడంతో పాటు వివిధ ఆకృతుల్లో మార్చుకోవడం హోట్ఫేవరేట్గా మారింది. ఇందుకు కోసం కనీస నెలవారీ బడ్జెట్లో రూ.2000 నుంచి రూ.3000 వరకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు తమ ముఖ సౌంథర్యానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా కనిపించాలని.. ఫ్యాషన్‌కు కాలానుగుణంగా మార్పు సహజం. మేం కూడా మా లైఫ్‌స్టైల్‌ను మార్చుకుంటున్నాం. ముఖానికి మెరుగులు అద్దుకోవటంలో తప్పేమీ లేదు. కొత్తగా వచ్చిన ఫేషియల్స్ ఫ్లేవర్లు వాడటం ద్వారా ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాం. –దేశెట్టి సాయి, యువకుడు, ఏలూరు ఆడవాళ్లకు దీటుగా.. యువత ట్రెండీగా ఉండాలనుకుంటున్నారు. ఇంటర్నెట్లో ప్రతి అంశాన్ని చూస్తూ లేటెస్ట్ ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నారు. వారికి కావల్సిన రీతిలో అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఆడవాళ్లకు దీటుగా మగవారూ పోటీపడుతున్నారు.–పి.మహేంద్ర, గ్రీన్ ట్రెండ్, పర్యవేక్షకుడు, ఏలూరు -
'24 గంటల్లోగా బ్యూటీ పార్లర్లు మూసేయాలి'
జమ్ము: అప్పుడెప్పుడో ఆఫ్ఘనిస్థాన్ కొండల్ని దాడి కశ్మీర్‌లోయలోకి ప్రవేశించిన తాలిబన్ విష సంస్కృతి మళ్లీ బుసలు కొడుతోంది. మహిళలు, విద్యార్థినుల వస్త్రధారణ, నడతను నిర్దేశిస్తూ ఉగ్రవాదులు జారీచేసిన హెచ్చరికల రూపంలో అది మరోసారి బయటపడింది. 'అమ్మాయిలెవ్వరూ బురఖా ధరించకుండా బయటికి రావద్దు. అది లేకుండా బడికి, కాలేజీకి వచ్చేవాళ్లను ఉపేంక్షిచొద్దు' అంటూ హిజబుల్ ముజాహిద్దీన్ సంస్థ పేరుతో పుల్వామా పట్టణంలోని అన్ని విద్యాసంస్థలవద్ద వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న బ్యూటీపార్లర్లన్నీంటినీ 24 గంటల్లోగా మూసేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఉగ్రవాదులు హెచ్చరించారు. ఇక మగవాళ్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఇప్పటికే మద్యం, డ్రగ్స్ తీసుకునే అలవాట్లున్నవాళ్లు వెంటనే మానేయాలని పిలుపునిచ్చారు. కలకలంరేపిన ఈ పోస్టర్ల ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించామని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పనులు ఎవరు చేసినా ఆక్షేపణీయమేనని పుల్వామా సీనియర్ ఎస్పీ తేజిందర్ సింగ్ అన్నారు. నిందుతుల్ని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కశ్మీర్ లో ఇలా మహిళల వస్త్రధారణను నిర్ధేశిస్తూ పోస్టర్లు అంటించిన ఉదంతాలు గతంలోను పలుమార్లు వెలుగులోకి వచ్చాయి.