అమ్మో మగవారు.. అన్నిటా తగువారు!

Beauty Parlours For Mens in West Godavari - Sakshi

లేటెస్ట్‌ ట్రెండ్‌ ఫాలో అవుతున్న యువకులు  

మహిళలకు దీటుగా అందానికి మెరుగులు

బ్యూటీ పార్లర్లుగా మారుతోన్న సెలూన్లు

పశ్చిమగోదావరి, ఏలూరు(సెంట్రల్‌): అన్ని రంగాల్లో తామూ సగమంటూ అతివలు దూసుకొస్తుంటే మేమేం తీసిపోలేదంటూ మగవారూ ముందుకొస్తున్నారు. మగువలకు దీటుగా సొబగులు అద్దుకుంటున్నారు. ముఖాకృతికి అనుగుణంగా కేశాలు, గెడ్డాల రూపు రేఖలను ఆధునిక హంగులతో మార్చేసుకుంటున్నారు. హుందాగా కనిపించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. వయోభేదం లేకుండా ఆధునిక ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇందుకోసం నెలవారీ బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. పురుషుల అందం వెనుక సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో అప్‌లోడ్‌ చేసుకునేందుకు అందంగా రెడీ అవుతున్నారు. ఈ తరహా విధానం ఇటీవల కాలంలో నూతన ట్రెండ్‌ ఫోలవర్స్‌కు దారి తీస్తొంది. ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌ ఎక్కువగా వినియోగించే వారు అందంగా కనిపించే వారిని ఫాలో అవుతున్నారు.  చదువు పూర్తయ్యాక ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్లాలనుకునే యువత అందంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.

మారుతున్న అలంకరణలు
గతంలో చేతికి దేవుడి కంకణాలు, దారాలు కట్టుకునే వారు. ఇప్పుడు అప్‌డేటెడ్‌ లెదర్, బ్రాసెలెట్, స్టీల్‌ బ్రాస్‌లెట్‌లను ధరిస్తున్నారు. చెవులకు పోగులు మాదిరి ఉండే డైమండ్స్, పూసలు పెట్టుకుంటూ నాగరికతను ఫాలో అవుతున్నారు. మెడలో వివిధ పూసలు, లాకెట్‌లు ధరిస్తున్నారు. వీటితో పాటు బ్రాండెడ్‌ దుస్తులు, ఖరీదైన షూ, చెప్పుల కొనుగోలు అధికమొత్తం వెచ్చిస్తున్నారు. చివరికి హుందాతనాన్ని పెంచే ఖరీదైనా లెదర్‌  పర్సులు వినియోగం సైతం పెరిగింది. కాస్ట్‌ ఎక్కువైనా కళ్లకు నప్పే కళ్ల జోళ్లు , గాగూల్స్, ఖరీదైన టోపీలు ధరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

నగరంలో ఆధునిక సెలూన్‌లు
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన పలు కార్పొరేట్‌ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు  నగరంలో వెలిశాయి. ఇటీవల కాలంలో కార్పొరేట్‌ సెలూన్లు నగరంలో ఐదుకు పైగా వెలిశాయి. దాంతో వీటిపై యువత ఆకర్షితులవుతున్నారు. జుట్టు కత్తిరింపులు, మేనిక్యూర్, పిడిక్యూర్, రింగుల జట్టును మార్చుకోవటం, జట్టుకు పలు రకాల రంగులు అద్దుకోవటం వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్‌ ట్రెండ్‌ను అనుసరించేది కొంత మందికైతే తమ నచ్చిన హీరొల స్టైల్‌ను అనుసరించేందుకు మరికొందరూ పోటీపోడుతున్నారు. గతంలో కంప్లీట్‌ షేవ్‌తో కనిపించే వారు ఇప్పుడు గెడ్డాన్ని ఎక్కువగా పెంచుకోవడంతో పాటు వివిధ ఆకృతుల్లో మార్చుకోవడం హోట్‌ఫేవరేట్‌గా మారింది. ఇందుకు కోసం కనీస నెలవారీ బడ్జెట్‌లో రూ.2000 నుంచి  రూ.3000 వరకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు తమ ముఖ సౌంథర్యానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

ప్రత్యేకంగా కనిపించాలని..
ఫ్యాషన్‌కు కాలానుగుణంగా మార్పు సహజం. మేం కూడా మా లైఫ్‌స్టైల్‌ను మార్చుకుంటున్నాం. ముఖానికి మెరుగులు అద్దుకోవటంలో తప్పేమీ లేదు. కొత్తగా వచ్చిన ఫేషియల్స్‌ ఫ్లేవర్లు వాడటం ద్వారా ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాం.  –దేశెట్టి సాయి, యువకుడు, ఏలూరు

ఆడవాళ్లకు దీటుగా..
యువత ట్రెండీగా ఉండాలనుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో ప్రతి అంశాన్ని చూస్తూ లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నారు. వారికి కావల్సిన రీతిలో అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఆడవాళ్లకు దీటుగా మగవారూ పోటీపడుతున్నారు.–పి.మహేంద్ర, గ్రీన్‌ ట్రెండ్, పర్యవేక్షకుడు, ఏలూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top