
సాధారణంగా ఏడో నెల్లోనే శిశువులు పుట్టడం గురించి వినే ఉంటాం. వాళ్లను ప్రి మెచ్యూర్ బేబీలుగా పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. సాధారణంగా 32 నుంచి 37 వారాల మధ్య పుడితే ప్రిమెచ్యూర్ అంటారు. అదే 28 నుంచి 32 వారాల మధ్య అయితే వెరీ ప్రిమెచ్యూర్ అంటారు. ఇవేమి కాకుండా అంతకు మించి.. 28 వారాలకు ముందుగానే ప్రసవించిన శిశువుని ఎక్స్‌ట్రీమ్ ప్రిమెమెచ్యూర్ బేబి అంటారు. ఇలాంటి శిశువులు చాల రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాళ్లని కాపాడటం వైద్యులకు అత్యంత సవాలుగా ఉంటుంది. అలా పుట్టి బతికి బట్టకట్టి రికార్డు నెలకొల్పి సెలబ్రిటీ హోదాను అందుకున్నాడు ఈ వండర్ కిడ్. అంతకుమునుపు ఉన్న శిశువు పేరిట రికార్డుని ఒక్క రోజు తేడాతో బ్రేక్ చేసీ ఈ ఘనతను అందుకున్నాడు.
అమెరికాలోని అయోవా నగరంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయోవ నగరంలో జూలై 05, 2024లో మోలీ, రాండాల్ కీన్ అనే దంపతులకు నాష్ కీన్ అనే మగ శిశువు జన్మించాడు. ప్రసవ తేదీకి ముందుగా 133 రోజులు అంటే సుమారు 19 వారాల ముందు జన్మించాడు. తల్లిదండ్రుల సైతం అతడి అనూహ్య జననానికి నివ్వెరపోయారు. తమ బిడ్డ బతుకుతాడా లేదా అన్న ఆశ నిరాశల మధ్య తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు.
ఆ చిన్నారి పుట్టినప్పడు కేవల 10 ఔన్సులు బరువుతో జన్మించాడు. చెప్పాలంటే ద్రాక్షపండంతా పరిమాణం. నాష్ పొటాటోగా పిలిచే ఆ శిశువుకి అయోవా చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించింది. అక్కడే ఆరు నెలల వైద్య సంరక్షణలో ఉన్నాడు.
పాపం ఆ తల్లిదండ్రలు తమ బిడ్డ తమకు దక్కుతాడా లేదా అన్న భయంతో కాలం వెళ్లదీశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి వారి బిడ్డ బతికిబట్టకట్టడమే గాక ఈ ఏడాది తొలిపుట్టిన రోజు జరుపుకున్నాడు. అప్పటి వరకు ఆ శిశువు ఆస్పత్రిలో మానిటర్లు, వైర్లు మధ్యే గడిపాడు. ఈ చిన్నారి నాష్ 20 వారాల ప్రినేటల్ చెకప్ అనంతరం డెలివరీ చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడిందని నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది తల్లి మోలీ. అలా మొత్తం ఆరు నెలల చికిత్స అనంతరం 2025 జనవరి ప్రారంభంలో ఇంటికి వెళ్లేందుకు అనుమతి లభించినట్లు తెలిపారామె. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటుం సాధారణ చిన్నారిలా రూపుదిద్దుకున్నాడని అన్నారు.
అయినప్పటికీ..ఆ శిశువుకి ప్రత్యేక వైద్య సహాయం తప్పనిసరి. ఎందుకంటే అతనకు ఇంకా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు, స్వల్ప వినికిడి సమస్య, ఫీడింగ్ ట్యూబ్ ఉంది. ప్రతి నెల ప్రత్యేక వైద్య డేకేర్‌కి వెళ్లి చికిత్స తీసుకుంటుంటాడు. "అసలు ఇలా ఇంతముందు జన్మించాడే అనే ఆ రోజు తల్లడిల్లా. బహుశా అదే వాడికి సెలబ్రిటీ హోదాని అచ్చి అందరి ఆశీర్వాదం పొందేలా చేసిందని భావోద్వేగంగా చెబుతోంది". ఆ చిన్నారి తల్లి. కాగా, 2020లో అలబామాలో 21 వారాల్లో జన్మించి ఒక చిన్నారి గిన్నిస్ రికార్డులకి ఎక్కగా..దాన్ని కేవలం ఒక్క రోజు తేడాతో ఈ చిన్నారి నాష్ బ్రేక్ చేసి రికార్డునే తిరగరాశాడు.
(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కిచెన్ మనదేశంలోనే..! రోజుకి ఏకంగా..)