నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబూ: వైఎస్‌ జగన్‌ | Ysrcp Pac Meeting: Ys Jagan Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబూ: వైఎస్‌ జగన్‌

Jul 29 2025 1:48 PM | Updated on Jul 29 2025 3:27 PM

Ysrcp Pac Meeting: Ys Jagan Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్‌ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ బాధాకరమన్నారు.

‘‘మిథున్‌ను, గౌతం రెడ్డిని రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్‌కు ఏం సంబంధం?. మిథున్‌ తండ్రి పెద్దిరెడ్డిగారు ఆ శాఖను కూడా చూడలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు.

..కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడు. చంద్రబాబు కంట్లో భాస్కర్‌రెడ్డి కంట్లో నలుసులా మారాడు. భాస్కర్‌ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడు. భాస్కర్‌ కొడుకు లండన్‌లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. నందిగం సురేష్‌, ఒక సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌ మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారు.

..టోల్‌గేట్ల వద్ద ఫీజుల వద్దకూడా వసూలు చేశారని తప్పుడు కేసు. లేని అక్రమాలు చూపించి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మరో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని కోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నంచేశారు. మెజిస్ట్రేట్‌ వద్ద తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించనీయకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు పాలన ఘోరంగా ఉంది. అసలు పరిపాలనే కనిపించడంలేదు

..సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదు.  ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టే… ఈ తప్పడు కేసులు. మాజీ మంత్రి రోజామీత తీవ్రంగా దుర్భాషలాడారు. మన పార్టీలో  ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా?. బీసీ మహిళ, కృష్ణాజడ్పీ ఛైర్మన్‌ హారిక మీద నేరుగా దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిమీద హత్యాయత్నమే లక్ష్యంగా దాడులు చేశారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే.. ఆయన పరిస్థితి ఏంటి?. రాడ్లతో, కర్రలతో దాడులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గ హెడ్‌ క్వార్టర్‌కు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లలేకపోతున్నాడు.

..ఏకంగా సీఐ గన్‌ చూపించి మనుషులను భయపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కొంతమంది డీఐజీలు, పోలీసు అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కొంతమంది పోలీసులు కలెక్షన్‌ ఏజెంట్లుగా మారారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు పంచుతున్నారు. ముఖ్య నేతకు, ముఖ్య నేత కొడుక్కి.. కలెక్షన్లు పంచుతున్నారు. వ్యవస్థీకృతంగా అవినీతి జరుగుతోంది. బెల్టుషాపులకు వేలం పాటలు వేస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా, ర్వార్ట్జ్‌, సిలికా, లెటరైట్‌ మాఫియాలు జరగుతున్నాయి. కొంతమంది పోలీసు అధికారుల సహాయంతో అవినీతిపై పంచాయతీలు చేయిస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని విధంగా అవినీతి జరుగుతోంది

..రేషన్‌ బియ్యం మాఫియా కొనసాగుతోంది. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కొంతమంది డీఐజీలు కలెక్షన్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు, ఇంతకన్నా పచ్చిమోసం ఉంటుందా?.  ఫీజురియింబర్స్‌ మెంట్‌ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు వచ్చాయి. రూ.4200 కోట్లు పీజు రియింబర్స్‌ మెంట్‌ బకాయలు ఉన్నాయి, ఆరు క్వార్టర్లనుంచి పెండింగ్‌. వసతీ దీవెన కింద రూ.2200 కోట్లు బకాయిలు ఉన్నాయి.

	వైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన

..ఆరోగ్యశ్రీ బిల్స్‌ నెలకు రూ.300 కోట్ల చొప్పున, రూ.4200 కోట్లు పెండింగ్‌. ఆరోగ్య ఆసరా కింద ఒక్క పైసా ఇవ్వడంలేదు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు చేతులు ఎత్తివేశాయి.  ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలు, ఇ- క్రాప్‌ నిర్వీర్యం. నాడు-నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు మూసేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది?. రెండేళ్లపాటు కోవిడ్‌ ఉన్నా.. మనం ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించాం.

..ఐదేళ్లలో మనం చేసిన అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52 శాతం వెళ్లాడు. ఏ పథకం లేదు. ఏ స్కీమూ లేదు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్‌ పర్యటన. పోర్టులు, హార్బర్లు కట్టాం, స్కూళ్లు బాగుచేశాం, ఆర్బీకేలువ కట్టాం, సచివాలయాలు కట్టాలం, విలేజ్‌ క్లినిక్స్‌ కట్టాం, మెడికల్‌ కాలేజీలు కట్టాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు, అంతా దోచుకుంటున్నారు. దేశం ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, రాష్ట్రం ఆదాయాలు 3శాతంకూడా పెరగడంలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు ఆయన జేబులోకి పోతున్నాయి.

..పార్టీ తరఫున త్వరలో యాప్‌ విడుదలచేస్తాం.  ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చు. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు. ఆ ఆధారాలన్నీకూడా అప్‌లోడ్‌ చేయొచ్చు. ఆ కంప్లైంట్‌ ఆటోమేటిగ్‌గా మన డిజిటల్‌ సర్వర్లోకి వచ్చేస్తోంది.  మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.

..ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం. చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది. రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో.. కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మండలాల్లో కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. 90 నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలోకూడా ప్రారంభమై ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం ఉద్ధృతంగా చేయాలి. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలి

..పీఏసీ సభ్యులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలి. పీఏసీ సభ్యులంతా సీనియర్‌ లీడర్లు. మీ అనుభవాన్ని పార్టీ కార్యక్రమాలకు జోడించాలి. పార్టీని క్రియాశీలంగా నడిపే బాధ్యతను తీసుకోవాలి. గ్రామ స్థాయిలో మనం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రచ్చబండ కార్యక్రం ద్వారా కమిటీల ఏర్పాటు కూడా ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని నాయకులంతా పర్యవేక్షణ పరిశీలన చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తా పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి రావాలి. బాబుష్యూరిటీ, మోసం గ్యారంటీ కింద గ్రామస్థాయిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం చాలా పగడ్బందీగా జరగాలి.

..ప్రతి గ్రామంలోనూ జరగాలి, అక్కడే గ్రామ కమిటీల నిర్మాణం జరగాలి. ఇది కచ్చితంగా నూటుకు నూరుశాతం జరగాలి. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోంది. ఇస్తానన్న బిర్యానీ లేదు. ఉన్న పలావూ పోయింది. అందుకే మన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పీఏసీ సభ్యులంతా భాగస్వాములు కావాలి. పీఏసీ సభ్యులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పెద్దరికంతో కలుపుగోలుగా ఉండాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకోవాలి. అందరం ఐక్యతతో పనిచేయాలి.

..పార్టీ పరంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. పార్టీకోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తుంది. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశం. గ్రామ కమిటీలు అయ్యాక బూత్‌ కమిటీలు వేయాలి. ఈసారి కార్యకర్తలకు పెద్దపీట. మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా, అండగా ఉంటాం. కోవిడ్‌ కారణంగా ఆశించినంతగా మనం వారికి చేయలేకపోయాం. రెండేళ్లపాటు కోవిడ్‌ సంక్షోభంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వందేళ్లకు ఒకసారి వచ్చే కోవిడ్‌ లాంటి మహమ్మారిని చాలా ప్రభావంతంగా హేండిల్‌ చేశాం. ప్రజలను బాగా ఆదుకున్నాం.

..కార్యకర్తల విషయంలో గతంలోలా కాదు. కచ్చితంగా వారికి పెద్ద పీట ఉంటుంది. ప్రస్తుతం గ్రామ కమిటీల మీద దృష్టిపెట్టాలి. తర్వాత బూత్‌కమిటీల మీద దృషిపెట్టాలి. ప్రతి గ్రామంలోనూ సోషల్‌మీడియా ఉండాలి. అలాగే గ్రామాల వారీగా అనుబంధ విభాగాలు ఉండాలి. కమిటీల ఏర్పాటు వల్ల క్రియాశీలక కార్యకర్తలను చైతన్యం చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు, పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటారు. పార్టీ కమిటీల్లో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

వైఎస్‌ జగన్‌ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన
వైఎస్‌ జగన్‌ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని పీఏసీ సభ్యులు తెలిపారు. ‘‘మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వైయస్‌.జగన్‌ భద్రతపై సమస్యలు సృష్టిస్తోంది. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రత విషయంలో ఉపేక్షించడం కరెక్టు కాదు. మీ భద్రత విషయంలో కొత్త కొత్త వార్లు వింటున్నాం. మా అందరికీ చాలా ఆందోళన కరంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఇందులో రాజీ వద్దని పీఏసీ సభ్యులు.. జగన్‌కు సూచించారు. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం కావాలనే రాజీ పడిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement