
ముసురులో వేడివేడిగా.. ముచ్చటైన ఆహారం తినాలని ఎవరికి ఉండదు.. అలాంటి ఆహారాల్లో చెప్పుకోదగినది.. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులతో సిద్ధం చేసుకోగలిగినది ఏదైనా ఉందంటే.. అది కిచిడీ ఒక్కటే.. అంతేకాదు.. నగరంలో అనేక మందికి ఇది అభిమాన బేక్ర్‌ఫాస్ట్ డిష్ కూడా. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ దేశీ వంటకం ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విభిన్న రకాల కూరగాయలు, దినుసుల మేళవింపుతో అనేక పోషక విలువలు దీని సొంతమని ఆహార నిపుణులు చెబుతోన్న మాట..
శుభ్రత, ఆరోగ్యం, రుచిని కలగలిపే భారతీయ వంటకం కిచిడీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ నప్పే, నచ్చే వంటకంగా చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మన దేశపు ‘సూపర్ ఫుడ్’గా కూడా ఇది గుర్తింపు పొందుతోంది. భారత్ నుంచి ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలో బిర్యానీ, పంజాబీ కడీ, దోస, రాజ్మా చావల్ తరహాలో కిచిడీ కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన రోజువారీ ఆహారంలో కిచిడీని భాగం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సినీ సెలబ్రిటీలు కరణ్ జోహార్, తమన్నా భాటియా, మంధిరా బేడీ, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ వంటి ప్రముఖులు కూడా కిచిడీ లవర్స్‌గా తమను తాము చెప్పుకుంటున్నారు.
ఆరోగ్యానికీ మేలు..
మనలో చాలా మందికి చిన్నప్పటి జ్ఞాపకాలలో కిచిడీ రుచులు తప్పకుండా ఉంటాయి. అరుగుదల సులభం అనే ఆలోచనతోనే కిచిడీకి అంత క్రేజ్ వచ్చిందనేది నిస్సందేహం. రుచిగా ఉండటమే కాదు, దీనిని ప్రత్యేకంగా వండే శైలి కారణంగా తేలికగా జీర్ణం కాగలదు. ఇది కొన్ని వెరైటీల్లో ఎక్కువగా ముద్దలాగా తయారవుతుంది. కొన్ని రకాల్లో ఘన పదార్థంలా ఉంటుంది.
అయినా ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది. వర్షం, ముసురు పట్టిన రోజుల్లో లేదా అనారోగ్య సమయంలో తినడానికి శ్రేష్ఠమైన ఆహారం. కిచిడీ సులభంగా జీర్ణమవుతుంది. అనేక విధాలుగా తయారు చేయొచ్చు. ప్రతి ఒక్కరికీ సరిపోయే ఆహారం ఇది అంటున్నారు సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్.
ప్రొటీన్లు, విటమిన్లు అధికం..
దీనిలో ఉండే మసాలాలు, మినపప్పు, బియ్యం వంటి పదార్థాల వల్ల ఇది శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందిస్తుంది. తేలికగా జీర్ణం కావడం మాత్రమే కాదు.. ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచే ఆహారం కూడా. బియ్యంలో కలిపే ‘ హింగు (ఇంగువ), మిరియాలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి వంటి మసాలాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.
ఇటీవలే ఓ ప్రదర్శనలో చెఫ్ శివజిత్ సూరి మూంగ్ దాల్, మష్రూమ్స్, ట్రఫుల్ నూనె, గ్రీన్ బీన్స్ వంటి పదార్థాలతో కిచిడీ అంతర్జాతీయ ఫ్లేవర్ తీసుకొచ్చి ఆహార ప్రియుల్ని ఆకట్టుకున్నారు. వీటితోపాటు సాబూదాన్, వెజిటబుల్స్, చిరుధాన్యాలతో చేసే కిచిడీ వెరైటీల రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
నగరంలో ఎక్కడెక్కడ?
ఈ కిచిడీ ప్రియుల కోసం నగరంలో పలు రెస్టారెంట్స్ వెరైటీ డిష్‌లను అందిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లలోని ఈట్ ఫిట్ రెస్టారెంట్‌లోని గ్రేట్ ఇండియన్ కిచిడీ, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లలో ఉన్న అంతేరా కిచెన్, ఎమ్‌ఓఏఐ, కృష్ణపట్నం, మోడ్రన్/కాంటినెంటల్ వంటలతో కూడిన రెస్టారెంట్లలోని కిచిడీలు మంచి రేటింగ్స్ పొందాయి. అలాగే అమీర్‌పేట్‌లోని హబీబో అందించే దాల్ కిచిడీ, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీలలో ఉన్న డైలీ రిచ్యువల్స్, టెర్రాయ్ అండ్ నియో తెలంగాణ కిచెన్, రెడ్ రినో, హోటల్ నయాబ్, టోలిచౌకిలోని హోటల్ రుమాన్, షాగౌస్‌లు అందించే కిచిడీ ఖీమా అండ్ కట్టా వంటివి కిచిడీ వంటకాలకు పేరొందాయి.
(చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్‌గా మెరుద్దాం ఇలా..!)