
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భద్రతపై వైఎస్సార్‌సీపీ పార్టీ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో పోలీసులు-ప్రభుత్వం రాజీ పడ్డాయనే విషయం స్పష్టమైందని.. ఇక మీదట ఇలాంటి పరిణామాలను ఉపేక్షించడం సరికాదని పలువురు సభ్యులు ఆయనతో అన్నారు.
మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు జగన్ భద్రత అంశాన్ని లేవనెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందన్న పీఏసీ సభ్యులు.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
‘‘మీ ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మీ పర్యటనలకు సమస్యలు సృష్టిస్తోంది. ఈ విషయంలో మా అందరికీ చాలా ఆందోళనకరంగా ఉంది. మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. కాబట్టి భద్రత విషయంలో ఇక మీరు ఉపేక్షించడం కరెక్టు కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు’’ అని వైఎస్ జగన్‌కు పీఏసీ సభ్యులు పలువురు సూచించారు.
