
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గొర్రెల పంపిణీ, పెంపకం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పని చేసిన జి కళ్యాణ్‌ను ఈడీ ఆఫీస్‌కు తీసుకొచ్చి అధికారులు విచారిస్తున్నారు.
సోమవారం ఉదయం నగరంలో ఈడీ సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. పశుసంవర్థకశాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ నివాసంతో పాటు మరో తొమ్మిది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఈక్రముద్దీన్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
గొర్రెల పెంపకం, పంపిణీ పేరుతో తెలంగాణలో భారీ స్కాం జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుర్తించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరు మీద సుమారు రూ.750 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారించుకుంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారుల్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.