
తప్పులెన్నువారు తండోపతండంబు.. అనే ఓ వేమన పద్యం ఉంది. దాని తాత్పర్యం ఏంటంటే.. ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరని. అలాంటి బాపతు ఓ అధికారికి అనుకోని నిరసన ఎదురైతే.. దెబ్బకు గుంజీలు తీయాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐఏఎస్ రింకు సింగ్ రాహీకి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌గా ఆయన అందరి ముందు గుంజీలు తీసి చెంపలు వేసుకుని క్షమాపణలు వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు.
సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ హోదాలో తొలిరోజే ఆయన తహసీల్దార్ కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది అక్కడ బహిరంగ మూత్రవిసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో వాళ్లను పిలిపించుకున్న ఆయన గుంజీలు తీయించాడు. టాయిలెట్లు వాడమని అక్కడ సూచన బోర్డులు ఉన్నప్పటికీ.. కొంతమంది ఇలా బహిరంగ విసర్జనకే మళ్లుతున్నారని, అందుకే శిక్షగా గుంజీలు తీయించామని ఆయన మీడియాతో చెబుతూ కనిపించాడు. అంతేకాదు.. కొంత మంది పిల్లలు బడి ఎగ్గొట్టి ఆ కాంపౌండ్‌లో తిరుగుతున్నారని.. బాధ్యతగా లేని వాళ్ల తల్లిదండ్రులకు ఇదే తరహా శిక్ష తప్పదని హెచ్చరించారాయన. అయితే ఈలోపు..
తహసీల్దార్ వద్ద ఉన్న కొంత మంది లాయర్లు ఇదంతా గమనించారు. గుంజీలు తీసిన వాళ్లలో తమకు చెందిన క్లర్క్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్డీఎం రింకు సింగ్‌ను నిలదీశారు. దానికి ఆయన సమాధానం ఇవ్వగా.. అక్కడి టాయిలెట్‌లు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని, పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మీరూ గుంజీలు తీస్తారా? అని నిలదీస్తూ ఆ లాయర్లు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో..
ఏం పాలుపోనీ ఆయన ‘అవును’ అంటూ చెంపలేసుకుంటూ ఆయన గుంజీలు తీస్తూ క్షమాపణలు చెప్పారు. దీంతో ఆ లాయర్లు శాంతించి నిరసన విరమించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయిందని, టాయిలెట్‌లు పాడైపోయిన స్థితిలో ఉన్నాయనే విషయాన్ని ఓ అధికారి 10రోజుల కిందటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడట. అయినా ఆ ప్రాంగణమంతా శుభ్రం కాకపోవడం తమ తప్పిదమేనంటూ ఆ ఐఏఎస్ పేర్కొన్నారు. తాను చేసిన పనికి నామోషీగా భావించడం లేదని అంటున్నారాయన.
‘Our fault, I accept it’: On Day 1 of posting, #UP SDM Rinku Singh Rahi does sit-ups in front of advocates; takes responsibility for tehsil filth
More details 🔗 https://t.co/7Bm3up0dPp#UttarPradesh pic.twitter.com/Nuglfm9rQK— The Times Of India (@timesofindia) July 30, 2025