
రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలిసిందే. అందులోనూ పదవీ, అధికారం చేతిలో ఉంటే..వాళ్లు ప్రవర్తించే తీరే వేరెలెవెల్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ ఎంపీగారు మాత్రం ప్రజలతో మమేకమయ్యేలా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అపి విమర్శలు కురిపించగా కొందరు మాత్రం గ్రామీణ జీవన విధానంతో కనెక్ట్ అయ్యే తీరు ఇదేనని, ప్రజలకు చేరువవ్వాలంటే ఇలానే చేయాలంటూ ఆ మహిళా ఎంపీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరంటే..
ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, భారత క్రికెటర్ రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ రైతు మాదిరిగా స్వయంగా పొలంలో వరి నాట్లు నాటుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోని ఎంపి ప్రియా తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో జౌన్‌పూర్‌లోని మచ్లిషహర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్, పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలతో కలిసి ఆమె కూడా వరి నాట్లు వేస్తూ బిజీగా కనిపించారు.
నిజానికి ఆమె వారణాసిలోని పింద్రా తహసీల్ ప్రాంతంలోని కార్ఖియాన్‌లో నివసిస్తున్నారు. అయితే ఆదివారం వాతావరణం చాలా బాగుండటంతో తన గ్రామం వైపుగా వాకింగ్‌కి వెళ్తూ..అటుగా తన పొలానికి కూడా వెళ్లారు. అక్కడ పొలంలో పనిచేస్తునన్న ఇతర మహిళలు, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా వరి నాటారు. ఏదో తూతూ మంత్రంగా చేసినట్లుగా కాకుండా సుమారు ఐదు ఎకరాల భూమిలో ఆమె స్వయంగా పనిచేశారు.
అది ఒక రకంగా శ్రామిక జీవుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని తేటతెల్లం చేయడమే గాక ప్రజలకు మరింతగా చేరువయ్యేలా చేసింది. అంతేగాదు ఆ వీడియోని చూసిన ప్రజలు ఆమెను “జమీన్ కీ బేటీ” అని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా రైతే. ఆమె కుటుంబానికి వ్యవసాయంతో చాలా అవినాభావ సంబంధం ఉంది.
అందువల్ల ఆమెకు పొలంలో పనిచేయడం ఏమి కొత్త కాదని చెబుతున్నారు స్థానిక ప్రజలు. కాగా, ప్రియా రైతు మాదిరిగా వరి నాట్లు వేయడమే గాక రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యల గురించి కూడా విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం.
समाजवादी पार्टी की सांसद एवं रिंकू सिंह की होने वाली पत्नी की सादगी तो देखो
मजदूरों के साथ धान लगवा रही हैं pic.twitter.com/70WBXfFbYJ— Bhanu Nand (@BhanuNand) July 20, 2025
(చదవండి: ఫీల్ యువర్ ఫీలింగ్.. ఆర్ట్ ఆఫ్ హీల్.. ! వ్యాధులను నయం చేయడంలో..)