అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ‘పీస్’ ప్రైజ్ వరించిందనే వార్త ప్రపంచాన్ని అయోమయంతో కూడిన ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ట్రంప్ ఆనందానికి అవధులు, ఆనకట్టలు, డ్యామ్‌లు, కాలువలు లేవు.
‘ఈసారి కచ్చితంగా నాకే’ అని గన్‌షాట్ ఆశ పెట్టుకున్న ట్రంప్‌ను గతంలో ఎస్నో సార్లు ‘పీస్’ ప్రైజ్ వెక్కిరిస్తూ వచ్చింది.
పరాభవానికి గురైన ట్రంప్ ‘శాంతి’ బహుమతిపై అశాంతి, కసి, కోపం, పగ, ప్రతీకారం, రివేంజ్.. ఇలాంటివి ఎన్నో పెట్టుకున్నాడు. అంతేకాదు...‘పి’తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం మానేశాడు. ‘పి’తో మొదలయ్యే వంటకాలను తినడం మానేశాడు.‘పి’తో మొదలయ్యే డ్రింక్స్ తాగడం మానేశాడు.
అలాంటి ట్రంప్‌ను ‘పీస్’ ప్రైజ్ వరించడంతో... ఆ ప్రైజ్‌పై అతడికి అభిమానం, అనురాగం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ, మమత, సమత... ఇలాంటి భావాలెన్నో కలిగాయి. ఆ ఆనంద కిక్‌లో వైట్‌హౌజ్‌లో ప్రెస్‌మీట్ పెట్టాడు.
‘అరచేయి అడ్డుపెట్టి అప్పడం కాలకుండా చేయగలరా? నో... నెవర్! పీస్ ప్రైజ్ నాకు రావడం కూడా అలాంటిదే. ఈ శుభ సందర్భంగా ప్రపంచశాంతిని ఆశిస్తూ ఒక పాట పాడుతాను’ అని గొంతు సవరించాడు ట్రంప్. ఆ పాట వినడానికి సభాసదుల చెవుల వైశాల్యం రెట్టింపు అయ్యింది. ‘నేను విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ’ అని పాడడం ప్రారంభించాడు శ్రీ ట్రంప్.
‘సోడా బుడ్డికి ప్రపంచ శాంతికి సంబంధం ఏమిటి?’ అని అడగబోయిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక విలేఖరికి వెజెజువెలా ప్రెసిడెంట్ గుర్తుకు వచ్చాడు. ‘అంత పెద్ద ప్రెసిడెంట్‌నే మాయం చేసిన వాడికి నేనొక లెక్కా’ అని జాగ్రత్తగా లెక్కలు వేసుకొని నీట్‌గా రూట్ మార్చాడు.
చదవండి: చుక్కల్లో పసిడి ధరలు.. చదివింపుల గుబులు
‘మీరు పాడిన పాట ఏ భాషదో తెలియదుగానీ... ఎంత అద్భుతంగా పాడారు సర్!’ అని మెలికలు తిరిగిపోయాడు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అని చెప్పిన ట్రంప్‌కు తన పాట ఎంత బ్లడ్‌పాతం సృష్టించిందో తెలియదు. దీనికి సాక్ష్యం... వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి చెవిలోని నుంచి ఆగకుండా కారుతున్న రక్తం!!!!
కసి మెరుపు:
ఇంతకీ... ట్రంప్‌కు ‘పీస్’ ప్రైజ్ ప్రకటించింది నోబెల్ కమిటీ కాదు.
‘హారిబుల్’ కమిటీ! అర్జెంటీనాలోని ఫాక్స్‌నక్కపాలెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కమిటీ... మూర్ఖత్వం, అహం మూర్తీభవించిన ప్రతిభా‘వాంతు’లకు ప్రతి యేటా ‘పీస్’ ప్రైజ్ ప్రకటిస్తుంది. ఇంతకీ... ఈ ‘పీస్’ ప్రైజ్‌లో శాంతి పిసరంత కూడా ఉండదు.
– యాకుబ్ భాష
ఇంతకీ... వీరి ‘పీస్’ ఫుల్‌ఫామ్...
‘పి’ ఫర్ పెయిన్–మేకర్: బాధలు తయారుచేసే వ్యక్తి
‘ఇ’ ఫర్ ఎంప్టీ హెడ్: ఖాళీ బుర్ర
‘ఎ’ ఫర్ ఆరగెంట్: గర్వం మూర్తిభవించిన వ్యక్తి
‘సి’ ఫర్ క్రేజీ: తెలివితక్కువ–సెన్స్‌లెస్‌కు ఎక్కువ
‘ఇ’ ఫర్ ఇగోయిస్టిక్: అహంకారి


