
ఇటీవలి కాలంలో మన హైదరాబాద్‌తో పాటు మెట్రో నగరాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆందోళన, ఒత్తిడి, శారీరక ఆలసట, మానసిక భావోద్వేగాలను నియంత్రించే శక్తి కళలకు ఉందనేది వాస్తవం.. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఓ మంచి పాట వినబడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది.. కొందరికి ప్రకృతిని చూస్తే, మరికొందరికి ఆర్ట్‌ని చూసినా.. బొమ్మలు వేసినా మనసుకు హాయినిస్తాయి.. దీనికి ఇవే ఉదాహరణ.. మనలోని కనిపించని భావాలు.. కళలకు స్పందిస్తాయి.. సాంత్వన చేకూరుస్తాయి. దీంతో గత కొద్దికాలంగా నగరంలో ‘హీలింగ్ థెరపీలు’ విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ఈ చికిత్సా పద్ధతుల్లో ఆర్ట్ ఆఫ్ హీలింగ్ థెరపీలకు ప్రత్యేక స్థానం ఉంది. మానసిక ప్రశాంతతను కోరుకునే యువత, కార్పొరేట్ ఉద్యోగులు ఈ సృజనాత్మక మెడిటేషన్ వేదికగా సాంత్వన పొందుతున్నారు..
ప్రస్తుతం నగరంలో ఏ రంగం చూసినా విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ వైవిధ్యంతో పాటే అనేక మానసిక, సామాజిక ఒత్తిళ్లను నగరవాసులకు చేరువ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి బయటపడటానికి ఆర్ట్ హీలింగ్ థెరపీలను జీవన శైలిలో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగర వేదికగా విభిన్న రకాల హీలింగ్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్ట్ థెరపీల్లో మ్యూజిక్ థెరపీ, డాన్స్ మూవ్‌మెంట్ థెరపీ, సౌండ్ బౌల్ హీలింగ్, యోగా–శ్వాస పరమైన ధ్యాన చికిత్స, రేయికి– ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ (ఈ ఎఫ్ టీ), క్లే మోడలింగ్/పోటరీ థెరపీ, ఎక్సŠప్రెషన్ జర్నలింగ్/రైటింగ్ థెరపీ వంటివి ఈ తరం లైఫ్‌స్టైల్‌లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ థెరపీలన్నీ మెడిటేటివ్ ఎఫెక్ట్ కలిగించేలా ఉండి, మానసిక ఒత్తిడి, ఆత్మవిమర్శ, ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వారికి సాంత్వన చేకూరుస్తూ, మనశ్శాంతిని అందిస్తున్నాయి.
మానసిక స్పందనలు తెలిపే భాష..
ఆర్ట్ హీలింగ్ థెరపీ ఒక మందు కాదు – అది ఓ మనో విశ్రాంతి పాఠశాల. భిన్న రంగాల వేదికైన హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ థెరపీలు సమాజాన్ని మనశ్శాంతి వైపు నడిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆర్ట్ థెరపీ అనేది వినూత్నంగా, వైవిధ్యంగా మనసుపై ప్రభావం చూపించే ఒక మానసిక చికిత్స.
చిత్రకళ అనేది రంగుల సమ్మేళనం, మట్టి శిల్పాల తయారీ, మాస్క్ మేకింగ్, కలర్ థెరపీ లాంటి అంశాల ద్వారా వ్యక్తి భావోద్వేగాలను బయటకు తీసే ఒక మృదు స్పర్శా విధానం. ఇది శాస్త్రీయ వైద్యం కాదు, కేవలం మెదడుపై సున్నిత ప్రభావాన్ని చూపిస్తూ మౌనంగా స్పందనలు తెలిపే ఓ భాష మాత్రమే.
సాంత్వనకు కేంద్రంగా సిటీ..
నగరంలోని కన్హ శాంతి వనం హార్ట్‌ఫుల్ నెస్ సెంటర్లో ఆర్ట్ – ధ్యానం కలిసిన హోలిస్టిక్ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ లైసెన్స్‌డ్ ఆర్ట్ థెరపిస్టుల సహాయంతో సరికొత్త థెరపీలు అందించే వేదికలు ఎన్నో ఉన్నాయి.
కొన్ని క్లే (మట్టి), పెయింటింగ్ ఆధారిత వర్క్‌షాపులు నిర్తహిస్తుంటే ఆర్ట్ ఫర్ థెరపీ ఫౌండేషన్ వంటి వేదికలు పిల్లలు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కల్పతరు ఆర్ట్ హీలింగ్ వంటి సంస్థలు మునుపటి ట్రామాలను చక్కదిద్దేందుకు క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ వంటి పద్ధతులు పాటిస్తున్నారు.
జెన్ జీ హీలింగ్...
ఇలాంటి థెరపీలను ఈ తరం యువతకు అనువుగా మలుస్తున్నాయి సంస్థలు. ఈ జెన్ జీ తరంలో డిజిటల్ లోన్లీ నెస్, ఒత్తిడి పెంచే విద్యావ్యవస్థ, వర్క్–లైఫ్ ఇంబ్యాలెన్స్, ఎమోషనల్ అన్‌ఎక్స్‌ప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ హీలింగ్ థెరపిస్ట్ తెలిపారు. ఈ తరం శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతోంది.
ప్రభావం చూపే మాటలకంటే రంగులు, ఆకారాలు, కళల సృజనాత్మకతతో కలగలిసిన ప్రయాణంతో మనసు తన బాధను చెప్పే అవకాశం పొందుతోంది. ఇలాంటి కారణాలతో ఈ ఆర్ట్ థెరపీల అవసరం ఎక్కువైందని మరి కొందరి నిపుణుల అభిప్రాయం.
అవస్థలు ఎన్నో.. మార్గం ఒకటే..!!
డిప్రెషన్(నిరాశ), ఆందోళన (యాంగ్జైటీ) బాధితులు, పిల్లల్లో స్పీచ్/బిహేవియరల్ సమస్యలు ఉన్నవారు, ట్రామా/లాస్/బ్రేకప్ నుంచి కోలుకునేవారు, ఏకాంత జీవితం గడుపుతున్న వృద్ధులు, క్రియేటివ్ బ్లాక్ ఎదుర్కొంటున్న కళాకారులకు ఈ ఆర్ట్ థెరపీలు వరంగా మారుతున్నాయి.