
త్రేతాయుగంలో సతీ సుమతీ అనే మహా పతివ్రత గురించి వినే ఉంటారు. సుమతీ భర్త కౌశికుడు. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య సుమతీ అంత శాంతమూర్తి. కౌశికుడు కుష్టురోగంతో బాధపడుతున్నప్పటికీ, సుమతీ అతనిని విడవకుండా సేవ చేస్తుంది. ఒకానొక సందర్భంలో.. ఆమె భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్తుండగా.. మాండవ్య ముని శాపం వల్ల సూర్యోదయానికి ముందే అతని శరీరం వెయ్యి ముక్కలుగా మారుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు సుమతీ తన పతివ్రత్య శక్తితో సూర్యోదయాన్ని ఆపివేస్తుంది. తద్వారా భర్త ప్రాణాలు కాపాడుతుంది. చివరికి దేవతలు ఆమెను అభ్యర్థించి, కౌశికుడిని ఆరోగ్యవంతుడిగా చేస్తారు. ఆ సతీ సుమతీది త్రేతాయుగం అయితే మనం చెప్పుకోబోయే ఈ సతీ సుమతిది కలియుగం.
ఆమె భర్త దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠురోగంతో బాధపడుతున్న అతనిని చూసి, నేటి సుమతీ చేస్తున్న సేవలు, చూపిస్తున్న నిబద్ధత అంతా ఇంతా కాదు. ప్రస్తుతం భర్తను వీపుమీద మోసుకుంటూ వెళ్తున్న ఫొటోల్ని చూస్తున్న నెటిజన్లు.. ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా..ఆ మహాసాధ్వి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు
ఘజియాబాద్‌లోని మోడీనగర్‌లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు.
ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది.
అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్‌యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి.
నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్‌కారు..! ఇప్పటికీ..)