
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న నానుడి జగమెరిగిన సత్యం. ఎప్పటికీ పాతకాలం నాటి డిజైన్‌లు, నాటి వస్తువులు అపురూపమే. ఎంతటి ఆధునిక సాంకేతిక హంగులతో వచ్చినా..ఏళ్ల నాటి వస్తువులే అదరహో అన్న రేంజ్‌లో ఉంటాయి. వాటి పనితీరు కూడా వాహ్ అని మెచ్చుకునేలా ఉంటుంది. అలాంటి పాతకాలం నాటి మెర్సిడెస్ బెంజ్ కారుకి సంబంధించిన వీడియో నెట్టింట పెను దుమారం రేపుతోంది. దాని రూపురేఖలు, పనితీరు చూసి ఫిదా అవ్వాల్సిందే. అంతలా చెక్ చెదరకుండా ఉంది ఆ బెంజ్ కారు.
ఇషాన్ బల్లాల్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ 58 ఏళ్ల క్రితం నాటి ఓల్డ్ బెంజ్ కారు వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఆ కారు 1967 నాటిది. తన తాతగారు ఉపయోగించేవారని చెప్పుకొచ్చాడు వీడియోలో. ఆయన ఆ కారు డ్రైవింగ్ సీటులో కూర్చొని కబుర్లు చెబుతూ తనను టూర్లకు తీసుకువెళ్లేవారని నాటి స్మృతులను గుర్తు చేసుకున్నాడు.
మంగళూరు నుంచి చెన్నే వెళ్తూ ఆయన నాకు చెప్పే పలు కథలు ఆ బెంజ్ కారుని చూడగానే గుర్తుకొస్తాయని చెబుతున్నాడు ఇషాన్. తాను డ్రైవింగ్ లైసెన్స్ పొందినా కూడా డ్రైవర్ పర్యవేక్షణ లేకండా ఆ బెంజ్ కారుని నడపలేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే కాస్త తప్పుగా నడిపినా..ఆ కారు పాడవ్వుతుందన్న ఉద్దేశ్యంతో తాను పూర్తిస్థాయిలో నడపగలిగిన అనుభవం వచ్చాక నడిపానని అన్నాడు.
తన దివంగత తాతాగారి కారుని తాను ఎలా భద్రంగా చూసుకున్నాడో వివరించాడు. అందువల్లే ఆ 58 ఏళ్ల నాటి బెంజ్ కారు ఇప్పటికీ మంచి కండిషన్‌లో పనిచేస్తుందని చెబుతున్నాడు ఇషాన్. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి...మీ తాత గారు ఆ కారుని ఎంత అపురూపంగా చూసుకున్నారో స్పష్టమవుతుంది. బహుశా ఆ తీరే వంశపారంపర్యంగా మీకు వచ్చిందేమో. తాతాగారు ఎంత మంచి వారసత్వాన్ని మీకందించారంటూ ఇషాన్‌పై పొగడ్తల జల్లు కురిపించారు.
(చదవండి: జస్ట్ పెంపుడు కుక్కల సంరక్షణతో.. నెలకు ఏకంగా రూ. 4 లక్షలు పైనే..)