
ముంబై: అది ఇండిగో విమానం.. ముంబై నుంచి వారణాసి వెళ్లాల్సిన ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ మధ్యలో చోటు చేసుకున్న రభస అంతా ఇంతా కాదు. సీట్లలో కూర్చొన్న ప్రయాణికలు ఒక్కొక్కరిగా తమ నిరసనను ఉధృతం చేశారు. తొలుత కొంత ఓపిక పట్టిన ప్రయాణికులు.. ఆపై తమ సహనం కోల్పోయారు.
విమానం ఎప్పుడు బయల్దేరుతుందో చెప్పాలంటూ విమాన సిబ్బందిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే విమానం లోపల ఉన్న ఎయిర్ హోస్టస్ వద్ద కచ్చితమైన సమాధానం లేకపోవడంతో ప్రయాణికుల్ని బ్రతిమాలుకున్నారు.
ప్లీజ్.. మీకు చేతులెత్తి దండం పెడతా.. దయచేసి ఎవరి సీట్లలో వారు కూర్చోండి’ అంటూ ఒక ఎయిర్ హోస్టెస్ ఓ ప్రయాణికుడ్ని బ్రతిమాలుతున్న వీడియో వైరల్‌గా మారింది. విమానంలోని ఈ రగడ జరిగే సమయంలో ఎవరో వీడియో తీసి పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారింది. ఇదంతా శనివారం(జూలై 26) రాత్రి ముంబై నుంచి వారణాసి బయల్దేరే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి గం. 9. 45 ని.లకు బయల్దేరాల్సిన విమానం.. టేకాఫ్ కావడానికి సుమారు రెండు గంటలు ఆలస్యమైంది. ఆ విమానం రాత్రి గం. 11.40 ని.లకు టేకాఫ్ అయ్యింది.