
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.
ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్‌మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది.
అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది.