మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా? | Parenting Tips: Darshan Fans Trigger Actor MP Ramya | Sakshi
Sakshi News home page

మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?

Jul 30 2025 8:19 AM | Updated on Jul 30 2025 8:26 AM

Parenting Tips: Darshan Fans Trigger Actor MP Ramya

సినీ అభిమానం వెర్రితలలు వేసి భవిష్యత్తు నాశనం చేసుకునే విధంగాటీనేజ్‌ పిల్లలు తయారవుతున్నారా? కర్నాటకలో ఇలాగే జరుగుతోంది.అక్కడ హీరో దర్శన్‌ అభిమానులు తనపై అత్యాచారం చేస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని నటి రమ్య కేసు పెట్టారు. గతంలో దర్శన్‌ అభిమాని రేణుకా స్వామి ఇలాంటి మెసేజ్‌లే పెట్టి హత్యకు గురయ్యాడు. ఆ కేసులో దర్శన్‌ నిందితుడు. ఈ నేపథ్యంలో అతడికి బెయిలు మంజూరు అవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రమ్య సుప్రీంకోర్టును మెచ్చుకుంటూ ట్వీట్‌ చేసింది.దాంతో ఆమెను చంపుతామని అభిమానులు బయలుదేరారు. చదువు, ఉద్యోగాల్లో ఉండాల్సిన యువత ఇలాంటి పనుల్లో ఉంటే సరిదిద్దుతున్నామా?

ఇంట్లో ఉన్న పిల్లలు బయట ఏ అస్తిత్వంతో ఉన్నారో తల్లిదండ్రులు చెక్‌ చేసుకుంటున్నారా? వారు ఫలానా తల్లిదండ్రుల పిల్లలు అనో, కాలేజీ పిల్లలు అనో, ఏరియా పిల్లలు అనో గుర్తింపు పొందుతున్నారా? లేదా ఫలానా హీరో ఫ్యాన్స్‌ అనో, రాజకీయ పార్టీ అభిమానులనో, వాట్సాప్‌ గ్రూప్‌కు సంబంధించిన యాక్టివ్‌ మెంబర్లనో అందరికీ తెలుస్తున్నారా?

హైస్కూల్, కాలేజీ వయసు దాటాక ఇటీవల ఉద్యోగాల్లో చేరాక కూడా మెచ్యూరిటీ లేని విధంగా కేవలం ‘ఫ్యాన్స్‌’గా ఉంటూ సొంత/దొంగ ఐడీలతో దాడి చేసే కుసంస్కారంతో ఉంటే గనక వీరి భవిష్యత్తు ఏమవుతుందో... అనే బాధ తల్లిదండ్రులకు ఉండటం చాలా సహజం. పత్రికల్లో కనిపిస్తున్న రోజువారీ ఘటనలు ‘వెర్రి అభిమానం’ వల్ల ప్రమాదం తెచ్చుకుంటున్న యువతను చూపెడుతున్నాయి. ఇంకానా ఇకపైనైనా మారండి అని హెచ్చరిస్తున్నాయి.

దర్శన్‌ అభిమానులు ఏం చేశారు?
గత రెండు రోజులుగా కన్నడ హీరో దర్శన్‌ అభిమానులు అక్కడి నటి, మాజీ ఎం.పి. అయిన రమ్యను సోషల్‌ మీడియాలో తీవ్ర పదజాలంతో హింసిస్తున్నారు. ఆమెను చంపుతామని, రేప్‌ చేస్తామని ఇంకా రాయడానికి వీలుకాని భాషలో ఆమెకు క్షోభ కలిగిస్తున్నారు. దానికి కారణం ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్‌. 

దర్శన్‌కు గతంలో కర్నాటక హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దానిని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేస్తూనే కర్నాటక హైకోర్టు బెయిల్‌ ఎలా మంజూరు చేసిందనే విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా అసమంజసం అని చెప్పింది. ఈ విషయాన్నే ఉటంకిస్తూ రమ్య సోషల్‌ మీడియాలో ‘సుప్రీంకోర్టు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది’ అని రాసింది. అంటే దర్శన్‌ బెయిల్‌ మీద బయట తిరగడం సరి కాదు అని ఆమె ఉద్దేశం. దీంతో ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు.

దర్శన్‌ కేసు
దర్శన్‌ 2024 జూన్‌లో అరెస్ట్‌ అయ్యాడు. దీనికి కారణం చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకా స్వామి హత్యలో అతని ప్రమేయం ఉందనే అభియోగం. రేణుకా స్వామి కూడా ‘వెర్రి అభిమాని’గా ఉండి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. జరిగింది ఏమంటే దర్శన్‌కు, అతని భార్య విజయలక్ష్మికి కొంత కాలంగా సయోధ్య లేదు. అందుకు కారణం దర్శన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పవిత్ర గౌడ అని కొందరు అభిమానులు భావించారు. 

దర్శన్‌ అభిమాని అయిన రేణుకా స్వామి దర్శన్‌ జీవితంలో కలత రేపిన పవిత్ర గౌడను సోషల్‌ మీడియాలో అబ్యూజ్‌ చేయసాగాడు. అతని కామెంట్లు భరించలేని పవిత్ర ఈ సంగతిని దర్శన్‌ దృష్టికి తీసుకు రాగా అతను తన అభిమానులతో కలిసి రేణుకా స్వామిని హత్య చేయించాడని అభియోగం. ఈ కేసు విచారణలో ఉండగానే డిసెంబర్, 2024లో కర్నాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్‌ ఇచ్చింది. దానిని తాజాగా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అలా తప్పు పట్టడం సరైన విషయంగా రమ్య భావిస్తూ కామెంట్‌ చేసింది.

కేసుల్లో అభిమానులు
రమ్యను అశ్లీల మాటలు అంటూ నానా హంగామా చేసిన దర్శన్‌ అభిమానులపై రమ్య పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది. 47 ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను పోలీసుల దృష్టికి తెచ్చింది. ఇప్పుడా ఇన్‌స్టా హ్యాండిల్స్‌ ఏ అభిమానులైతే నడుపుతున్నారో వారంతా ప్రమాదంలో పడినట్టు. నేరం రుజువైతే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అభిమానం సినిమా చూసేంత వరకూ ఉండాలి కాని ఇలా నటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వారికి వత్తాసు పలుకుతూ తీవ్ర చర్యలు చేపట్టేంతగా మాత్రం ఉండకూడదు. 

ఈ బూతులు తిట్టిన అభిమాని ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఈ సంగతే తెలియకవచ్చు. రేపు అరెస్ట్‌ అయితే వారి పరిస్థితి ఏమిటి? రమ్యకు మద్దతుగా కన్నడ ఇండస్ట్రీ నిలబడింది. అంతే కాదు కర్నాటక మహిళా కమిషన్‌ సూమోటోగా కేసును తీసుకుని నిందితులను పట్టుకోమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఒక నటుడి వ్యక్తిగత జీవితంలో అనవసరంగా తల దూర్చడం వల్ల ఇప్పటికే ఒక అభిమాని హత్యకు గురయ్యాడు. ఇప్పుడీ కేసు వల్ల ఎందరు అభిమానులు నష్టపోతారో?! తల్లిదండ్రులూ బహుపరాక్‌. తెలుగు నాట కూడా ఇలాగే అభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి. ఫోన్‌ చేతిలో ఉంది కదా అని హద్దు మీరిన వ్యాఖ్యలు చేస్తే అవి నేరాభియోగానికి ఆధారాలవుతాయి. శిక్షకు సాక్ష్యాలవుతాయి. పిల్లల్ని హెచ్చరించండి. వారు ఏ వయసు వారైనా సరే. 

(చదవండి: ఆలోచనలతో కంప్యూటర్‌ని కంట్రోల్‌ చేస్తున్న తొలి మహిళ! ఏకంగా 20 ఏళ్లకు పైగా పక్షవాతం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement