
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్‌కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్‌ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్‌ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..
రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్‌ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్‌ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్‌లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్‌టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్‌ని కూడా పంచుకుంది.
దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్‌గా, కర్సర్‌గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్‌ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్‌తో చేస్తుంది.
ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్‌లో తొమ్మిదొ పేషెంట్‌గా ఈ చిప్‌ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్‌లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్‌ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది.
న్యూరాలింక్ అంటే..
2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్‌లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.
కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్‌లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.
(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)