
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే కదా ప్రపంచం మొత్తం మనవైపు తిరిగి చూసేది. మంచి గుర్తింపు వచ్చేది కూడా అలాంటప్పుడే. అలాంటి అనితర సాధ్యమైన ఘనతనే సాధించి శెభాష్ అనిపించుకుంది ఈ మంగళూరు అమ్మాయి. రోజు చేసే పనిని చేయడమే ఒక్కోసారి విసుగ్గా ఉంటుంది. అలాంటిది ఒక పనిని నిరంతరాయంగా చేయడం అంటే మాటలా..వామ్మో అనేస్తాం. కానీ ఈ అమ్మాయి మాత్రం అలుపు సలుపు లేకుండా సునాయాసంగా చేసేస్తోంది.
ఆ అమ్మాయే మంగళూరుకి చెందిన సెయింట్ అలోసియస్(డీమ్డ్ యూనివర్సిటీ)విద్యార్థిని రెమోనా ఎవెట్ పెరీరా(Remona Evette Pereira). బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఆమె జులై 21న రికార్డు బద్దలు కొట్టే నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. జులై 21 నుంచి జులై 28 వరకు అంటే మొత్తం ఏడు రోజులపాటు 170 గంటలు నిర్విరామంగా భరతనాట్యం చేసి అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఆమె ప్రదర్శనకు ఉరుములతో కూడిన చప్పట్లతో దద్దరిల్లింది స్టేడియం. ఇలా ఎక్కువ గంటలపాటు నిరంతరాయంగా నాట్యం చేసి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి కెక్కింది.
ప్రపంచవ్యాప్తంగా ఇలా నిరంతరాయంగా నాట్యాన్ని ప్రదర్శించిన తొలి వ్యక్తిగా కూడా ఘనత సాధించింది పెరీరా. ఆమె ప్రతి మూడు గంటలకు స్వల్ప విరామం తీసుకుంటూ..ఆగకుండా భరతనాట్యం చేసినట్లు ఆమె కళాశాల డైరెక్టర్ క్రిస్టోఫర్ డిసౌజా అన్నారు. ఇక పెరీరా మూడేళ్ల ప్రాయం నుంచే ప్రఖ్యాత గురువు విద్య మురళీధర్ ఆధ్వర్యంలో భరతనాట్యం శిక్షణ తీసుకుంది. అంతేగాదు 2019లో సోలో అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
ఈ ఘనత ఎలా సాధించిందంటే..
ఈ ప్రపంచ రికార్డు కోసం గత కొన్ని నెలలుగా భరతనాట్యంలో కఠోర సాధన చేస్తున్నట్లు పేర్కొంది పెరీరా. రోజుకు ఐదారు గంటలు నృత్య సాధనకే కేటాయించినట్లు తెలిపింది. ఏడు రోజుల పాటు నిరంతరాయంగా నృత్యం చేయడమంటే మాటలు కాదు. అయినా సాధించాలన్న పట్టుదలే తనను ముందుకు నడిపించిందని చెబుతోంది.
ఇక ఈ సుదీర్ఘ ప్రదర్శనలో భాగంగా ప్రతి మూడు గంటలకోసారి పావుగంట విరామం తీసుకొనేదాన్ని, అలాగే ఆ సమయంలోనే కునుకు కూడా తీసేదాన్ని అంటోంది. ఇక అరటిపండ్లు, పెరుగు, కొబ్బరి నీళ్లు, కొద్దిగా అన్నం.. ఇలా తేలికపాటి ఆహారంతో ఎనర్జీని పెంచుకునేదాన్ని అని చెబుతోంది.
అయితే ఈ ప్రపంచ రికార్డుని తన తల్లిదండ్రులు, టీచర్లు, ఫ్రెండ్స్ ప్రోత్సాహంతోనే సాధించగలిగానంటూ క్రెడిట్ అంతా వారికే ఇచ్చేసింది ఈ డ్యాన్స్ లవర్ ఎవెట్ పెరీరా. ప్రస్తుతం ఆమె విజయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.