నిధులిస్తారా లేక నీళ్లు నములుతారా? | Sakshi Guest Column On VB-G RAM G Funds | Sakshi
Sakshi News home page

నిధులిస్తారా లేక నీళ్లు నములుతారా?

Jun 30 2026 1:33 AM | Updated on Jun 30 2026 1:33 AM

Sakshi Guest Column On VB-G RAM G Funds

సందర్భం

దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు గత రెండు దశాబ్దాలుగా కనీస జీవన భద్రతగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, జూలై 1 నుండి ‘వీబీ జీ రామ్‌ జీ’ని అమల్లోకి తేవడానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. 55కు పైగా ప్రధాన క్లాజులు, రూల్స్, వందలాది ఉప నిబంధనలు, కొత్త పరిపాలనా నిర్మాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థ ఉపాధి హామీని బలోపేతం చేయడానికి కాదు; దాని హక్కు ఆధారిత స్వభావాన్ని పూర్తిగా బలహీనపరచడానికే ఉద్దేశించబడింది. ఉపాధి హామీ కాదు, నిరుద్యోగ హామీ ఇది. చెట్టును నరికి నీడ ఇస్తామని చెప్పడం ఎంత మోసమో, ‘ఎంజీనరేగా’ను నిర్వీర్యం చేసి 125 రోజుల ఉపాధి హామీ ఇస్తామని చెప్పడం అంతే మోసం. 

లెక్కలు చెప్పే నిజాలు
కేంద్ర ప్రభుత్వం 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ ఏ ఉపాధి పథకం అయినా హామీలపై కాదు, నిధులపై నిలబడుతుంది. ఇక్కడే మొదటి వైరుధ్యం కనిపిస్తుంది. 125 రోజుల ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో కొత్త పథకానికి కేవలం రూ. 95,000 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపు 125 రోజుల ఉపాధికి ఏమాత్రం సరిపోదని రాష్ట్రాలవారీ పని దినాల గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం కేరళలో సగటు పనిదినాలు 57.81, తెలంగాణలో 50.24, తమిళనాడులో 48.54, పశ్చిమ బెంగాల్‌లో 44.12, ఆంధ్రప్రదేశ్‌లో 42.35 మాత్రమే ఉన్నాయి. బిహార్‌లో 30.94, ఉత్తరప్రదేశ్‌లో 27.50, మధ్యప్రదేశ్‌లో 25.66, మహారాష్ట్రలో 14.40, హరియాణాలో 13.78 రోజులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం 15 నుంచి 50 రోజుల పని కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం 95 వేల కోట్లతో ఒక్కసారిగా 125 రోజుల ఉపాధి ఎలా కల్పిస్తుంది?

ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి 17 ప్రధాన రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 7 కోట్ల 69 లక్షల 65 వేల యాక్టివ్‌ జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కార్మికులకు 125 రోజుల ఉపాధి హామీని అమలు చేయడానికి మొత్తం రూ. 3.61 లక్షల కోట్ల వ్యయం అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేటాయింపు ఈ రాష్ట్రాలకు 85,605 కోట్లు మాత్రమే. రాష్ట్రాల 40 శాతం వాటా 57,071 కోట్లు కలిపినా మొత్తం అందుబాటులో ఉండే నిధులు 1.43 లక్షల కోట్లే. ఈ నిధులతో సంవత్సరంలో సగటున 48.5 పని దినాలే ఇవ్వగలరు. కేంద్రం కేటాయించిన నిధులు తప్ప అదనంగా పైసా నిధులు ఇవ్వబోమని రూల్స్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే, ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలే అదనంగా 2.18 లక్షల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. అంటే 30 శాతం వాటా కేంద్రం, 70 శాతం వాటా రాష్ట్రాలు ఖర్చు చేయాలి. 

తెలుగు రాష్ట్రాల తీరు
ఆంధ్రప్రదేశ్‌లో 54.99 లక్షల యాక్టివ్‌ జాబ్‌ కార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదిందిన 7,707 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 71 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధి కల్పించాలంటే 22,746 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 15,039 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలంగాణలో 30.99 లక్షల యాక్టివ్‌ జాబ్‌ కార్డులు ఉన్నాయి. కేంద్రం కేటాయించిన 3,825 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 62 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధికి 12,819 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై  8,993 కోట్ల అదనపు భారం పడు తుంది. ఈ లెక్కలు ఒక స్పష్టమైన రాజకీయ సత్యాన్ని బయటపెడు తున్నాయి. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది, ఖర్చు రాష్ట్రా లది. నియంత్రణ మోదీ గారిది, విఫలమైతే నింద రాష్ట్రాలది. ‘పెళ్లి పెద్దలు చేసుకున్నారు – కట్నం మాత్రం రాష్ట్రాలు పెట్టాలి’ అన్న ట్టుగా ఈ వ్యవస్థ రూపొందుతోంది. ఇక్కడ ఒక పాత సామెత గుర్తుకు వస్తుంది: ‘ఎద్దు ఇస్తానని చెప్పి తాడు చేతిలో పెట్టినట్టు’. రాష్ట్ర ప్రభుత్వలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సాధ్యమా? అంతిమంగా నష్టపోయేది ఉపాధి కార్మికులే. 

పేరు కాదు, తత్వమే మారింది!
డ్రాఫ్ట్‌ రూల్స్‌లోని రూల్‌ 3 చెల్లింపులు, బ్యాంకు మరియు పోస్టాఫీస్‌ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపును ప్రస్తావిస్తుంది. కానీ కార్మికుడి హక్కుల రక్షణపై స్పష్టత కనిపించదు. వేతనాలు ఆలస్య మైతే బాధ్యత ఎవరిది? నిరుద్యోగభృతి చెల్లించకపోతే బాధ్యులపై చర్య ఏమిటి? వంటి ప్రశ్నలకు రూల్స్‌లో స్పష్టమైన సమాధానం లేదు. కార్మికుడి హక్కు కేంద్ర బిందువుగా ఉండాల్సిన చోట పరిపా లనా ప్రక్రియ కేంద్ర బిందువుగా మారుతోంది. అత్యంత ప్రమాదకరమైన మార్పు రూల్‌ 4లో కనిపిస్తుంది. రూల్‌ 4(2)లోని నార్మటివ్‌ అలోకేషన్‌ విధానం ఎంజీ నరేగా అసలు తత్వాన్నే మార్చేస్తోంది. ఎంజీనరేగా ప్రాథమిక సూత్రం ‘పని అడిగితే పని ఇవ్వాలి.’ పని డిమాండ్‌ ఉంటే ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. కానీ కొత్త విధానం పని హక్కును బడ్జెట్‌ పరిమితికి కట్టిపడేస్తోంది. అంటే ఇప్పుడు నిధులు ఉంటేనే పని. హక్కు నుండి కోటాకు మార్పు. చట్టబద్ధ హామీ నుండి బడ్జెట్‌ పరిమితికి మార్పు. పౌరుని హక్కు నుండి అధికారుల విచక్షణకు మార్పు. ‘బావి ఎండి పోయాక మోటారు పెంచినట్టు’ 125 రోజుల హామీ ఉంది.

ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించా రన్న ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. గాంధీ పేరు గ్రామ స్వరాజ్యం, వికేంద్రీకరణ, గ్రామసభల పాత్ర వంటి భావనలకు ప్రతీక. కానీ కొత్త వ్యవస్థలో గ్రామ సభలు బలహీనపడుతున్నాయి. అందుకే ‘ముందు బోర్డు మార్చారు – ఇప్పుడు భవనం కూల్చేస్తున్నారు.’ ఇది పేరు మార్పు కాదు. తత్వ మార్పు. డ్రాఫ్ట్‌ రూల్స్‌లోని డిజిటల్‌ నిబంధనలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ–కేవైసీ, ఫేస్‌ అథెంటికేషన్, ఎన్‌ఎంఎన్‌ఎస్, ఆధార్‌ అథెంటికేషన్‌ వంటి విధానాలను ఆధునికీకరణ పేరుతో ప్రవేశపెడుతున్నారు. కానీ గ్రామీణ పేద కార్మికుల అను భవం వేరే కథ చెబుతోంది. నెట్‌వర్క్‌ లేకపోతే పని లేదు.  వేలి ముద్ర పడకపోతే వేతనం లేదు. అంటే పని హక్కు కార్మికుడి చేతిలో లేదు. సాంకేతిక వ్యవస్థల చేతిలో ఉంది.

ఎంజీనరేగా గ్రామీణ కార్మికుడికి కనీస భద్రతను ఇస్తుంది. వేతనాలపై ఒక కనీస ప్రమాణాన్ని సృష్టిస్తుంది. ఆకలి, నిరుద్యో గాన్ని కొంతమేర నియంత్రిస్తుంది. అందుకే దేశంలోని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వ్యవసాయ, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు విశాల ఐక్య వేదికలను నిర్మించి ఈ దాడిని తిప్పికొట్టాలి. వీబీ జీ రామ్‌ జీని ఉపసంహరించాలి. 200 రోజుల చట్టబద్ధ ఉపాధి హామీ కల్పించాలి. పూర్తి కేంద్ర నిధులు విడుదల చేయాలి. గ్రామ సభలు, పంచాయతీల అధికారాలను బలోపేతం చేయాలి.

బి. వెంకట్‌
వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement