breaking news
Rural poor peoples
-
పేదల ‘ఉపాధి’కి కోత
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ‘ఉపాధి’లో భారీగా కోతపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Upadi Hami Pathakam) కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది.గత ఆర్థిక సంవత్సరం(2023–24)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పని దినాలకు, ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పనిదినాలను పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పనిదినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదలు వేతనాల రూపంలో రూ.700 కోట్ల మేరకు నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్సీ, ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతిరాజకీయ కారణాలతో పనికి ఎసరు!కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది జూన్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే... ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ పథకంలో కీలకమైన ఫీల్డ్ అసిస్టెంట్లను పెద్ద ఎత్తున తొలగించేలా చేశారు.క్షేత్రస్థాయిలో కూలీలకు పనులు కల్పించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమ పార్టీల కార్యకర్తలను నియమించుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి ఉపాధి హామీ పథకం అమలుపై అవగాహన లేకపోవడంతోపాటు వాళ్లు గ్రామాల్లో రాజకీయాలకు ప్రభావితమై తమకు ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులకు పనుల కల్పనకు ఇష్టపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల రాష్ట్రంలోని పేదలు ఆరు నెలల్లోనే రూ.700 కోట్ల వరకు నష్టపోవాల్సి వచి్చంది. ఉపాధి పనుల కల్పన ఇలా..⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంలోని 2023 జూన్ నుంచి 2024 జనవరి మధ్య రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలపాటు పనులు కల్పించారు. ⇒కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలోని 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పనిదినాలు మాత్రమే పనులు కల్పించారు. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి జనవరి వరకు ఎస్సీలకు 22.41 శాతం పని దినాలు కల్పించారు. అదే కాలానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 21.87 శాతానికి తగ్గిపోయింది. ⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2024 ఏప్రిల్, మే నెలల్లో కూడా 12.72 కోట్ల పనిదినాలు కల్పించడం విశేషం. ⇒ ప్రస్తుతం ఉపాధి కూలీలకు సగటున రోజుకు రూ.255 చొప్పున వేతనాలు లభిస్తున్నాయి.⇒ కూటమి ప్రభుత్వం గత ఏడాది మాదిరిగా పనులు కల్పించినా గ్రామీణ పేదలకు రూ.700 కోట్ల వరకు లబ్ధి కలిగేది. -
‘కరువు’లో మరో 50 పనిదినాలు
ఉపాధి హామీ కార్మికులకు కేంద్రం వరం న్యూఢిల్లీ: దేశంలోని కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం ఉన్న 100 రోజులకు తోడు మరో 50 పనిదినాలు అదనంగా కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలు 15 శాతాన్ని మించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 30 జిల్లాలకు గానూ 27 జిల్లాలు కరువుబారిన పడినట్లు కర్ణాటక ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయంతో కరువుతో కష్టాలు పడుతున్న గ్రామీణ పేదలు లబ్ధి పొందుతారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ దీంతో పాటు పలు ఇతర విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు.. రూ.5,142.08 కోట్లతో శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్(ఎస్పీఎంఆర్ఎం)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంతరాలను తగ్గించే లక్ష్యంతో 2020 నాటికి దేశవ్యాప్తంగా 300 గ్రామ సముదాయాల(రూరల్ క్లస్టర్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మైదాన, తీర గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న సమీప గ్రామాలను.. ఏడారి, పర్వత, గిరిజన ప్రాంతాల్లో మొత్తం 5,000 నుంచి 15 వేల జనాభా ఉన్న సమీప గ్రామాలను రూరల్ క్లస్టర్స్‌గా ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడ్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక రంగాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఎస్పీఎంఆర్ఎంను ఏర్పాటు చేశారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పుర(ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్) స్థానంలో ఎన్డీయే ప్రభుత్వం ఈ మిషన్‌ను తీసుకువచ్చింది. యూపీఏ ప్రభుత్వ ‘పుర’కు.. బీజేపీ మాతృసంస్థ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ఆరెస్సెస్ వ్యవస్థాపక సభ్యుడు అయిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టిన తాజా పథకానికి తేడా ఏంటన్న మీడియా ప్రశ్నకు.. యూపీఏ ప్రభుత్వ పథకం పూర్తిగా ప్రైవేటు రంగానికే పరిమితమైందని, దానిలో ప్రభుత్వ భాగస్వామ్యం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌధరి బీరేందర్ సింగ్ సమాధానమిచ్చారు. ఆ లోటును తమ తాజా పథకం పూడుస్తుందన్నారు. విజయవాడ(ఆంధ్రప్రదేశ్), కురుక్షేత్ర(హరియాణా), భోపాల్(మధ్యప్రదేశ్), జోరాట్(అస్సాం)ల్లో నెలకొల్పనున్న ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)’ సంస్థల్లో ఒక్కో సంస్థలో ఒక్కొక్కరి చొప్పున నలుగురు డెరైక్టర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగా తిరుగుబాటు సంస్థ ఎన్ఎస్సీఎన్(కే)పై ఐదేళ్ల నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ జూన్‌లో మణిపూర్‌లో దాడి చేసి 18 మంది సైనికుల ప్రాణాలు తీయడంతో పాటు భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎన్ఎస్సీఎన్(కే) తరచుగా ఉల్లంఘిస్తోంది. మరో తిరుగుబాటు సంస్థ ఎన్ఎస్సీఎన్(ఐఎం)తో కేంద్రం ఇటీవల శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.