యుద్ధ పాఠాలు పెద్దవే! | Sakshi Guest Column On USA, Israel, Iran War lessons | Sakshi
Sakshi News home page

యుద్ధ పాఠాలు పెద్దవే!

Jul 1 2026 12:37 AM | Updated on Jul 1 2026 12:38 AM

Sakshi Guest Column On USA, Israel, Iran War lessons

అభిప్రాయం

పాఠాలు ఏ యుద్ధానికైనా ఉంటాయి. కొన్నింటికి అసాధారణంగా, బహుముఖాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఇరాన్‌ యుద్ధం ఒకటి. యుద్ధంలో ప్రత్యక్ష పాత్రధారులు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌. అమెరికా సైనిక స్థావరాలకు చోటి చ్చిన కొన్ని గల్ఫ్‌ రాజ్యాలు అందు బాటులో అసంకల్పిత భాగస్వాముల య్యాయి. పరోక్షంగా మొత్తం ప్రపంచానికి పాత్ర ఏర్పడింది. ఏదో విధమైన కష్టనష్టాలు అందరికీ కలిగాయి. గెలిచినవారు ఎవరూ లేరు. పాఠాలు మాత్రం అందరికీ ఉన్నాయి.

కళ్లముందున్న చరిత్ర
కేవలం సైనిక బలాన్ని నమ్మి, తమది సాటిలేని శక్తి అంటూ అహంకరించి, ప్రత్యర్థిని సరిగా అంచనా వేయకుండా దాడికి పాల్ప డటం ఓటమికి దారి తీస్తుంద న్నది అమెరికాకు మొదటి పెద్దపాఠం. అమెరికా సైనిక బలం మొత్తం ప్రపంచంలోనే సాటి లేనిదన్నది నిర్వివాదాంశం. కానీ అసమానుల మధ్య అసమతుల యుద్ధ వ్యూహాలు ఉంటాయన్నది కొత్తగా తెలుసుకోవలసిన విషయం కాదు. స్వయంగా అమెరికా మొదట వియత్నాంలో (1975)లో నేర్చింది. అఫ్గానిస్తాన్‌లోనైతే అదే పాఠాన్ని బ్రిటన్‌ (1839–1919), రష్యా (1979–89), అమెరికా (2001–21)లు వరుసగా నేర్చాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం కూడా అటువంటి రూపానికే మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అనుభవాలు ఉండి కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, జాగ్రత్తగా ఆలోచించిన తన సలహాదారులు కొందరు వద్దని వారించినా, చివరకు ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ విముఖత చూపినా పెడచెవిన పెట్టి ఇరాన్‌పై దాడులకు దిగారు. 

తమపై యుద్ధం ఎప్పటికైనా జరుగుతుందని అంచనా వేసిన ఇరాన్‌ సుమారు 20 సంవత్సరాలుగా తన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నదనీ, 2025 జూన్‌ నాటి 12 రోజుల యుద్ధం తర్వాత ఆ ఏర్పాట్లను ముమ్మరం చేసిందనీ, ప్రస్తుత యుద్ధానికన్నా ముందే అమెరికన్‌ సైనిక నిపుణులు, బయటి నిపుణులు ట్రంప్‌ను హెచ్చరించారు. ఇదేమీ చాలదనుకుంటే, ఒకవేళ తమపై యుద్ధానికి దిగి నట్లయితే గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికన్‌ సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయగల శక్తి తమకుందని ఇరాన్‌ పదేపదే హెచ్చరించింది. తాము స్వయంగా హార్మూజ్‌ను మూసి వేయటమేగాక, తమ మిత్రులు హౌతీలతో బాబ్‌ అల్‌ మందేల్‌ను మూసివేయించగలమని స్పష్టం చేసింది. ఇరాన్‌కు రష్యా, చైనాల సాంకేతిక సహాయాలు ఉండటమూ తెలిసిందే.

అయినా ఎందుకు?
మొత్తం పరిస్థితులు ఈ విధంగా ఉండగా దాడులకు సమ కట్టడమేగాక, ఇరాన్‌లో తమ లక్ష్యం వెనిజులాలో వలె కనుమూసి తెరిచేలోగా నెరవేరిపోతుందని అంచనా వేయటం ఎంత పెద్ద తప్పో అమెరికా, ఇజ్రాయెల్‌లకు అర్థమయేందుకు ఎక్కువ రోజులు పట్ట లేదు. అది సైనికపరమైన పాఠం కాగా, రాజకీయమైనది కూడా కొద్ది రోజులలోనే తెలిసి వచ్చింది. వారు భ్రమపడినట్లు, ఖొమైనీని హత్య చేయటంతో ఇరానియన్‌ వ్యవస్థ రాజకీయంగా కుప్పకూలి, తమకు అనుకూలమైన శక్తులేవో అధికారాన్ని చేజిక్కించుకోవటం, ప్రజలు ఇస్లామిక్‌ వ్యవస్థపై తిరుగుబాటు చేయటం వంటివేవీ జరగలేదు. ఇవేవీ జరగకపోగా ఇరానియన్లు దేశ భక్తితో ఒకటయ్యారు. ఇరాన్‌తో అమెరికాది దశాబ్దాల అనుభవం. ఇరాన్‌లో ఇస్లామిక్‌ రివల్యూషన్‌ (1979) తర్వాత అక్కడి అధినాయకత్వం తమ రాజకీయ, సైనిక వ్యవస్థలను ప్రాంతాల వారీగా వికేంద్రీకరించి స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటూ, మొత్తం మీద కేంద్రాధికార ఉత్తర్వుల ప్రకారం వ్యవహరించేట్లు నిర్మించిన విషయం అమెరికాకు తెలియదనుకోలేము.

ఇన్నిన్ని ఉన్నా దాడులు చేయటమేగాక, అంతా క్షణాలలో తేలి పోతుందనుకోవటానికి కారణాలు రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇరాన్‌ చమురుపై దశాబ్దాలుగా కన్ను వేసిన అమెరికా, గత జనవరిలో వెనిజులా చమురును స్వాధీనపరచుకున్న తర్వాత ఇప్పుడు ఇరాన్‌వైపు కదలటం. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు డాలర్‌ కరెన్సీ విలువ బహుళ ధ్రువ ప్రపంచం వల్ల బలహీనపడు తుండటంతో, మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ లక్ష్యం కోసం ఇదంతా చేయటం. రెండవది, ఎట్టి పరిస్థితులలోనూ పాలస్తీనా సృష్టిని ఆపి, గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ను స్థాపించాలన్న నెతన్యాహూ ఒత్తిడికి లొంగిపోవటం. చివరకు అసమాన యుద్ధమే గెలిచింది.

వంద రోజుల యుద్ధం తర్వాత అంతే పెద్ద రాజకీయ పాఠాలు న్నాయి. నాటో దేశాలు సహా ఏ ఒక్కరూ ట్రంప్‌ నోరు తెరిచి అడిగినా తోడు నిలవక పోవటం. 1949లో నాటో ఏర్పడిన తర్వాత గత 77 సంవత్సరాలలోనే ఎప్పుడూ ఇట్లాంటి తిరస్కరణ అమె రికాకు ఎదురు కాకపోవటం పాఠం కన్నా పరాభవమనాలి. తను నెగ్గలేక ఇరాన్‌తో రాజీకి ప్రయత్నిస్తున్న దశలో అందుకు ఆటంకాలు సృష్టిస్తున్న నెతన్యాహూను ఆయన, ‘నువ్వు ప్రపంచంలో ఏకాకి వయా’వంటూ హెచ్చరించారుగానీ, వాస్తవానికి వారిద్దరూ ఒంటరి అయ్యారు. ట్యారిఫ్‌లతో మొదలై ఒకటి వెంట ఒకటిగా సాగుతూ వస్తున్న ఈ విధమైన పరిణామాలతో యూరప్, ఆసియాలలోని మిత్రులు తమ దారి తాము నెమ్మదిగా వెతుక్కుంటుండగా, చైనా, రష్యాల ప్రాబల్యం పెరగటం, వర్ధమాన ప్రపంచానికి అమెరికా పట్ల భక్తి, భయం రెండూ తగ్గుతుండటం మరో ముఖ్యమైన పాఠం. 

సమీక్షించుకోవాల్సిన వైఖరులు
ఇజ్రాయెల్‌ విషయానికి వస్తే, 1948లో ఒక దేశంగా సృష్టి అయినప్పటి నుంచి ప్రస్తుత యుద్ధం వరకు 68 సంవత్సరాలలో వారికి ఇంత ఎదురుదెబ్బ తగలలేదు. ఇజ్రాయెలీ సైన్యం అతిశక్తి మంతమైనదే అయినా, వారి ఐరన్‌ డోమ్‌ దుర్భేద్యమన్న పేరుండినా, ఇరాన్‌ అసమతల యుద్ధ వ్యూహాలను అది కూడా తట్టుకోలేక పోయింది. కనుక ఇక్కడినుంచి వారు చేయవలసింది మొదట పాల స్తీనాను ఏర్పాటు కానివ్వటం, తర్వాత గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ పథకాన్ని వదిలి వేయటం. ఇరాన్‌కు గల ఒకే ఒక పాఠం ఒక స్థాయిలో అత్యద్భుతంగా పోరాడి నిలిచినా, తగు ప్రజాస్వామిక సంస్కరణ లతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవటం.

గల్ఫ్‌ రాజ్యాల గురించి చెప్పుకోవాలంటే, వారు తమ ఇరాన్‌ వ్యతిరేకత, పాలస్తీనా అంశం పట్ల కపట వైఖరి, అమెరికా ఇజ్రా యెల్‌ ప్రేమ, వారిచ్చే రక్షణ పేరిట ఆ కూటమిలో బందీలుగా ఉండ టమనే విధానాలను సవరించుకోవలసి ఉంటుంది. గత విధానాల వల్ల కలిగే కష్ట నష్టాలు వారికిపుడు బాగానే అర్థమయినట్లు కనిపిస్తు న్నది. ఇక ఇండియా సహా వర్ధమాన దేశాలకు అమెరికా నిర్హేతుక మైన విధానాల వల్ల ఎదురయ్యే సమస్యలేమిటో ట్యారిఫ్‌లు, వాణిజ్య ఒప్పంద విషయాల నుంచి యూరప్‌ వలెనే తమకూ అనుభవంలోకి వస్తున్న విషయమే. అవే విధానాలతో ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా ఇరాన్‌పై, పరోక్షంగా మొత్తం ప్రపంచంపై రుద్దినందువల్ల కలుగుతున్న నష్టాలు తెలిసి వచ్చినందున, భవిష్యత్తులో ఇంధనం కావచ్చు, రాజకీయ వైఖరులు కావచ్చు, తాము మరింత స్వతంత్రంగా, స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవటమన్నది వారికి గల పాఠం.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement