నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది.. | Hiranyakashipu Brihaspati Narayana Mantra Power Of Devotion | Sakshi
Sakshi News home page

నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది..

Aug 17 2026 7:45 AM | Updated on Aug 17 2026 7:45 AM

Hiranyakashipu Brihaspati Narayana Mantra Power Of Devotion

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

జ్యోతిర్మయం

హిరణ్యకశిపుడు ఒక రోజు ఆలోచనలో పడ్డాడు. ‘అమరుల తల్లి కంటె మా అమ్మ పెద్దది. త్రిలోక రాజ్య భోగములు నాకు దక్కాలి గాని ఆ భోగాలకు అమరులెట్లా అర్హులౌతారు? ఉగ్రతపంతో కానివి లేవు కాబట్టి తపోనిష్ఠతో బ్రహ్మను మెప్పించి, ముల్లోకాధిపత్యాన్ని నేను దక్కించుకుంటాను!’ అని నిశ్చయించుకున్నాడు.

తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అతడి ఉగ్రతపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. దేవగురువైన బృహస్పతిని చెంతకు పిలిపించుకుని, ‘తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం మాకు వేరు. జగత్సామ్రాజ్య పూజ్యనీయత తనకు దక్కాలని దైతేయుడైన హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని ఉగ్రతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు జగములు తల్లడిల్లే పరిస్థితి వస్తున్నది కాబట్టి వేరే మార్గం కనపడక అడిగినది వరంగా ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అది తప్పిపోయే మార్గం చెప్పండి, గురుదేవా!’ అని ప్రాధేయపడ్డాడు.

సురేంద్రుడి భయాన్ని అర్థం చేసుకున్న బృహస్పతి ‘భయపడవలసింది లేదు. విష్ణుద్వేషం, నిరంతర దోషం, శ్రుతిధర్మ విరోధం, సుజన నిరోధం లక్షణాలుగా కలిగిన అసురులను శ్రీహరి క్షమించడు. కనుక నారాయణ మంత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యి!’ అని చెప్పి ఆ మంత్ర మహత్యాన్ని గురించి ఇలా వివరించాడని ఎఱ<న శ్రీనృసింహపురాణంలో చెప్పాడు.

క. తను నెబ్భంగి దలంతురు
జను లాభంగిన తలంచు సరసీరుహలో
చనుడును వారల గావున
ననిశంబు కృతార్థమతులు హరిపద భక్తుల్‌.
‘తనను ఎంత గాఢమైన భక్తితత్పరతతో పూజిస్తారో
అంతే గాఢమైన తలపుతో వారిని శ్రీహరి రక్షిస్తాడు. అందువలననే శ్రీహరిని భక్తితో కొలిచేవారికి కలగని సుఖములు లేవు!’ అని కర్తవ్యాన్ని బోధించి సురేంద్రుడి కలతను, కష్టాన్ని తీర్చాడు బృహస్పతి. తాను ఎదుర్కొనలేని ఆపదలో చిక్కుకున్న వేళ, వ్యర్థంగా కలత చెందడం మాని నమ్మిన దైవాన్ని శరణు వేడితే, ఆ ఆపద నుంచి గట్టెక్కే మార్గం  కనపడుతుందని పై సన్నివేశం విదితం చేస్తుంది.
– భట్టు వెంకటరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement