breaking news
brihaspati
-
ఇన్ఫోసిస్ అంటే బృహస్పతినా?
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య సర్వేపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ఈ సర్వే వెనుకబడిన తరగతులకు సంబంధించినది కాదని పదేపదే చెప్పినా నారాయణమూర్తి దంపతులకు అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది (సర్వే) వెను కబడిన కులాలకు సంబంధించినదనే అపోహ కొందరిలో ఉంది. ఇది వెనుకబడిన కులాల సర్వే కాదు. దీని గురించి రాసేవాళ్లు ఏమై నా రాసుకోనీయండి. ఈ సర్వే ఎందుకోసమనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. వాళ్లకు (నారాయణమూర్తి దంపతులకు) దీనిగురించి అర్థంకాకపోతే నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు.వాళ్లు సర్వజ్ఞులా?ప్రభుత్వ సర్వేపై నారాయణమూర్తి దంపతులు గురువారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వారి ఇంటికి సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు వారు సహకరించలేదని తెలిసింది. తాము వెనుకబడిన వర్గానికి చెందినవారము కాదని, అందువల్ల సర్వేలో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నారాయణమూర్తి దంపతుల తీరుపై సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ‘ఇన్ఫోసిస్ అంటే ఏమైనా బృహస్పతినా (మేధావి)? ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదని, అందరి సర్వే అని మేం 20 సార్లు చెప్పాం. మా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి శక్తి పథకాన్ని ప్రారంభించింది. గృహలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,000 ఇస్తున్నాం. శక్తిపథకాన్ని వినియోగించుకుంటున్నవారిలో అగ్రకుల మహిళలు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు లేరా? గృహలక్ష్మి పథకంలో అగ్రకుల మహిళలు లేరా? కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపడుతోంది. మూర్తి దంపతులు ఆ సర్వేలో ఏం చెప్తారు? బహుషా తప్పుడు సమాచారం ఇస్తారేమో! నేను మళ్లీమళ్లీ చెప్తున్న ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదు. ఏడు కోట్లమంది కన్నడిగులకు సంబంధించిన సర్వే’అని స్పష్టంచేశారు.మార్పు అనేది విప్లవం కాదురాష్ట్రంలో సీఎం మార్పుపై కూడా ఆయన స్పందించారు. ‘కొందరు నవంబర్ క్రాంతి అంటున్నారు. అది క్రాంతి కాదు. క్రాంతి అంటే విప్లవం. మార్పు అనేది విప్లవం కాదు’అని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశం సమయం సందర్భం లేకుండా చర్చకు వస్తోందని, దీనిని పెద్దగా పట్టించుకోవా ల్సిన అవసరం లేద ని అన్నారు. ప్రభుత్వ భూములు, స్కూళ్లు, కాలేజీల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ‘ఇది ఒక్క ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నిర్ణ యం కాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహించటం కుదరదు. నిజా నికి ఈ నిర్ణయం గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీశ్ షెట్టర్ సర్కారు తీసుకుంది’అని పేర్కొన్నారు. -
బృహస్పతి వద్ద శనైశ్చరుని విద్యాభ్యాసం
భూలోకవాసులకు బ్రహ్మజ్ఞానం బోధించాలని దేవగురువైన బృహస్పతికి సంకల్పం కలిగింది. భూలోకంలో ఒక బ్రాహ్మణుని ఇంట వాచస్పతి అనే పేరుతో జన్మించాడు. యుక్తవయసు వచ్చేనాటికి సకలశాస్త్ర పారంగతుడిగా గుర్తింపు పొందాడు. నర్మదా నదీతీరం వద్ద ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, అనేక మంది విప్ర బాలకులను శిష్యులుగా చేర్చుకున్నాడు. వారికి తానే అన్నవస్త్రాదులను ఇస్తూ, విద్యాబోధన చేస్తుండేవాడు.అదే కాలంలో సూర్యపుత్రుడైన శనైశ్చరుడు విద్యాభ్యాసం చేయాలనుకున్నాడు. ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి, తన కోరికను వెలిబుచ్చాడు. ‘తండ్రీ! నేను విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నాను. నాకు తగిన గురువు ఎవరు?’ అని అడిగాడు. ‘నాయనా! దేవగురువు బృహస్పతి సమస్త విద్యలలోనూ గొప్పవాడు. నీకు తగిన గురువు అతడే! ఇప్పుడు అతడు వాచస్పతి అనే పేరుతో భూలోకంలో జన్మించి, భూలోకవాసులకు విద్యాబోధన చేస్తున్నాడు. అతడి వద్దకు వెళ్లి బ్రహ్మజ్ఞానాన్ని పొందు. అతడు విప్రకుమారులకు తప్ప ఇతరులకు బోధించడు. అందువల్ల నువ్వు విప్రవేషంలో వెళ్లు’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లే శనైశ్చరుడు విప్రబాలకుడి వేషంలో వాచస్పతి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న విప్రబాలకుల ద్వారా గురువును కలుసుకున్నాడు. ‘ఆచార్యా! విద్యాభ్యాసం కోరి మీ వద్దకు వచ్చాను’ అని చెప్పాడు. వాచస్పతి అతడిని చూసి, ‘నీ వంశమేది?’ అని ప్రశ్నించాడు. ‘కపిలుడి వంశంలో జన్మించాను’ అని బదులిచ్చాడు శనైశ్చరుడు. వాచస్పతి అతడిని తన గురుకులంలో చేర్చుకున్నాడు.వాచస్పతి వద్ద విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులందరిలోనూ శనైశ్చరుడు అనతికాలంలోనే బ్రహ్మజ్ఞానం సహా సమస్త విద్యలనూ, శాస్త్రాలనూ పరిపూర్ణంగా నేర్చుకున్నాడు. ఇక అతడికి నేర్పాల్సినది ఇంకేమీ లేదని నిశ్చయించుకున్నాక వాచస్పతి ఒకనాడు అతడిని పిలిచి, ‘అబ్బాయీ! నీకు నేర్పాల్సినది ఇంకేమీ లేదు. నీ విద్యాభ్యాసం పూర్తయింది. నువ్వు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, సుఖప్రదంగా జీవించవచ్చు’ అని చెప్పాడు.‘ఆచార్యా! గురుదక్షిణగా ఏమివ్వమంటారు? మీకు గురుదక్షిణ చెల్లించకుంటే, అది నాకు శ్రేయస్కరం కాదు’ అని పలికాడు శనైశ్చరుడు.‘నాకు ఏమీ అవసరం లేదు. నిజంగా నువ్వెవరివో వివరంగా చెప్పి వెళ్లు, చాలు’ అన్నాడు వాచస్పతి. ‘ఆచార్యా! నేను సూర్యపుత్రుడిని. నా పేరు శనైశ్చరుడు. నా తండ్రి ఆజ్ఞ మేరకు మీ వద్దకు వచ్చి, విద్యలు నేర్చుకున్నాను’ బదులిచ్చాడు శనైశ్చరుడు.వాచస్పతి ఆశ్చర్యపోయాడు. ‘నాయనా! ఇప్పుడు నీకు తప్పక గురుదక్షిణ అడుగుతాను. నీ దృష్టి నా మీద పడకుండా వరమివ్వు, చాలు’ అని అడిగాడు.‘ఆచార్యా! మీరు కోరినా, అది అసాధ్యం కదా! గ్రహచారాన్ని తప్పించడం ఎవరికి సాధ్యం? బ్రహ్మాదులకైనా అది తప్పదని మీకు కూడా తెలుసు కదా! అయితే, నా దృష్టి పడినా, మీకు ఆపద లేకుండా మాత్రం చేయగలను’ అని చెప్పాడు శనైశ్చరుడు. ‘అది చాలు నాకు’ బదులిచ్చాడు గురువు.ఒకనాడు వాచస్పతి పూలసజ్జ పట్టుకుని, ఆశ్రమ సమీపంలోని పూలతోటలో పూలు కోసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆ దేశపు రాజు పరివారంతో పాటు వేటకు వచ్చి, ఆ ఉద్యానవనంలో విశ్రాంతి కోసం నిలిచారు. రాజుతో పాటు రాణి, పసిపిల్లవాడు కూడా ఉన్నారు. పసిపిల్లవాడిని ఉయ్యాలలో వేసి దాసీజనం కాపలాగా ఉన్నారు. హఠాత్తుగా ఉయ్యాలలోని పసిపిల్లవాడు అదృశ్యమయ్యాడు. రాజ పరివారంలో హాహాకారాలు మొదలయ్యాయి. కొడుకు కనిపించక రాణి దుఃఖించసాగింది. ‘పసిపిల్లవాడిని వెంటనే వెదికి తీసుకురండి’ అంటూ భటులను ఆజ్ఞాపించాడు రాజు.వారు తోట నలుమూలలా వెదుకుతుండగా, పూలు కోసుకుంటున్న వాచస్పతి కనిపించాడు. అతడి చేతనున్న పూలసజ్జలోని పూల మీద నెత్తుటి మరకలు కనిపించాయి. వారు అతడిని పట్టుకుని, సజ్జను వెదికారు. అందులో బాలుడి మొండెం కనిపించింది. అతడిని వెంటనే బంధించి, రాజు ముందు ప్రవేశపెట్టారు. ‘ఇతడికి తగిన శిక్ష విధించండి’ అని మంత్రులను ఆజ్ఞాపించాడు రాజు.వాచస్పతిని ముందు నుంచి ఎరిగి ఉన్న మంత్రులు అతడు అంతటి ఘోరం చేసి ఉంటాడంటే నమ్మలేక, అతడికి శిక్ష విధించడానికి తటపటాయించసాగారు. నేరానికి బలమైన రుజువు ఏదీ లేక విచారణ చేయడం ప్రారంభించారు. వాచస్పతి ఏం జరుగుతున్నదో అర్థంకాక కాసేపు తికమకపడ్డాడు. కాసేపు ధ్యానంలోకి వెళ్లాడు. ఇదంతా శనైశ్చరుని దృష్టి ప్రభావమేనని గ్రహించాడు. మనసులోనే శనైశ్చరునికి స్తోత్రం చేశాడు.శనైశ్చరుడు ఇచ్చిన మాట ప్రకారం గురువును ఆపద నుంచి గట్టెక్కించాలని నిశ్చయించుకున్నాడు.రాజ పరివారం ఆందోళనలో ఉన్న ఆ సమయంలో అశరీరవాణి ఇలా వినిపించింది: ‘రాజా! ఈ విప్రుడు నిర్దోషి. నీ కుమారుడికి ఆపదేమీ కలగలేదు. అతడు నీ ఇంటనే హంసతూలికా తల్పంపై ఆదమరచి నిదురపోతున్నాడు’ అని వినిపించింది. రాజాజ్ఞపై రాజ భటులు హుటాహుటిన గుర్రాల మీద దౌడు తీసి, రాజ ప్రాసాదానికి చేరుకున్నారు. హాయిగా నిద్రిస్తున్న బాలుడు వారి అలికిడికి మేలుకున్నాడు. వారు అతణ్ణి జాగ్రత్తగా ఎత్తుకుని, రాజు వద్దకు తీసుకువచ్చారు. రాజ పరివారం అంతా సంతోషించారు. వాచస్పతికి ఘన సత్కారం చేసి, అనేక కానుకలను బహూకరించి, రాజు, అతడి పరివారం తిరుగు ప్రయాణమయ్యారు.∙సాంఖ్యాయన -
పుష్కర తృష్ణ
ఆశలు తీర్చుకోవాలనే ఆకలి ఉన్నట్లే ఆశయాలు తీర్చుకోవాలనే దాహం ఉండాలి. దాన్నే తృష్ణ అంటారు. నదులతో మానవాళి అనుబంధం ఈనాటిది కాదు. అది అనాదిగా కొనసాగుతూనే ఉంది. దేశదేశాల్లోని నాగరికతలు నదీతీరాల్లోనే వెలశాయి. జీవధారలైన నదులు మానవాళికి ప్రాణాధారాలుగా నిలుస్తున్నాయి. అన్ని దేశాల్లోనూ నదులను గౌరవిస్తారు. మన దేశంలో నదులను నదీమాతలుగా పూజిస్తారు కూడా. నదీమాతలకు అందరూ బిడ్డలే! నదులు నేలను సస్యశ్యామలం చేస్తాయి. నవధాన్యాల సిరులు పండిస్తాయి. సకల చరాచర జీవరాశుల మనుగడకు భరోసా ఇస్తాయి. నదులు దాహార్తిని తీరుస్తాయి. ఉధృత ప్రవాహంతో సమస్త కశ్మలాలనూ ప్రక్షాళన చేస్తాయి. కశ్మలాలంటే బాహ్య కశ్మలాలనేనా? అంతఃకశ్మలాలను కూడా జీవనదులు ప్రక్షాళన చేస్తాయని, అన్ని పాపాలనూ కడిగేసి లోకులను పునీతం చేస్తాయని భారతీయులు నమ్ముతారు. అందుకే నదీతీరాల్లో అన్ని తీర్థాలు వెలశాయి. అన్ని క్షేత్రాలు వెలశాయి. అవన్నీ మన వేద శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో సుస్థిర స్థానాన్ని పొందాయి. మానవులకు జనన మరణాలు ఆద్యంతాలుగా ఉన్నట్లే నదులకు కూడా ఒక ఆవిర్భావం, ఒక ముగింపు ఉంటాయి. ఎక్కడో సన్నని ధారగా మొదలైన నదులు ఎక్కడెక్కడి జలధారలనో తమలో కలుపుకొని, తమను తాము విస్తరించుకుని నేలను చీల్చుకొని ప్రవహిస్తాయి. ప్రవాహ మార్గంలో ఎన్నెన్నో ఎగుడుదిగుళ్లను చవి చూస్తాయి. మార్గమధ్యంలో నానా కాలుష్యాలను ఎంతో సహనంతో భరిస్తాయి. చినుకు రాలనప్పుడు చిక్కిపోతాయి. వర్షాలు కురిసినప్పుడు బలం పుంజుకుని, ఉధృతంగా ఉరకలేస్తాయి. వానలు మోతాదు మించినప్పుడు వరదలుగా పోటెత్తుతాయి. తుదకు ఎక్కడో సముద్రంలో కలిసిపోతాయి. ఏ చోట పుట్టినా, సముద్రంలో ఎక్కడ కలిసినా అవి ప్రవహించినంత మేరా మానవాళికి మాత్రమే కాదు, సమస్త జీవరాశికీ మేలు చేస్తాయి. నదులను మూలం నుంచి ముగింపు వరకు పరికిస్తే, అచ్చం మానవ జీవితానికి నకలులాగానే అనిపిస్తాయి. నదుల రుణం తీర్చుకోలేనిది. తీర్చుకోలేని రుణమైనా శాయశక్తులా తీర్చుకోవాల్సిందేనని మన సంప్రదాయం నిర్దేశిస్తోంది. నదులకు రుణం తీర్చుకునే సందర్భాలుగానే మన పెద్దలు పన్నెండు జీవనదులకు పుష్కరాలను ఏర్పాటు చేశారు. ఇవే పుణ్యనదులుగా మన్ననలు అందుకుంటున్నాయి. త్వరలోనే పుష్కరాలు జరుపుకోబోతున్న కృష్ణానది కూడా ఒక పుణ్యనది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో సన్నని ధారగా మొదలైన ఈ జీవనది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సాగరసంగమం చేస్తోంది. పుష్కరాల సందర్భంగా పితృకార్యాలు చేయడం ఆనవాయితీ. పుష్కరాల్లో కేవలం పితృదేవతలకు మాత్రమే కాదు, మిత్రులు, గురువులు, యజమానులు, ప్రభువులు, రుషులకు కూడా పిండప్రదానం చేస్తారు. పుష్కరకాలంలో దాన ధర్మాలు చేస్తారు. పుష్కలంగా నీళ్లిచ్చే నదికి పుష్కరానికొకసారి నదీపూజ చేస్తారు. ఇదంతా రుణం తీర్చుకోవడం కాదు గానీ, మేలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొనే విధాయకం. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన సందర్భం. జీవరాశికి మేలు చేయాలనేదే నదుల తృష్ణ. పుష్కరానికి ఒకసారైనా నదులలో మునిగి బాహ్యాంతరాలను పునీతం చేసుకోవాలనేదే మానవుల తృష్ణ. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణాపుష్కరాలు పుష్కర సమయంలో దేవతలకు గురువు అయిన బృహస్పతితో పాటు పుష్కరుడు, మూడున్నర కోట్ల దేవతలందరూ ఆ నదిలో కొలువుంటారు.