
సోషియో సర్వే వాళ్లకు అర్థంకాకుంటే నేనేం చేయాలి?
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులపై కర్ణాటక సీఎం ఫైర్
ఆ సర్వే ప్రజలందరికీ సంబంధించిందని సిద్ధరామయ్య వివరణ
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య సర్వేపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ఈ సర్వే వెనుకబడిన తరగతులకు సంబంధించినది కాదని పదేపదే చెప్పినా నారాయణమూర్తి దంపతులకు అర్థంకాలేదని ఎద్దేవా చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది (సర్వే) వెను కబడిన కులాలకు సంబంధించినదనే అపోహ కొందరిలో ఉంది. ఇది వెనుకబడిన కులాల సర్వే కాదు. దీని గురించి రాసేవాళ్లు ఏమై నా రాసుకోనీయండి. ఈ సర్వే ఎందుకోసమనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. వాళ్లకు (నారాయణమూర్తి దంపతులకు) దీనిగురించి అర్థంకాకపోతే నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు.
వాళ్లు సర్వజ్ఞులా?
ప్రభుత్వ సర్వేపై నారాయణమూర్తి దంపతులు గురువారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వారి ఇంటికి సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు వారు సహకరించలేదని తెలిసింది. తాము వెనుకబడిన వర్గానికి చెందినవారము కాదని, అందువల్ల సర్వేలో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నారాయణమూర్తి దంపతుల తీరుపై సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ‘ఇన్ఫోసిస్ అంటే ఏమైనా బృహస్పతినా (మేధావి)? ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదని, అందరి సర్వే అని మేం 20 సార్లు చెప్పాం.
మా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి శక్తి పథకాన్ని ప్రారంభించింది. గృహలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,000 ఇస్తున్నాం. శక్తిపథకాన్ని వినియోగించుకుంటున్నవారిలో అగ్రకుల మహిళలు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు లేరా? గృహలక్ష్మి పథకంలో అగ్రకుల మహిళలు లేరా? కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపడుతోంది. మూర్తి దంపతులు ఆ సర్వేలో ఏం చెప్తారు? బహుషా తప్పుడు సమాచారం ఇస్తారేమో! నేను మళ్లీమళ్లీ చెప్తున్న ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదు. ఏడు కోట్లమంది కన్నడిగులకు సంబంధించిన సర్వే’అని స్పష్టంచేశారు.
మార్పు అనేది విప్లవం కాదు
రాష్ట్రంలో సీఎం మార్పుపై కూడా ఆయన స్పందించారు. ‘కొందరు నవంబర్ క్రాంతి అంటున్నారు. అది క్రాంతి కాదు. క్రాంతి అంటే విప్లవం. మార్పు అనేది విప్లవం కాదు’అని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశం సమయం సందర్భం లేకుండా చర్చకు వస్తోందని, దీనిని పెద్దగా పట్టించుకోవా ల్సిన అవసరం లేద ని అన్నారు. ప్రభుత్వ భూములు, స్కూళ్లు, కాలేజీల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ‘ఇది ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన నిర్ణ యం కాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహించటం కుదరదు. నిజా నికి ఈ నిర్ణయం గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీశ్ షెట్టర్ సర్కారు తీసుకుంది’అని పేర్కొన్నారు.