
మూర్తి దంపతుల నిర్ణయంపై కన్నడ మంత్రుల రియాక్షన్
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి తాజా నిర్ణయంపై కర్ణాటక మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనేందుకు మూర్తి దంపతులు నిరాకరించడంతో కన్నడ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాగా ప్రతిపక్ష బీజేపీ.. సుధామూర్తి దంపతులకు మద్దతుగా నిలిచింది.
అసలేం జరిగింది?
ప్రభుత్వ సామాజిక సర్వే, కులగణనలో తాము పాల్గొనబోమని అంటూ తమ ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లతో మూర్తి దంపతులు చెప్పారు. తాము అగ్రకులానికి చెందిన వారమని, వెనుకబడిన కులాలకు కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే తమకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో (DK Shivakumar) పాటు పలువురు మంత్రులు స్పందించారు. ''సర్వేలో పాల్గొనమని మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. అది స్వచ్ఛందంగా జరగాల''ని డీకే కామెంట్ చేశారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై మూర్తి దంపతులకు ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ ఎస్. తంగడగి వ్యాఖ్యానించారు.
మాటకు కట్టుబడతారా?
సర్వేలో పాల్గొనాలని తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ (Santosh Lad) అన్నారు. "ఒక ప్రభుత్వంగా, మేము ఎవరినీ సర్వేలో పాల్గొనమని బలవంతం చేయడం లేదని" అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేయనుందని, అప్పుడు కూడా మూర్తి దంపతులు ఇదే వైఖరికి కట్టుబడతారా'' అని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనకూడదన్న వారి నిర్ణయం మిగతా వాళ్లపై ఎటువంటి ప్రభావం చూపబోదని మంత్రి సంతోష్ అభిప్రాయపడ్డారు.
అలా చెప్పడం కరెక్ట్ కాదు
ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పాల్గొనబోమని నారాయణ మూర్తి లాంటి వారు చెప్పడం సమంజసంగా లేదని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే (priyank kharge) అన్నారు. మూర్తి దంపతుల నిర్ణయం చూస్తుంటే ఇతర బీజేపీ నాయకుల నుంచి ప్రేరణ పొందినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన నారాయణమూర్తి లాంటి వారి నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ సర్వేలో పాల్గొనబోమని వారు చెప్పడం కరెక్ట్ కాదని ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు.
గోప్యంగా ఉంచుతామని..
మూర్తి దంపతుల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలిని బీజేపీ నాయకుడు సురేశ్ కుమార్ (Suresh Kumar) తప్పుబట్టారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కానీ మూర్తి దంపతులు తమ అభిప్రాయాలతో రాసిన నోట్‌ను బహిర్గం చేయడం ద్వారా కాంగ్రెస్ సర్కారు మాట తప్పి ఉల్లంఘనకు పాల్పడిందని ఆయన విమర్శించారు. కాగా, రచయిత్రి, పరోపకారి అయిన సుధామూర్తిని గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 19 వరకు సర్వే
కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సెప్టెంబర్ 22న సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. ₹420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి.. బలహీన వర్గాలకు మరింత సమర్థవంతంగా సాధికారత కల్పించడంలో ఈ డేటా సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.