నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Visits Dalit Victim’s Family in Raebareli, Slams Yogi Govt Over Threats & Fake Videos | Sakshi
Sakshi News home page

నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్‌ గాంధీ

Oct 17 2025 12:54 PM | Updated on Oct 17 2025 1:26 PM

Rahul gandhi Met Hariom Valmiki Slams UP Govt

ఉత్తర ప్రదేశ్‌ రాయ్‌బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని  బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్‌ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. 

దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్‌పై మండిపడ్డారు. 

ఇదిలా ఉంటే.. రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్‌ అయ్యింది. 

రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్‌ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయానే వాటిని పోస్ట్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్‌ గాంధీకి ప్రశ్న ఎదురైంది.

ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్‌ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్‌ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.

అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్‌ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్‌ బేస్‌ మీద స్టాఫ్‌ నర్స్‌గా ఉద్యోగం ఇప్పించారు. 

ఇక ఈ కేసులో  ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్‌కౌంటర్‌లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్‌  చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్‌ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement