
కర్ణాటక కేబినెట్ సంచలన నిర్ణయం
బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ విద్యాలయాలు, సంస్థల ప్రాంగణాల్లో కార్యకలాపాలపై కఠిన సమీక్షలు
రహదారులపై కవాతులు, కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)పై పరోక్షంగా ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర కేబినెట్ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సర్క్యులర్‌ను జారీచేసింది. ఆర్‌ఎస్‌ఎస్ వంటి ప్రైవేట్ సంస్థల కార్యక లాపాలపై కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, సాంకేతికత శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాకు వెల్లడించారు.
‘‘మేం ఎలాంటి సంస్థ(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకలాపాలను నియంత్రించబోము. కానీ ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు, కార్యక్రమాలు చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఆయా అభ్యర్థనల తర్వాత ఈ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
ఇకపై స్థానిక పాలనా యంత్రాంగానికి ఊరకే ముందస్తు సమాచారం ఇచ్చేసి రహదారులపై కర్రలు ఊపుతూ కవాతులు, మార్చ్‌లు, పథ సంచలన వంటి కార్యక్రమాలు చేస్తామంటే కుదరదు. బహిరంగ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో కొత్త నియమ నిబంధనలు అమలు చేయబోతున్నాం’’ అని ప్రియాంక్ చెప్పారు.
పాత నిబంధనలే కొత్తగా..
‘‘వాస్తవానికి గతంలో హోం శాఖ, న్యాయ విభాగం, విద్యా శాఖ జారీచేసిన ఉత్తర్వులనే గుదిగుచ్చి ఏకీకృత నిబంధనావళిగా మారుస్తున్నాం. వచ్చే రెండు, మూడ్రోజుల్లో ఈ కొత్త నియమావళి అమల్లోకి రానుంది. ఇది రాజ్యాంగంలోని చట్టాల మేరకే అమలవుతుంది’’ అని మంత్రి ప్రియాంగ్ స్పష్టంచేశారు.
కర్ణాటక వ్యాప్తంగా ఆరెస్సెస్ కార్యకలా పాలను నిషేధించాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ లేఖ రాసిన రెండు వారాలకే కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తుండటం గమనార్హం.
‘‘ బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న అంశం కేబినెట్ భేటీలో చర్చకొచ్చింది. విద్యాసంస్థలు సహా ప్రభుత్వ స్థలాల వినియోగంపై నియంత్రణ కోసం హోంశాఖ ఉత్తర్వులు జారీచేయనుంది. ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల సద్వినియోగం, దుర్విని యోగంపై సంబంధిత విభాగాలకు ఆదేశాలు వెళ్లనున్నాయి’’ అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు.