breaking news
Hiranyakashipudu
-
నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది..
హిరణ్యకశిపుడు ఒక రోజు ఆలోచనలో పడ్డాడు. ‘అమరుల తల్లి కంటె మా అమ్మ పెద్దది. త్రిలోక రాజ్య భోగములు నాకు దక్కాలి గాని ఆ భోగాలకు అమరులెట్లా అర్హులౌతారు? ఉగ్రతపంతో కానివి లేవు కాబట్టి తపోనిష్ఠతో బ్రహ్మను మెప్పించి, ముల్లోకాధిపత్యాన్ని నేను దక్కించుకుంటాను!’ అని నిశ్చయించుకున్నాడు.తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అతడి ఉగ్రతపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. దేవగురువైన బృహస్పతిని చెంతకు పిలిపించుకుని, ‘తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం మాకు వేరు. జగత్సామ్రాజ్య పూజ్యనీయత తనకు దక్కాలని దైతేయుడైన హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని ఉగ్రతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు జగములు తల్లడిల్లే పరిస్థితి వస్తున్నది కాబట్టి వేరే మార్గం కనపడక అడిగినది వరంగా ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అది తప్పిపోయే మార్గం చెప్పండి, గురుదేవా!’ అని ప్రాధేయపడ్డాడు.సురేంద్రుడి భయాన్ని అర్థం చేసుకున్న బృహస్పతి ‘భయపడవలసింది లేదు. విష్ణుద్వేషం, నిరంతర దోషం, శ్రుతిధర్మ విరోధం, సుజన నిరోధం లక్షణాలుగా కలిగిన అసురులను శ్రీహరి క్షమించడు. కనుక నారాయణ మంత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యి!’ అని చెప్పి ఆ మంత్ర మహత్యాన్ని గురించి ఇలా వివరించాడని ఎఱ<న శ్రీనృసింహపురాణంలో చెప్పాడు.క. తను నెబ్భంగి దలంతురుజను లాభంగిన తలంచు సరసీరుహలోచనుడును వారల గావునననిశంబు కృతార్థమతులు హరిపద భక్తుల్.‘తనను ఎంత గాఢమైన భక్తితత్పరతతో పూజిస్తారోఅంతే గాఢమైన తలపుతో వారిని శ్రీహరి రక్షిస్తాడు. అందువలననే శ్రీహరిని భక్తితో కొలిచేవారికి కలగని సుఖములు లేవు!’ అని కర్తవ్యాన్ని బోధించి సురేంద్రుడి కలతను, కష్టాన్ని తీర్చాడు బృహస్పతి. తాను ఎదుర్కొనలేని ఆపదలో చిక్కుకున్న వేళ, వ్యర్థంగా కలత చెందడం మాని నమ్మిన దైవాన్ని శరణు వేడితే, ఆ ఆపద నుంచి గట్టెక్కే మార్గం కనపడుతుందని పై సన్నివేశం విదితం చేస్తుంది.– భట్టు వెంకటరావు -
ప్రహ్లాదుడి సచ్ఛీలత
నరసింహావతారం దాల్చిన శ్రీహరి హిరణ్యకశిపుడిని వధించాక, ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం లభించింది. శ్రీహరికి పరమభక్తుడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన ప్రహ్లాదుడి పరిపాలనలో ముల్లోకాలూ అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో తులతూగుతూ ఉండేవి. దేవ దానవ మానవులందరూ ప్రహ్లాదుడి సుగుణాలను వేనోళ్ల కీర్తించసాగారు. ప్రహ్లాదుడి ప్రాభవం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుండటంతో స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన దేవేంద్రుడికి బెంగ పట్టుకుంది. ఇక తనకు ఎన్నటికీ స్వర్గాధిపత్యం తిరిగి దక్కదేమోనన్నదే అతడి బెంగ. ఇదివరకు అతడు కొన్నిసార్లు రాక్షసుల చేతిలో దెబ్బతిని, స్వర్గాధిపత్యాన్ని వదులుకోవాల్సి వచ్చినా, హరిహరులలో ఎవరో ఒకరు అతడి రక్షణకు వచ్చి, దుష్టులైన ఆ రాక్షసులను సంహరించడంతో తిరిగి స్వర్గాధిపత్యం పొందగలిగాడు. ప్రహ్లాదుడు రాక్షసుడే అయినా, అతడు దుష్టుడు కాడు. సకల సద్గుణ సంపన్నుడు, పరమ భాగవతోత్తముడు. అతడికి అండగా సాక్షాత్తు శ్రీహరి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కేదెలా? దీనికి తరుణోపాయం చెప్పాలంటూ ఇంద్రుడు దేవగురువు బృహస్పతి వద్దకు వెళ్లాడు. ‘ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం ఎలా లభించింది? అతడి నుంచి నాకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కుతుందా? ముల్లోకాలూ అతడినే పొగుడుతున్నాయి? కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.‘నాయనా! ఇంద్రా! ప్రహ్లాదుడు ఉత్తములలోకెల్లా ఉత్తముడు. ఉత్తమోత్తమ జ్ఞాన సంపన్నుడు. ఉత్తమోత్తమ జ్ఞానసంపద కారణంగానే అతడికి త్రిలోకాధిపత్యం లభించింది.’ అని బృహస్పతి బదులిచ్చాడు. ‘ఉత్తమోత్తమ జ్ఞానం ఏమిటి? దయచేసి నాకు బోధించండి’ అని అర్థించాడు ఇంద్రుడు. ‘మోక్ష సాధనకు పనికి వచ్చేదే ఉత్తమోత్తమ జ్ఞానం. అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లు. అతడే నీకు ఆ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని బోధించగలడు’ అని సూచించాడు బృహస్పతి.బృహస్పతి సలహాపై ఇంద్రుడు శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. మోక్షాన్ని పొందగల ఉత్తమోత్తమ జ్ఞానాన్ని తనకు ప్రసాదించమని వేడుకున్నాడు. సరేనని బోధించాడు శుక్రాచార్యుడు. అప్పటికీ సంతృప్తి చెందని ఇంద్రుడు ‘ఆచార్యా! ఇంతకు మించినదేదైనా ఉందా? ఉంటే ఎక్కడ దొరుకుతుంది?’ అని అడిగాడు. ‘ముల్లోకాలలోనూ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని మించినది కూడా ఉంది. అదే సచ్ఛీలత. సచ్ఛీలత కావాలంటే ప్రహ్లాదుడి వద్దకు వెళ్లు.’ అని సూచించాడు శుక్రాచార్యుడు.బ్రాహ్మణ వేషం ధరించి, ప్రహ్లాదుడి వద్దకు చేరుకున్నాడు ఇంద్రుడు. తనకు జ్ఞానబోధ చేయమని అర్థించాడు. ‘నిత్యం రాజ్య వ్యవహారాలతో తలమునకలై ఉంటాను. నీకు జ్ఞానబోధ ఎప్పుడు చేయగలను? ఎవరైనా మంచి ఆచార్యుడిని చూసుకో’ అని సలహా ఇచ్చాడు ప్రహ్లాదుడు. అయినా పట్టు వీడలేదు ఇంద్రుడు. వీలున్నప్పుడే బోధించమన్నాడు. అంతవరకు శుశ్రూష చేసుకుంటూ ఉంటానన్నాడు. సరేనన్నాడు ప్రహ్లాదుడు. వీలు చిక్కినప్పుడల్లా ఇంద్రుడికి జ్ఞానబోధ చేయసాగాడు. ఇంద్రుడు కూడా వినయ విధేయతలతో ప్రహ్లాదుడికి శుశ్రూష చేయసాగాడు. ఇంద్రుడి శుశ్రూషకు ప్రసన్నుడైన ప్రహ్లాదుడు ‘ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు? ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు ఇలా బదులిచ్చాడు. ‘ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను. నా గురువులను ఇప్పటికీ సేవించుకుంటాను. ముల్లోకాలనూ ఏలుతున్నా ఇదంతా నా ఘనత అని భావించను. నా సచ్ఛీలతే నాకు శ్రీరామరక్షగా ఉంటోంది’ అని బదులిచ్చాడు. ‘అయితే, నీ సచ్ఛీలతను నాకు దానమివ్వు’ అని కోరాడు ఇంద్రుడు. అప్పుడు గ్రహించాడు ప్రహ్లాదుడు... తన ఎదుట ఉన్నది సాక్షాత్తు ఇంద్రుడేనని. అయినా ఏమాత్రం సంకోచించలేదు. తన సచ్ఛీలతను అతడికి దానమిచ్చేశాడు. ప్రహ్లాదుడి నుంచి ఒక తేజస్సు వెలువడింది. ‘నేను నీ సచ్ఛీలతను. నీవు నన్ను దానం ఇచ్చేశావు. అందుకే నిన్ను వీడి వెళుతున్నా’ అంటూ ఇంద్రుడిలోకి ప్రవేశించింది. ఆ వెంటనే అష్టలక్ష్ములు కూడా... సచ్ఛీలత లేనందున ఇకపై నీతో ఉండలేమంటూ ఇంద్రుడి శరీరంలోకి ప్రవేశించారు. సచ్ఛీలతతో పాటు తన ఐశ్వర్యం, రాజ్యసంపద సమస్తం తనను వీడిపోయినా ప్రహ్లాదుడు దిగులు చెందలేదు. ప్రశాంత చిత్తంతో నారాయణ మంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు. చివరకు శ్రీహరి అనుగ్రహంతో మోక్షాన్ని పొందాడు. ‘రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు. ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు బదులిచ్చాడు.


